తెలుగు సాహిత్యంలో అవధానం అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ.
ఏ ఇతర భాషల్లో లేనిది కేవలం తెలుగులో మాత్రమే ఉన్నది అవధానం.సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
అవధానం అంటే "అవ"పూర్వక డుజ్ -ధారణ పోషకయో: అనే ధాతువు నుండి అవధానమను పదం పుట్టింది. సామాన్య అర్థంలో అవధానం అంటే ఏకాగ్రత అని అర్థం.
ఈ అవధానానికి సంబంధించి వామనుడు తన కావ్యాలంకార సూత్ర వృత్తి యందు కావ్యాంగాలను వివరించుచూ అవధానం కూడా కవిత్వబీజంగా పేర్కొన్నాడు.
ఈ అవధాన విద్య క్రీస్తుశకం 13 వ శతాబ్దం నుండే ఉన్నట్లు మనకు తెలుస్తుంది.
నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు, పుష్పగిరి తిమ్మన తదితరులు వారి కావ్యాలలో అవధానం అనే పదప్రయోగం చేయడం జరిగింది. కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యానం రాసిన మల్లినాథసూరి తాను శతావధానిని అని చెప్పుకున్నాడు. చిత్రభారతాన్ని రచించిన చరిగొండ ధర్మన్న శతలేఖిన్యవధాన పద్యరచనా సంధాసురత్రాణ చిహ్నిత నాముడుగా పేరుపొందాడు. అలాగే రామరాజభూషణుడు, నెల్లూరు వీరరాఘవకవి, మధురవాణి, రామభద్రాంబ, రంగాజమ్మ, కృష్ణాజమ్మ,మరింగంటి సింగరాచార్యులు తదితర ప్రాచీన కవులు తాము శతావధానాలు చేశామని ప్రకటించుకున్నారు. అయితే వీటిలో ధారణతో కూడిన అవధానం ఉందో లేదా కేవలం శతపద్య రచన ఉందో తెలియదు. ఆధునికంగా 19 వ శతాబ్దంలో విద్వాన్ మాడభూషి వేంకటాచార్యులవారు స్వయంగా అవధానాలు చేసి అష్ట, శతావధానాలకు ఈ రోజు మనం చెప్పుకుంటున్న లక్షణాలు నిర్ణయించారు.
మాడభూషి వారు లక్షణాలు ఏర్పరచిన తర్వాత అవధానానికి బహుళ ప్రచారాన్ని, ప్రాశస్త్యాన్ని తెచ్చినవారు తిరుపతి వేంకటకవులు. వీరు మహాపండితులు. అవధానాలు చేయడం వల్లనే తెలుగు పద్యం ప్రజల్లో బతుకుతుందని నమ్మి సామాన్య ప్రజల ముంగిటకు అవధానాలు తీసుకొచ్చి పద్యానికి పట్టం కట్టిన అపర సరస్వతీ పుత్రులు తిరుపతి వెంకట కవులు. వారి తర్వాత దేవులపల్లి సోదర కవులు, వేంకట రామకృష్ణ కవులు, కొప్పరపు సోదర కవులు, శేషాద్రి రమణ కవులు, రాజశేఖర వేంకట శేష కవులు, దోమా వెంకటస్వామి గుప్తా, వేలూరి శివరామ శాస్త్రి, అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి, పిసుపాటి చిదంబరశాస్త్రి, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, పల్నాటి సోదర కవులు, కాకర్ల కొండలరావు, శిరశినహళ్ కృష్ణమాచార్యులు , రామేశ్వర కవులు, పింగళి కాటూరి కవులు, మాడుగుల వెంకట సూర్య ప్రసాదరాయకవి మొదలైన చాలామంది అవధాన్లు 20వ శతాబ్దపు పూర్వార్థంలో అవధాన విద్య ఊరేగించిన వారే.
