Sunday, September 27, 2020

వీరుడా నీకు వందనం

*వీరుడా నీకు వందనం*

స్వాతంత్ర్యదేవి అర్చనలో
జీవిత పుష్పాన్ని సమర్పించిన
వీరుడా నీకు వందనం
మాతృభూమి మధురభక్తిలో
దేహభ్రాంతిని వీడి మోక్షించిన
దేశభక్తుడా నీకు వందనం
భారతమాత ఆరాధనయజ్ఞంలో
ప్రాణసమిధల్ని ఆహుతి చేసిన
యోధుడా నీకు వందనం
'లాల్'హత్యకు ప్రతీకార ప్రతిన పూని
రాక్షసస్కాండర్ ని అంతం చేసిన
సాయుధుడా నీకు వందనం
బ్రిటీషుపాలకుల గుండెల్లో రణభేరివై
అసెంబ్లీ పై బాంబులు విసిరిన
విప్లవభానుడా నీకు వందనం
ఉరికి భయపడని ఉక్కుగుండెని కలిగి
కాల్చిచంపమన్న కోరికనడిగి
భారతీ పుత్రుడా నీకు వందనం
ఉరితీస్తే ఊపిరి గాల్లోనే పోతుందని
కాల్చివేస్తే కన్నమట్టితల్లిని చేరొచ్చని
మాతృభూమితో మమేకమైన
మరువలేని మహనీయుడా
విప్లవకొలిమిలోని నిప్పురవ్వవి నీవు
భారతమాత కన్న వీరపుత్రుడవు నీవు
భగత్ సింగ్ నిన్ను మరువలేము(సాకి కలం)

              భగత్ సింగ్ పేరు వింటేనే దేశభక్తి గుండెల్లో ఉప్పొంగుతుంది. ఆ రూపం తలపుల్లోకి వస్తేనే వీరత్వం నరనరాన ప్రవహిస్తున్నట్లుంటుంది. అతడు ఓ మండే అగ్ని గోళం. అతడు జ్వలించే ఓ నిప్పుకణిక. అతడు రెపరెపలాడే ఓ జాతీయ పతాక. 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరి కొయ్యను ముద్దాడి, మార్చి 23 న తన స్నేహితులయిన విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులతో పాటు అసువులు బాశాడు. నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురినీ వరుసగా నిల్చోబెట్టి ఉరి తీసింది. ఉరి కొయ్య ముందు నిల్చుని కూడా ఆ ముగ్గురూ ఏ మాత్రం భయపడలేదు. ఆ ధైర్యమే, ఆ శౌర్యమే ప్రవాహంలా మారి తరువాతి తరాలకు చేరింది.
           భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించాడు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. అలాగే హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. అతని ప్రభావం భగత్‌పై బాగా ఉండేది. పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్ పై విపరీత ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్య్ర పోరాటంలో మొదటిసారి పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టాడు. అయితే గాంధీ చేపట్టిన అహింసా ఉద్యమం వల్లే కాకుండా, హింసాత్మక ఉద్యమంతో కూడా బ్రిటిష్ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయలన్న ఆలోచనలో ఉండేవాడు. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ దురంతం అతనిలో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది. యుక్త వయసు వచ్చాక లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చేరాడు. అప్పుడే అతనికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ ఓ ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయాడు. ఆ ఉత్తరంలో నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకే కోరిక లేదు అని రాశాడు. ఇంటి నుంచి పారిపోయి నవ జవాన్ భారత సభ అనే సంఘం లో చేరాడు. ఆ సంఘం ద్వారా యువకులను ఆకర్షించి స్వాతంత్య్రోద్యమ సాధనకు పురికొల్పాడు. అనంతరం హిందూస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో లాలా లజపతి రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. సూపరింటెండెంట్‌గా ఉన్న సాండర్స్ లాఠీతో లాలా లజపతిరాయ్ గుండెలపై బలంగా కొట్టడంతో నేల కొరిగాడు. అతని మరణం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులలో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్లతోనే సాండర్స్ అంతు చూశారు. కసి తీరా కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌లు నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది.ఉరి కంబాన్ని ఎక్కే కొద్ది రోజుల ముందు భగత్ సింగ్ తన మాతృమూర్తితో ఇలా అన్నారు. ‘నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. నేను నవ్వుతూ మృత్యువుని అల్లుకుంటే భారతదేశంలో వున్న మాతృమూర్తులు అందరూ తమ బిడ్డలు భగత్ సింగ్‌లా కావాలని కోరుకుంటారు. బలీయమైన స్వాతంత్య్ర కాంక్ష వున్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు. అప్పుడే విప్లవ యోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్ట శక్తులకు సాధ్యం కాదు. అప్పుడు భగత్ సింగ్ తల్లి ఇలా స్పందించారు *“ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. గొప్ప మరణం అనేది ఎలా వుంటుంది అంటే ప్రపంచమంతా ఆ మరణం గురించే చెప్పుకుంటుంది”*

-సాకి.

