యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహా గిరిః
ఉభౌఖ్యాతౌ రత్న నిధీ తథా భారత ముచ్యతే
( ఆదిపర్వం)
పరమ పవిత్రమైన సముద్రము మహోన్నతమైన మేరు పర్వతము, సర్వ రత్నాలకు నిధిగా ఉన్నట్లే మహాభారతం సర్వ గుణ రత్నాలకు నిలయమై ఉన్నదని పై శ్లోకం యొక్క అర్థం.
ఎంతో గొప్పది అయిన భారత కథ లో విరాట పర్వం మంగళకరమని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ గ్రామాలలో వానలు పడాలని విరాట పర్వాన్ని చదువుతారు. గుడిలో కథగా చెప్పిస్తారు. విరాట పర్వంలోని ప్రధాన కథ పాండవుల అజ్ఞాతవాసం.
సమస్త హిందూ జాతి ఎంతో పుణ్యప్రదంగా భావించే విరాటపర్వంలో పాండవులు తమ అజ్ఞాతవాసంలో భాగంగా మారుపేర్లతో విరాట రాజు కొలువులోకి ప్రవేశించారు. మరి అప్పుడు వారికి అసత్య దోషం అంటాలి కదా! కానీ అలాఅంటలేదు.
వ్యాసభగవానుడి సత్య దృష్టి మన ఊహకు అందనంత దూరంగా ఉంటుంది. లోతుల్లోకి వెళితే కాని మర్మం అర్థంకాదు.
పాండవులకు మారుపేర్లు పెట్టడంలో వ్యాసుడు ఎంతో సత్య నిష్టను చూపి సమాజానికి చక్కని శాశ్వతమైన సందేశాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన మనకు నిత్య ఆరాధ్యుడు.అబద్దం చెప్పిన పాపం పాండవులకు అంటకుండా వారికి మారు పేర్లు పెట్టిన వ్యాసుని ప్రతిభ అనన్యసామాన్యం. దీని ద్వారా మానవజాతికి ఆయన ఇచ్చిన సందేశం అజరామరం, ఆచంద్రతారార్కం.
ధర్మరాజు విరాట రాజు కొలువులోకి "కంకుడు" అనే మారుపేరుతో ప్రవేశించాడు.ధర్మరాజు తన పేరును కంకుడు అని చెప్పుట అబద్దం కదా! కంక శబ్దానికి యమధర్మరాజు అని అర్థం ఉంది. ధర్మజుడు యముని కుమారుడు కాబట్టి " ఆత్మావై జాయతే పుత్రః" అనే శ్రుతి ప్రమాణాన్ని అనుసరించి తండ్రి కుమారుని రూపంలో పుడతాడు. తండ్రికి కుంకుడు అని పేరు ఉంది కాబట్టి ధర్మరాజు తన పేరు కంకుడు అని చెప్పడం వలన అతనికి అసత్య దోషం అంట లేదు.
భీముడు తాను పౌరోగవ కార్యాన్ని చేయుటకు విరాటరాజు కొలువులోకి " బల్లవ" పేరుతో ప్రవేశించాడు. పురోగు శబ్దం నుండి పౌరోగవ శబ్దం పుట్టింది . దానికి వాయువు అని అర్థం. పురోగు యొక్క పుత్రుడు పౌరోగవుడు అంటే వాయుదేవుని కుమారుడు భీముడు అని అర్థం. బల్లవ అనే శబ్దం పేరుగానే కాక వంటలవాడు అనే అర్థాన్ని కలిగి ఉంది. ఇది భీముడు చేసే పనిని సూచిస్తున్నది.కనుక ఈ పేరు అతనికి సార్ధకమైంది. ఈ కారణాల వలన భీమునికి అబద్దం చెప్పిన పాపం రాలేదు.
అర్జునుడు "బృహన్నల" పేరుతో కొలువులోకి ప్రవేశించాడు. బృహన్నల పేరులో లకారం ఉన్నది. సంస్కృత వ్యాకరణం ప్రకారం ' ర'- ' ల' లకు భేదము లేదు. బృహన్నల, బృహన్నర శబ్దాలకు తేడా లేదు. బృహన్నర అంటే పెద్ద నరుడు, మహాపురుషుడు అని అర్థాలున్నవి. నరనారాయణులు కృష్ణార్జునులు ఈ విధమైన అర్థం వలన అర్జునునికి అసత్య దోషం అంట లేదు.