20వ శతాబ్దపు ఉత్తరార్థంలో ప్రముఖ అవధానులు సి వి సుబ్బన్న, అవధానం చంద్రశేఖరశాస్త్రి, గౌరీ పెద్దిరామ సుబ్బశర్మ ,భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, భూతపురి బాల సుబ్బరాయుడు, మరింగంటి కులశేఖరాచార్యులు, కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, కురుబ నాగప్ప, ఆశావాది ప్రకాశరావు, శ్రీమతి ఆకెళ్ళ దుర్గనాగసత్యబాలభాను, ధూళిపాళ మహాదేవమణి, గౌరిభట్ల రఘునాథశర్మ, గౌరిభట్ల రామకృష్ణశర్మ, తిగుళ్ళ రాధాకృష్ణ శర్మ, తిగుళ్ళ శ్రీహరిశర్మ, బేతవోలు రామబ్రహ్మం, దివాకర్ల వెంకటావధాని, అందె వెంకటరాజం, మామిళ్ళపల్లి సాంబశివశర్మ, ముద్దు రాజయ్య, ధూపాటి సంపత్కుమారాచార్యా, గండ్లూరి దత్తాత్రేయశర్మ , మాడుగుల నాగఫణి శర్మ ,మేడసాని మోహన్, కడిమిళ్ళ (వరప్రసాద్)కోట కవులు, గరికపాటి నరసింహారావు, రాళ్ళబండి కవితా ప్రసాద్, జి ఎం రామశర్మ , పోచినపెద్ది సుబ్రహ్మణ్యం, అష్టకాల నరసింహరామశర్మ తదితరులెందరో అవధాన విద్యను సుసంపన్నం చేసారు.
సంస్కృతంలో శతావధానాలు చేసిన చెరువు సత్యనారాయణశాస్త్రి, దోర్భల ప్రభాకరశర్మ, రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు తదితరులు అవధాన విద్యను ముందుకు తీసుకెళ్లారు.
ఆ కోవలోనే నేడు యువ అవధానులుగా అవుసుల భానుప్రకాశ్, ఓంప్రకాశ్ తదితరులు పూర్వాచార్యులు అందించిన అవధాన విద్యను నేటితరానికి అందిస్తూ ముందుకు వెళ్తున్నారు.
*అవధానం లోని రకాలు*
అష్టావధానం :-
దీనిలో ఎనిమిది మంది పృచ్ఛకులు ఉంటారు. వీటిలో ఏఅంశాలు ఉండాలి అనేది అవధాని నిర్ణయించుకుంటారు.
ముఖ్యంగా చాలా మంది అవధానులు సమస్య, దత్తపది, నిషేధాక్షరి, న్యస్తాక్షరి ,వ్యస్తాక్షరి, ఆశువు, పుష్ప గణనం, ఘంటా గణనం, అప్రస్తుత ప్రసంగం వంటి అంశాలుంటాయి. ఇవే కాకుండా ఛందోభాషణం, పురాణపఠనం, కావ్యపఠనం ఇలాంటివి కూడా ఉండవచ్చు.
అష్టావధానం లోనే 16 మంది పృచ్ఛకులతో అవధానం చేస్తే ద్విగుణిత అష్టావధానమని, 24 మంది పృచ్ఛకులతో చేస్తే త్రిగుణితం అని,32 మంది పృచ్ఛకులతో అవధానం చేస్తే చతుర్గుణితాష్టావధానమని అంటారు.
ఇక అవధానాలలో రెండవది శతావధానం. శతావధానంలో 100 మంది పృచ్ఛకులు ఉంటారు.ఈ అవధానంలో పైన ఉన్నటువంటి అంశాలే కాకుండా వివిధ అంశాల్ని అవధాని ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా దత్తపది, సమస్య, వర్ణన, ఆశువు అనేటివి తప్పకుండా ఉంటాయి. అలాగే ఇది 200 మంది పృచ్ఛకులతో చేస్తే ద్విశతావధానమని అంటారు. ఈ అవధానం చేసిన వాళ్లలో మాడుగుల నాగఫణి శర్మ, గరికపాటి నరసింహారావు రాళ్ళబండి కవితా ప్రసాద్ ఇలాంటి వారు ఉన్నారు .
500 మంది పృచ్ఛకులతో చేసే అవధానం పంచశతావధానం. ఈ అవధానం మాడుగుల నాగఫణిశర్మ చేయడం జరిగింది. వెయ్యి మంది పృచ్ఛకులతో చేసే అవధానం సహస్రావధానం. ఈ అవధానం 16వ శతాబ్దానికి చెందిన ప్రభాకర శాస్త్రులు, 18 వ శతాబ్దానికి చెందిన నెల్లూరు కాళహస్తి కవి, భయంకర రాఘవాచార్యులు, జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీరామ్ వీరబ్రహ్మకవి, కడిమిళ్ళ-కోట కవులు, మాడుగుల నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావు మొదలగు వారు ప్రసిధ్ధులు.
బృహత్ ద్విగుసహస్రావధానం:- దీనిలో దాదాపు 2000 మంది పృచ్ఛకులు ఉంటారు. ఇది మాడుగుల నాగఫణి శర్మ గారు నిర్వహించారు .
అలాగే 500 మంది పృచ్ఛకులతో పంచ సహస్రావధానం నిర్వహిస్తారు ఇది చేసిన వారిలో మేడసాని మోహన్ గారు ముఖ్యులు.
ఇలా 13 వ శతాబ్ధంలో ప్రారంభమైన అవధానాలు ఇంతింతై సాహిత్య ప్రియులను అలరిస్తూ ఒక ప్రత్యేక ప్రక్రియగా సుస్థిరంగా నిలిచింది.
*అవధానాలు-అంశాలు*
అవధానిని బట్టి వారు ఎంచుకున్న అంశాలు అవధాన విద్యలో చోటు చేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనవి
సమస్య :--
సాహిత్యంలో సమస్యాపూరణం సరస వినోదంగా ,సహృదయ రంజకంగా ఉంటుంది. సమస్యలు ఏకపాదంతోను,ద్విపాదాలతోను, రెండున్నర పాదాలతోను,అర్థపాదంతోనూ ఇవ్వవచ్చు. పృచ్ఛకుడు ఇచ్చిన అసంబద్ధమైన,అనౌచిత్యమైన సమస్యకు అవధాని అర్థవంతంగా ఔచిత్యవంతమైన పూరణచేయడమే సమస్యాపూరణం.
దత్తపది :--
దీనిలో పృచ్ఛకుడు నాలుగు పదాల నిచ్చి వాటిని పద్యం నాలుగు పాదాల్లో ప్రయోగిస్తూ అర్థవంతమైన పూరణ కోరుతాడు.ఇక్కడ పృచ్ఛకుడు విషయాన్ని,ఛందస్సును నిర్ధేశిస్తాడు.అవధాని పృచ్ఛకుడు ఇచ్చిన ఈ పదాలు విరుద్ధమైన భావాలతో ఉన్నప్పటికీ పృచ్ఛకులు అడిగిన అర్థంలోనే అవధాని పద్యం చెప్పాలి.
వర్ణన:--
పృచ్ఛకుడు అవధానికి
తన ఇష్టం వచ్చిన అంశాన్నిచ్చి ఛందస్సు నిర్దేశిస్తూ ఇచ్చిన అంశాన్ని వర్ణించమని కోరుతాడు.
ఆశువు:--
చతుర్విధ కవితల్లో ఆశువు, బంధ, గర్భ, చిత్ర కవిత్వాలనేవి ప్రసిద్ధాలు.వీటిలో అవధానానికి ఆశువును ఒక అంశంగా స్వీకరిస్తున్నారు.
పృచ్ఛకులు అడిగిన ఆశువు అంశంపై అవధాని వేగంగా అప్పటికప్పుడు పద్యం చెప్పడం దీనిలోని లక్షణం.
నిషిద్ధాక్షరి:--
అవధాని ప్రతిభాపాటవాలకు గీటురాయి వంటిది.
అవధాని పద్యం ఎత్తుకోగానే తాను ఏపదాన్ని ఎత్తుకుంటున్నాడో పృచ్ఛకుడు ముందుగానే ఊహించి రాబోయే అక్షరాన్ని నిషేధిస్తాడు.అవధాని ఇంకొక అక్షరం వేసుకుని ముందుకు వెళ్ళాలి ఇలా అడుగడుగునా పృచ్ఛకుడు అడ్డుకుంటుంటే అవధాని అతనిని ఎదుర్కొంటూ పద్యం పూర్తి చేయడం కత్తిమీద సాము వంటిది.
వ్యస్తాక్షరి:--
ఈ అంశంలో పృచ్ఛకుడు తాను ఎంచుకున్న ప్రసిద్ధ వాక్యాన్ని గాని,పద్యపాదాన్నిగాని అక్షరాలుగా/పదాలుగా విడగొట్టుకొని అవధానికి ఆ అక్షరాలను/పదాలను అస్తవ్యస్తంగా అందిస్తాడు.అవధాని ఆ ఇచ్చిన అక్షరాలను/పదాలను సరైన రీతిలో సరిచేసి ఆవాక్యం చెప్పాలి.