Thursday, September 24, 2020

కర్మయోగి పండిత దీనదయాళ్

                                       
       కొందరు మరణించేవరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందినవారు పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ. అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్‌ 25న జన్మించి అసమాన్య వ్యక్తిగా ఎదిగారు. చిన్నతనంలోనే తల్లి, తండ్రి మరణించిన దీనదయాళ్‌ జీ మేనమామ ఇంటిలో పెరిగారు. 1925 ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టిన దయాళ్‌ కాన్పూర్‌లో బి.ఎ, చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుండి ఆయన జీవిత విధానం, గమ్యం మారిపోయింది. సంఘ్‌ విస్తరణకు పూర్తి సమయం ఇచ్చేందుకు ఆజన్మాంత ప్రచారకులుగా కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లభంపూర్‌ ప్రాంతానికి ప్రచారకులుగా నియుక్తులైన కొద్ది సంవత్సరాలలోనే ఆ ప్రాంతంలో సంఘ్‌ కార్యక్రమాలను వికసింపజేశారు. అది గమనించిన సంఘ్‌ పెద్దలు వారిని ఉత్తరప్రదేశ్‌ ప్రాంత సహ ప్రచారకులుగా నియమించారు. ఆయన అసమాన్యమైన ప్రతిభా పాటవాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంఘ్‌ కార్యక్రమాలు చూస్తూనే పత్రికారంగంపై దృష్టి సారించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్‌ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఆ ప్రకాశన్‌ ద్వారా రాష్ట్ర ధర్మ అనే ఒక మాస పత్రిక, పాంచజన్య అనే వారపత్రిక, స్వదేశ్‌ అనే దిన పత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలు దీనదయాళ్‌ జీ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి. గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని హిందూ మహాసభతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ పై కూడా మోపి ఆనాటి ప్రధాని నెహ్రూజీ సంఘ్‌ను నిషేధించారు. ఆ నిషేధాన్ని తొలగించాలంటూ జరిగిన ఉద్యమానికి ఉత్తరప్రదేశ్‌లో దీనదయాళ్‌ జీ నిర్వహించిన పాత్ర గణనీయమైంది. ఈ హత్యానేరంలో సంఘ్‌ పాత్ర లేదని దీనదయాళ్‌ జీ పాంచజన్యలో స్పష్టం చేస్తూ ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా రాసిన రాతలకు ఆనాటి ప్రభుత్వం పాంచజన్యను నిషేధించింది. దానికి బదులుగా హిమాలయ అనే మరో వార పత్రికను ప్రారంభించి తన కలంతో నాటి ప్రభుత్వానికి కలవరం పుట్టించారు. ఈలోగా గాంధీజీ హత్యానేరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేదని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. జాతి, జాతీయత, భారతీయ సంస్కృతి, ధర్మం మొదలైన విషయాలపై ఆయనలోని అభిప్రాయాలు, మౌలిక సిద్ధాంతాలు తదితరాలపై ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది. నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలు, భారతీయ తత్వజ్ఞాన సారాన్ని దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి సామ్రాట్‌, చంద్రగుప్త, జగద్గురు శంకరాచార్య అనే చారిత్రక నవలలను కూడా దయాళ్‌జీ రాశారు. 1951లో డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ప్రధాని నెహ్రూ జీ విధానాలకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చారు. ఆనాడు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ అనుసరిస్తున్న, ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను ఎదుర్కొనడానికి, భారతీయ సంస్కృతి సభ్యులతో, జాతీయ భావాలతోకూడుకున్న రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌ పరమ పూజనీయ గురూజీ సహాయాన్ని అర్థించారు. ఆయన కోరిక ప్రకారంగా పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ జీ, లాల్ కృష్ణ అద్వానీ, బైరాన్ సింఘ్ షెకావత్,   జగన్నాధరావు జీ, సుందర్‌ సింగ్‌ భాండారి, నానాజీ లాంటి మరికొందరు యువకులను అప్పగించారు. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ 1951 అక్టోబరు 21న ఏర్పాటు చేసిన జనసంఘ్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దీనదయాళ్‌ జీ ఎన్నికైనారు. పార్టీ స్థాపించిన మూడు మాసాలకే 1952లో జరిగిన జనరల్‌ ఎన్నికలలో పోటీ చేసిన నాలుగు జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటిగా జనసంఘ్‌ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు పొందింది. తన ఉనికిని సాధారణ ఎన్నికలలో రుజువు చేసుకోగలిగింది. దీనికి డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ నాయకత్వంతో పాటు దీనదయాళ్‌ జీ సమన్వయ కౌశలం కూడా తోడైంది. ఆ తర్వాత కాశ్మీర్‌లో సత్యాగ్రహం చేసిన డాక్టర్‌ ముఖర్జీ అనుమానాస్పద మరణం చెందటం జరిగింది. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మరణం తర్వాత జనసంఘ్‌ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ పార్టీని దేశవ్యాప్తంగా పటిష్ఠపరచిన ఘనత దీనదయాళ్‌జీకి ఆయన సహచరులకు దక్కుతుంది. భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించారు. భారతీయ జనసంఘ్‌ అఖిల భారత కార్యదర్శిగా ఎక్కువకాలం పనిచేసిన దీనదయాళ్‌జీ కార్యకర్తల మనోహృదయాలను మలిచి వారి మనస్సులలో అతి ప్రముఖ స్థానాన్ని చూరగొన్నారు. సుఖమంటే ఏమిటో తెలియక కష్టాలనే చవిచూస్తూ దేశ సేవ నిమగ్నమై దానినే జీవన కార్యంగా స్వీకరించారు. జనసంఘ్‌లో చేరినప్పటి నుంచి మహారథియై పార్టీకి సారథ్యం వహించి, దేశ రాజకీయాలలో జనసంఘ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో కృతకృత్యులై 1967లో పార్టీ అఖిల భారత అధ్యక్షులైనారు. కాలికట్‌లో జరిగిన అఖిల భారత జనసంఘ్‌ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపచేసి విశేష కీర్తి నార్జించారు. 
ఒక సిద్దాంతం నుండి మరొక సిద్దాంతానికి ఊగిసలాడుతూనే ఉన్నాం కానీ మన నాగరకత విలువల ఆధారంగా ఆలోచించలేకపోయాం. మొదట రష్యా సోషలిస్ట్ నమూనావైపు ఆకర్షితులమై ఆ తరువాత పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానాన్ని కూడా కలగలిపి గందరగోళమైన `మిశ్రమ ఆర్థిక వ్యవస్థ’ ను రూపొందించుకున్నాం. కానీ మన ధార్మిక సంప్రదాయపు విలువలపై ఆధారపడిన ఏకాత్మ మానవ దర్శనాన్ని ఇప్పటికైనా పరిశీలించాలి’’  “ఏకాత్మ మానవవాదం – ప్రపంచానికి దిశా నిర్దేశం”  `మాతృ భూమి’ భావనలో నమ్మకం లేనివారు దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదకారులప్రతిఒక్కరు తమ తిండి తామే సంపాదించుకోవాలన్నది పాశ్చాత్య భావన అని, కానీ పిల్లలు, వృద్దులు, చేతకానివారిని సమాజమే పోషించాలని, మనిషి కేవలం ఆహార సంపాదన కోసమే పనిచేయకూడదని, సామాజిక బాధ్యతలు, విధులు నెరవేర్చడానికి పనిచేయాలని 1967లోనే దీన్ దయాళ్ జీ ప్రబోధించారు. కమ్యూనిస్టులు, సోషలిస్ట్ లకు `సమగ్ర మానవుడు’ అనే భావన అర్ధం కాదు. మనకి అటు సామ్యవాదం కానీ ఇటు పెట్టుబడిదారీ వాదం అవసరం లేదు. సమగ్ర మానవుని ఆనందమే మనం కోరుకుంటామని సమాజంలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం ఆ సమాజపు కనీస బాధ్యత. అందుకు రుసుము వసూలుచేయడం మన సాంప్రదాయంలో ఎప్పుడూలేదు. స్వాతంత్ర్యానికి ముందు ఏ రాజ్యంలోను విద్యకు రుసుము వసూలు చేయడం అనే పద్దతి లేనేలేదు. ప్రభుత్వమే ఉచితంగా వైద్య సదుపాయాన్ని కలిగించేది. ఇలా ఒక వ్యక్తి విద్యా, వైద్యం కోసం రుసుము చెల్లించాల్సి వస్తే అది ధార్మిక రాజ్యం కానేకాదు. పనిచేయగలిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి చూపించడం ప్రభుత్వ బాధ్యత. 70 ఏళ్లుగా దీన్ దయాళ్ జీ ఆలోచనలు, తత్వాన్ని ఈ దేశం పట్టించుకోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆలోచనల ప్రభావంతో ప్రధాని నరేంద్ర మోడి ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన, స్కిల్ ఇండియా, పంట బీమా, బేటీ బచావో – బేటీ పడావో వంటి పథకాలు ప్రవేశపెట్టగలిగారు. జన్ ధన్ యోజన కింద 25 కోట్ల బ్యాంక్ అక్కౌంట్ లు తెరిచారు. ప్రపంచంలో ఇటువంటి అద్భుతమైన కార్యం ఎక్కడ జరగలేదు. అలాగే ప్రభుత్వం పని హక్కును కూడా కల్పించే ప్రయత్నంలో ఉంది. ఇటువంటి దార్శనికుడిని కేవలం ఒక పార్టీకి చెందినవాడని, ఒక సిద్దాంతానికి పరిమితమైనవాడని అనడం అన్యాయం. దీన్ దయాళ్ జీ ది ఒక సమగ్రమైన ఆలోచన ధోరణి. ఇటువంటి ధోరణిని జాతి గుర్తించకుండా నెహ్రూవాదులు, మార్క్సిస్ట్ లు చూశారు. గాంధీ, నెహ్రూ, మార్క్స్ ల గురించి మన పాఠశాలల్లో చెపుతున్నారు. ఇకనుండి దీన్ దయాళ్ జీ గురించి కూడా మన పిల్లలకు బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన పార్లమెంట్ సభ్యుడు కాకపోయిన వందలాది ఎం పి లను తయారుచేయగల ఆలోచన కలిగినవారు.చారిత్రక తప్పిదాన్ని సరిచేసుకుని ఆయనకు సరైన స్థానాన్ని కల్పించడం మన కర్తవ్యం. అటల్జీ చెప్పినట్లుగా “రాజకీయాలు ఆయనకు సాధనం మాత్రమే. లక్ష్యం కాదు. ఆయన వైభవోపేతమైన గతాన్ని ఎప్పుడు మరచిపోలేదు. అలాగే రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడు వెనుకడుగు వేయలేదు.’’ “ఆయన నిరాడంబరత్వమే నాకు ఎప్పుడు గుర్తుకువస్తుంటుంది. పార్టీని సరిగా నడిపే కార్యకర్తలను తయారుచేయడం పైనే ఆయన దృష్టి పెట్టారు. కార్యకర్తలు పార్టీని నడిపితే పార్టీ దేశపు బాగోగులను చూస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోడి అంటారఆర్థిక వ్యవస్థ బలాబలాలను కేవలం జిడిపితో వృద్ధిరేటు కొలవలేమని, ప్రజల బాగోగులను పట్టించుకునే వ్యవస్థను రూపొందించుకోవాలని దీనదయాళ్‌జీ అభిలషించారు . ఆ కీర్తియే జనసంఘ్‌ సిద్ధాంత వ్యతిరేకుల కినుకకు కారణమైంది. వారి దుష్ట రాజకీయాలకు మహాతపస్వి బలి అయినారు. ఉత్తరప్రదేశ్‌లోని మొగల్‌ సరాయి రైల్వే స్టేషన్‌లో 1968 ఫిబ్రవరి 11న రైలు పట్టాల వద్ద శవమై కనిపించారు. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మరణం మాదిరిగానే దీనదయాళ్‌జీ మరణం కూడా పలు అనుమానాలకు దారితీసింది. దీనదయాళ్‌జీ వంటి మహావ్యక్తి మరణంతో కార్యకర్తల హృదయాలు ఎంతో మనోవేదన చెందాయి. . సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైన, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విచారణ కమిషన్ వేస్తారు. అందుకు కమీషన్స్ ఆప్ ఎంక్వయిరీ యాక్ట్ నైటు 22 అవకాశం కల్పిస్తుంది. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ అదృశ్యంపై 1956 లో షానవాజ్ కమీషన్ , 1970 లో జి.డి ఖోస్లా కమీషన్ , 1999లో మనోజ్  ముఖర్జీ కమీషన్  విచారణ చేపట్టాయి. మహాత్మా గాంధీ హత్య పై కపూర్ కమీషన్, ఇందిరాగాంధీ మరణం పై ఠక్కర్ కమీషన్ , రాజీవ్ గాంధీ మృతిపై జె. ఎస్. వర్మ కమీషన్, ఎమ్. సి. జైన్ కమీషన్ నియమించారు.  దీనదయాళ్‌జీ మరణం భిన్నమైనది అనుమానాస్పదమైనది. జాతీయ, అంతర్జాతీయ, సంతుష్టీకరణ రాజకీయ కుట్రల్లో భాగంగా జరిగిన డాక్టర్ ముఖర్జీ మరణం, ఆయన ప్రీయ సహచరుడు, వారసులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మొఘల్ సరాయి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన అనుమానాస్పద స్థితిలో జరిగిన హత్య మాత్రం వృధాగా పోలేదు. దేశాన్ని అన్ని రంగాల్లో మేటిగా తీర్చిదిద్దాలన్న ఆయన ఆశయాలు ప్రజలు, పార్టీ, కార్యకర్తల ముందున్నాయి. పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో, 75% రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తుంది. దీనదయాళ్ జీ సిద్ధాంతాలు, విధానాలు అయిన ఆర్థిక జాతీయవాదం, సాంస్కృతిక జాతీయవాదం, సామాజిక జాతీయవాదం, ఏకాత్మత మానవతావాదం పై విస్తృతంగా పరిశోధనలు జరిగితే  ఉజ్వల భవిష్యత్తు భారత దేశం నిర్మాణం అవుతుందన్నది సామాజిక వాస్తవం. ఈ సమయంలో కర్మ యోగి  దీనదయాళ్‌జీ  ఆశయాలస్ఫూర్తి తో సమున్నత, సమైక్య భారత్ కలను సాకారం చేసుకునేందుకు దేశీయ ఆలోచనలు, విధానాలు విలసిల్లే వాతావరణాన్ని ఏర్పర్చుకోనేందుకు మనమంతా కలిసి పనిచేద్దాం. 
                                                                                                కొట్టె మురళీకృష్ణ 