ఇక నకులుడు "గ్రంథిక" పేరుతో కొలువు లోకి వచ్చాడు. ఆయుర్వేదం, అథర్వ విద్యలకు సంబంధించిన గ్రంథాలను చదివిన వారిని గ్రంథికుడు అంటారు . వేదాలలో అశ్విని కుమారులు వైద్యులు, అధ్వర్యులు అని చెప్పారు . నకులుడు తాను అశ్వనీ కుమారుల పుత్రుడినని చెప్పినందుకు అతనికి అసత్య దోషం అంటలేదు .
సహదేవుడు తన పేరును " తంతిపాలుడు" గా చెప్పుకున్నాడు. అనగా గోవుల మెడకు కట్టు తలు గులను, పలుపులను భద్రపరిచే వాడని అర్థం. తంతి అంటే మాట , వాక్కు అని మరియొక అర్థం ఉంది. దీని ప్రకారం తంతి పాలుడు అంటే రాజు ఆజ్ఞను పరిపాలించేవాడు అని అర్థం. ఈ రెండు అర్థాల వల్ల సహదేవునికి అబద్దం చెప్పిన పాపం రాలేదు.
ద్రౌపది తన పేరును "సైరంధ్రి"గా చెప్పుకున్నది. లోకంలో తన మానాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటూ ఇతరుల ఇండ్లలో పరిచారికలు గా పనిచేసే స్త్రీలను సైరంధ్రి అంటారు. జడలు అల్లడం , పూల మాలలు కట్టడం,గంధం తీయడం సైరంధ్రి చేసే పనులు. ద్రౌపది సుధేష్ణతో మొదటి సారి కలిసి మాట్లాడిన సందర్భంలో కూడా తాను చేసే పనుల గురించి స్పష్టంగా చెప్పింది .తన అభిమానాన్ని చాటుకున్నది. కాబట్టి ద్రౌపదికి అసత్య దోషం అంటలేదు.
ఈ విధంగా వ్యాసభగవానుడు ఎంతో సత్య దృష్టితో, ఔచిత్యంతో పాండవులకు మారు పేర్లను పెట్టి సత్యము గొప్పతనాన్ని చాటి చెప్పాడు .మాట్లాడే ప్రతి మాటలో సత్యం ఉండి తీరాల్సిందే అన్న సందేశాన్ని సమాజానికి ఇచ్చాడు.
********
ఆధారం: విరాట పర్వం - వచనం
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి
సంబరాజు రవిప్రకాశ రావు
9491376255
హైదరాబాద్
ధర్మరాజు యముని కుమారుడు కాదు. ధర్మదేవుని కుమారుడు. కొందరు పొరపాటుగా యమధర్మరాజు అని వ్రాస్తున్నారు. ఈ విషయం సామవేదం వారి ఉపన్యాసాలలో విన్నాను. అన్యధా భావించకండి. 🙏🙏🙏
ReplyDeleteఅన్న మంచి ఉపయుక్త సమాచారం.చాలా బాగుంది.మరిన్ని మీ నుండి రావాలి
ReplyDeleteచాలా మంచి వ్యాసం . నేను చదివినంత వరకు ధర్మ రాజు యముని కుమారుడే ! సామవేదం వారి వాదనకు తగిన ఆధారాలు చూపిస్తే బాగుండేది . కప్పగంతుల వారు గొప్ప పండితులు . వారి అనువాదం అద్భుత మని పండిత ఉవాచ ... సత్యం పై భారతం ఆధారంగా సంబరాజు రవిగారు రచించిన వ్యాసం ఎన్నో రహస్యాలను తెలిపింది. వారికి అభినందనలు . మంచి ఆధ్యాత్మిక వ్యాసం .......
ReplyDeleteChala manchi information.
ReplyDeleteChinnappudu telugu lo chadivanu,sir cheppinattu konni gurthu.
ReplyDeleteBagundi.
మంచి వ్యాసం ... విరాట పర్వం వింటున్నప్పుడు ఈ అనుమానం వచ్చింది. చాలా రోజుల తర్వాత అది తీరింది. వ్యాస భగవానుల రచనలోని సత్య నిష్టను మనకందరికి తెలియ జేసిన సంబరాజు రవిప్రకాశ్ గారికి ధన్యవాదాలు . ఇలాంటి వ్యాసాలు మరెన్నో మీ నుండి ఆశిస్తున్నాం. జై హిందూ ధర్మ ....
ReplyDelete