న్యస్తాక్షరి:--
పృచ్ఛకుడు నాలుగు అక్షరాలను ఎంచుకొని వాటిని పద్యపాదాలలో ఎక్కడ ఉపయోగించాలో, ఏవిషయం వచ్చే విధంగా పద్యం చెప్పాలో నిర్ధేశిస్తాడు. పృచ్ఛకుడు అడిగిన విధంగా 4 పాదాలలో అవధాని ఆ అక్షరాలను ఉపయోగిస్తూ పద్యం చెప్పడం జరుగుతుంది.
పుష్పగణనం:--
దీనిలో పృచ్ఛకుడు అప్పడొకటి ఒ ఇప్పుడు ఒకటి అవధాని పై పుష్పాలు విసురుతాడు. చివరకు అవధాని ఆయన పుష్పాలు ఎన్ని విసిరాడో చెప్పాలి.
ఘంటా గణనం:--
అవధానం మధ్య మధ్యలో పృచ్ఛకుడు గంట వాయిస్తూ ఉంటాడు అవధానం పూర్తి అయిన తర్వాత ఎన్నిసార్లు గంట మోగించాడో అవధాని చెప్పాలి.
అప్రస్తుత ప్రసంగం :--
అవధాని పృచ్ఛకులు అడిగిన అంశాలపై దృష్టి సారించి మనసు ఏకాగ్రత తో ఉన్నప్పుడు అవధాని ఏకాగ్రతను భగ్నం చేయటకు అప్రస్తుత ప్రసంగి తలాతోక లేని ప్రశ్నలను అవధాని పై సంధిస్తాడు. అవధాని తన ఏకాగ్రతను కాపాడుకుంటూ హాస్యరస ప్రధానంగా సమాధానం ఇస్తూ సభాసదులను కడుపుబ్బ నవ్విస్తాడు.
ఇలా అవధాన ప్రక్రియ క్రీ.శ.13వ శతాబ్థం నుండి నేటి వరకు సాహిత్యప్రియులను, పండిత పామరులను అలరింపజేస్తూనే ఉంది.
రవీందర్ గాజుల
9848255525
రేపటికి నాంది ఈనాటి వ్యాసం.....
ReplyDeleteనేడు థియరీ- రేపు ప్రాక్టీకల్👍👌👌👍
ధన్యోస్మి కిరణ్ జీ
Deleteచదువరులందరికి చిన్న సూచన ఏమిటంటే అవధాన ప్రక్రియ ప్రాచీన తెలుగు కవులనుండి ఆ వారసత్వంగా నేటి పండితుల వరకు సాగింది.అయితే సంస్కృతంలో గతంలో,ఇప్పుడు కూడా అవధానాలు అక్కడక్కడ జరిగినయ్,జరుగుతున్నయ్.కాని సంస్కృతావధానాలు కూడా మన తెలుగు వారే ప్రవేశపెట్టి సంస్కృతావధానాలు చేపట్టారు కావున అవధానాలు తెలుగువారి సొత్తు అని చెప్పడం జరిగింది
ReplyDeleteవ్యాసం చాలా ప్రామాణికంగా, సమగ్రంగా ఉందన్నా!
ReplyDeleteఅవధానం నేపథ్యం, అవధానంలోని రకాలు సామాన్య పాఠకులకు సైతం అర్థం అయ్యే విధంగా సులభతరం చేసి వివరించారు. మొత్తంగా చూస్తే మీలోని పరిశోధనా దృక్పథం ప్రస్ఫుటమౌతున్నది.
@ స్తంభంకాడి గంగాధర్
గంగాధర్ కృతజ్ఞతలు.నీ ఆత్మీయసాహితీ స్పర్శకు ధన్యుడను
Deleteగాజుల గారూ! వ్యాసంలో నవనీతం కలిపినారు.సంతం.శుభం.
ReplyDeleteఅన్న,మీరు మెచ్చుకున్నరంటే దానికి ప్రామాణికత వచ్చినట్టే,ధన్యోస్మి
Deleteసంతసం
ReplyDeleteఅన్నయా.. చాలా సమగ్రమైన వ్యాసాన్ని అందించారు. ఆకర్షణీయంగా సబోధకంగా ఉండి అవధానంపై అవగాహనలేనివారి ముందు అరటిపండు ఒలిచారు.
ReplyDeleteకృతజ్ఞతలు
Deleteసంస్కృతాంధ్ర అవధానం కూడా చేసినట్టున్నారు cheppaledu. Adi kuuda oka నూతన prakriya కదా
ReplyDeleteఅవును
Delete