మానవాళి సమగ్ర వికాసమే ఏకాత్మతా మానవ దర్శనం

మానవాళి సమగ్ర  వికాసమే ఏకాత్మతా మానవ దర్శనం


మానవజాతి స్వయం వినాశనానికి గురి కాకూడదంటే పాశ్చాత్యంతో మొదలైన అధ్యాయం భారతీయంతో  ముగియ వలసి ఉన్నది, మానవ జాతి  చరిత్రలో అత్యంత విపత్కర సందర్భాల నుండి మానవ జాతిని విముక్తి చేయగలిగే మార్గం భారతీయం లోనే ఉంది. అశోక చక్రవర్తి, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, రామకృష్ణ పరమహంస చాటిచెప్పిన సర్వమత సామరస్యం మానవజాతి మొత్తం ఒకే కుటుంబంగా అభివృద్ధి చెందడానికి కావలసిన దృక్పథం, స్ఫూర్తి  అందులో ఉన్నాయి. మనల్ని మనం సర్వనాశనం చేసుకోకుండా ఉండేందుకు మన ముందున్న ఏకైక ప్రత్యమ్నాయం  భారతీయమే. ఈ విషయాలు నానిపాల్కివాలా   "ది ప్రైసెలెస్  ట్రెజర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్" గ్రంథము లోనివి, అట్లాగే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ రెండవ సర్ సంఘ చాలకులు పూజనీయ శ్రీ గురూజీ మానవాళి సమగ్ర వికాసంలోని తొలి దశ భౌతిక వాదం, వికాసం ఎప్పుడూ స్థూలం నుంచి సూక్ష్మానికి సాగుతుంది, అందుకే తొలిదశలో మనిషి భౌతిక వాదం వైపు ఆకర్షితుడై తన శక్తులన్నింటినీ భౌతిక అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగిస్తాడు, ఇంకా కొంచెం పరిణతి చెందిన దశలో భావోద్వేగాలను అర్థం చేసుకొని మానసిక ఆనందం కోసం ప్రాకులాడుతాడు  ఈ స్థితిలోనే అతడు కళల పట్ల సంస్కృతి పట్ల ఆకర్షితుడవుతాడు, కళారూపాలను సృష్టించడంలో కళలలో దాగిన సౌందర్యాన్ని గుర్తించడంలోను  ఆనందాన్ని పొందడం మొదలు పెడతాడు, విజ్ఞాన శాస్త్రాలనీ, తత్వ శాస్త్రాలనీ  అధ్యయనం చేసేందుకు పూనుకుంటాడు. మెల్ల మెల్లగా తన అస్తిత్వ పరమార్ధాన్ని గుర్తించే స్థాయికి ఎదుగుతాడు, ఆ తర్వాత   బుద్ధికి  కూడా  అతీతమైన సూక్ష్మ స్థితిని, సచ్చిదానందాన్ని పొందుతాడు,ఇది మానవుడు పరిణామం చెందే క్రమం, వీటి గురించి ప్రపంచం ఏమీ ఆలోచిస్తుందో మన దేశం ఏమి ఆలోచిస్తున్నదో దీనదయాళ్ ఉపాధ్యాయ సమగ్రంగా ఆద్యయనం చేసి ఆధునిక యుగానికి అవసరమైన ఒక సమగ్ర ఆలోచనను మనకు  అందించారు, ఆ అలోచనే "ఏకాత్మ మానవ దర్శనం".

     దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్ లోని  మధుర జిల్లాలో నగాలచంద్రభాను  అనే గ్రామంలో జన్మించారు.     పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు వారి  చిన్న వయసు నుండే అద్భుత మేధాశక్తి వెల్లడైంది. వారి జీవితాన్ని దేశానికి సమర్పించిన మొదటి ఘట్టం 1937లో కాన్పూర్ లో డిగ్రీ చదువుతున్నప్పుడు రాష్ట్రీయస్వంసేవక్ సంఘం లో చేరటం, 1942  వ సంవత్సరం సంఘ ప్రచారక్ గా రావటం రెండవ ఘట్టం, 1952 సంవత్సరంలో భారతీయ జనసంఘ్ పార్టీలో ప్రవేశించడం మూడవ ఘట్టం, అనతికాలంలోనే భారతీయ జనసంఘంను   జాతీయ పార్టీగా తీర్చిదిద్దిన సంఘటన కౌశల్యం వారిది, ఈ దేశ సమగ్ర వికాసం కోసం తద్వారా మానవ జాతి వికాసానికి నమూనాగా నిలువగలిగే ఏకాత్మత మానవ దర్శనం 1965 సంవత్సరం విజయవాడలో జరిగిన అఖిలభారత జన సంఘం కార్యకర్తల సమావేశంలో వివరించారు అది వారి జీవితంలో నాలుగో ఘట్టంగా చెప్పుకోవచ్చు.  ఆ క్రమంలో వారి ఆలోచనలను కొన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాము.

    జీవన సమస్యల మీద  ప్లేటో తాత్విక చింతనలను  చదివిన వారు కూడా  ఎక్కడ మానవ మేధస్సు అద్భుత ఆవిష్కరణలు చేసిందో, అతి ముఖ్యమైన జీవన సమస్యల మీద లోతుగా అధ్యయనం చేసిందో, ఆ భారతీయ  తత్వశాస్త్రాలను వారు కూడా అధ్యయనం చేయవలసి ఉంది. మానవ జీవితాలకు గొప్ప పరిష్కారాలను ఎవరు కనుగొన్నారని  నన్ను ఎవరైనా అడిగితే నేను భారతదేశాన్ని చూపిస్తాను. ఆక్కడ యూరప్ లో కేవలం గ్రీకుల, రోమన్ల, యూదుల ఆలోచనలతో ఎదిగారు. మనదేశంలో  మనం మన అంతరంగ జీవితాన్ని మరింత పరిపూర్ణంగా, విస్తారంగా, విశ్వజనీనంగా, మానవీయంగా మార్చేందుకు, ఈ ఒక్క జన్మకే కాక శాశ్వతత్వాకి అవసరమైన సంస్కారాలను రూపొందించేందుకు కావలసిన వివరణ మన సాహిత్యంలో ఉన్నది.  అది  ఎక్కడి నుండి పొందగలము అన్న ప్రశ్న ఎవరైనా  వేసిప్పుడు కూడా  నేను భారతదేశాన్ని చూపిస్తాను, అని నాని పాల్కివాలా  చెప్పారు.

                           అట్లా పాశ్చాత్య దేశాల ఆలోచనల ఆసమగ్రతను లోతుగా పరిశీలించారు దీన్ దయాల్ జీ. పాశ్చాత్య సిద్ధాంతాల  అన్నింటిలోనూ ఉన్న ఒక సామాన్య లక్షణం ఏమిటంటే అవన్నీ కూడా ఒక విషయానికి ప్రతిస్పందనలగాను, లేదా  ప్రతిక్రియాత్మకంగాను  ఏర్పడిన సిద్ధాంతాలు, పోప్ నిరంకుశత్వానికి ప్రతి క్రియగా జాతీయవాదం ఏర్పడితే, రాజ్యం యొక్క విశేష అధికారాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యం వచ్చింది, ఆ ప్రజాస్వామ్యము పెట్టుబడిదారీ విధానాన్ని పెంపొందించింది,పెట్టుబడిదారీ విధానానికి ప్రతి చర్యగా సమాజ వాదము[సోషలిజం ], సామ్యవాదం[కమ్యూనిజం]  పుట్టుకొచ్చాయి, పైన చెప్పిన మూడు ప్రతిచర్యలు కూడా ఎన్నో సంఘర్షణలకు, రక్తపాతానికి కారణమయ్యాయి. ఏ  సిద్ధాంతానికైనా సంఘర్షణలు అనివార్యమని సర్దిచెప్పుకోవచ్చు అయితే అక్కడ ఆ సంఘర్షణలను నివారించటానికి బదులు సంఘర్షణలకు సిద్ధాంత రూపం ఇవ్వడం జరిగింది, జీవ పరిణామమే  సంఘర్షణల పరిణామమని  ఆ సిద్ధాంతం చెబుతున్నది, డార్విన్ జీవ శాస్త్ర సిద్ధాంతం, హెగెల్ ప్రతిపాదించిన గతితార్కిక వాదం, మార్క్స్ చారిత్రక విశ్లేషణ  అన్ని ఆ సంఘర్షణ  సిద్ధాంతాన్ని ఆధారం  చేసుకున్నవే, పోటీని, సంఘర్షణను  శాస్త్రీయ సత్యాలుగా పెట్టుబడిదారి అర్థశాస్త్రం పరిగణిస్తుంది, పెట్టుబడిదారీ వ్యతిరేక శక్తులన్నిటిని సమీకరించి విప్లవం ద్వారా వర్గ రహిత సమాజాన్ని సాధించాలని కలలు కన్నది కమ్యూనిజం.  ఈ నేపథ్యంలో మానవ జీవితం గురించి దీనదయాళ్ జీ చెప్పిన మాటలు గమనిద్దాం. జీవితంలో చాలా అంశాలు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఉంటాయి, ఏ  అంశానికి ఆ అంశాన్ని విడివిడిగా మిగతా వాటితో సంబంధం లేకుండా అధ్యయనంచేసి దాని  ఆధారంగా మానవ జీవితం మొత్తానికి సంబంధించిన తీర్మానాలు చేయడం సరైన ఫలితం ఇవ్వదు ఇలా అసమగ్రంగా సాగిన ఆలోచనలు, వాటి ఆధారంగా చేసిన సమన్వయాలే పాశ్చాత్య దేశాలలోని చాలా సమస్యలకు మూలకారణం అంటారు దీనదయాళ్ జీ. మనిషి జీవితాన్ని రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయాలు మాత్రమే ప్రభావితం చేయవు, మనిషికి కుటుంబం, జాతి,నమ్మకాలు అతని దేశచరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు, స్నేహితులు, శత్రువుల  వంటివి ఎన్నో ఉంటాయి అవన్నీ అతనికి ముఖ్యం,ఈ విషయాలను గ్రహించటంలో కారల్ మార్క్స్ కూడా విఫలమైనాడు అలాగే  కుటుంబాలకు దేశాలకు కూడా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉంటాయి, ఒక కుటుంబానికి వాళ్ల కులదైవం, ఆచారాలు, సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఒక దేశానికి దాని చరిత్ర భౌగోళిక పరిస్థితులు ఆచారాలు, ఆదర్శాలు దానికి ఉంటాయి.  వాటన్నిటితో కలిసి ఏర్పడేదే ఒక ప్రత్యేక గుర్తింపు. అలా ప్రతి వ్యక్తికి, కుటుంబానికి, దేశానికి వాటి వాటి పరిధిలో  ప్రత్యేకత, శక్తి వాటికి ఉంటాయి. ఐక్యత గురించి ఆలోచించేటప్పుడు ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నిజమైన ఐక్యత ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే ఎవరి ప్రత్యేకతలను వారు నిలబెట్టుకుంటూనే పరస్పరం సహకరించు కోగలిగినప్పుడు మాత్రమే సాధ్యం, దానినే మనం'' భిన్నత్వంలో ఏకత్వం'' అంటాము, అలా కాక భిన్నత్వాన్ని గుర్తించకుండా అన్ని వైరుధ్యాలను అణిచివేయడం ద్వారా లేక నియంత్రించడం ద్వారా ఐక్యత  సాధించాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం మనం ఆశించిన ఫలితాలను ఇవ్వదు, ఇవ్వకపోగా ద్వేషానికి సంఘర్షణలకు కారణం అవుతుంది, క్రిస్టియానిటీ, ఇస్లాం, కమ్యూనిజం చరిత్రలు దానికి సాక్ష్యం.

ఒక శిశువుకి ఉండే పరిమిత చైతన్య స్థాయి నుంచి సకల మానవాళిని కలుపుకునే స్థితి వరకూ సాగే ఈ ప్రయాణం గురించి దత్తోపంత్ జీ  ఇలా వివరిస్తారు "నేను అనే పరిధి, కుటుంబం వంటి  వివిధ వృత్తుల మీదుగా ప్రయాణించి సమస్త విశ్వం వరకూ విస్తరించడమే. ఆత్మ జ్ఞానానికి నిదర్శనం ఆత్మ జ్ఞానము గూర్చి అవగాహన ఎంతగా పెరిగితే అంతగా నేను గూర్చి వ్యాపకత పెరుగుతుంది. అయితే ప్రయాణంలో నేను అన్న చైతన్యం పైస్థాయికి సాగుతున్నప్పుడు అంతకు మునుపు దాటి వచ్చిన క్రింది స్థాయిలతో ఘర్షణ ఉండదు అవికూడా ఆ చైతన్యంలో లీనమయివుంటాయి, ఈ సిద్ధాంతం లోని ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రత్యేకంగా ఏకాంతంగా ఉండే '' నేను''  గురించి చెప్పదు, కొన్ని అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవటం , కొన్ని అంశాలను వదిలివేయడం ఉండదు  అన్నిటినీ కలుపుతూ సాగుతుంది, విడివిడిగా చూడటం అంటే కుటుంబంతో కలిపినప్పుడు నేను నీ  ప్రేమించి లేకపోవటం, సమాజంతో కలిసినపుడు కుటుంబాన్ని ప్రేమించి లేకపోవడం జరుగుతుంది.   సర్పిలాకారము లో  అటువంటి   విభిన్న ఆత్మలకి స్థానం లేదు, ఉన్నది ఒక్కటే ఆత్మ, ఒకటే నేను, అంటే నాలోని నేను అనే చైతన్యం సమాజం వరకు వ్యాపించినప్పుడు నేను, సమాజాన్ని, కుటుంబాన్ని, నన్ను కూడా ప్రేమిస్తాను, అలాగే సకల మానవాళి తోనూ నన్ను నేను కలుపుకునే స్థాయికి ఎదిగినప్పుడు కూడా నా  జాతిని దేశాన్ని నేను ప్రేమిస్తాను. అంతిమంగా విశ్వం తో తాదాత్మ్యం చెందినప్పుడు నేను నా దేశం తో నే ఉంటాను. వ్యక్తి, కుటుంబం, దేశం, సకల మానవాళి ఈ చరాచర సృష్టి చివరికి సర్వవ్యాపకుడైన పరమాత్మ ఇలా అన్ని విభిన్న స్థాయిలలో ఏకకాలంలో తాదాత్మ్యం చెందగలుగుతాను, అదే "ఏకాత్మతా మానవ దర్శనం".

  ఒక సాధారణ వ్యక్తిగా మనం  ఈ ఏకాత్మ  మానవతా  సిద్ధాంతం మొత్తాన్ని ఒకేసారి అర్థం చేసుకోవటం ,చేసుకున్న దానిని ఆచరించడం కష్టం కావచ్చు, కొద్ది కొద్దిగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి అంచెలు అంచెలుగా మన  ప్రయాణం సాగాలి.

--రాంపల్లి మల్లికార్జున్

Monday, September 21, 2020

హజియా సోఫియా, రామమందిరం ఒకటేలా అవుతాయి?


హజియా సోఫియా, రామమందిరం ఒకటేలా అవుతాయి?


ఐదు శతాబ్దాల ధర్మబద్ధమైన పోరాటం ఫలించి ఆగస్ట్ 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రజల సంతోషాన్ని, హర్షాన్ని నీరుగార్చేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ కొందరి దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రజలంతా ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించారు. రాజ్యాంగబద్ధంగా హిందూ సమాజం సాధించిన విజయం అది. హిందువుల సంయమనం, సహనం, ధర్మ బుద్ధిని ప్రశంసించవలసినదిపోయి బూటకపు సెక్యులరిస్ట్ లు, ఉదారవాదులు, ఇస్లాంవాదులు, ఉదారవాదులుగా చెలామణి అవుతున్న ఇస్లాంవాదులు పదేపదే హిందువులను అవమానించారు. అదృష్టవశాత్తు హిందువులు కూడా `భౌతికమైన’ దాడులకు దిగలేదు.


అన్ని మతాలను ఒకటిగా చూసే హిందువును కూడా ఇటీవల కొన్ని పరిణామాలు మాత్రం ఆలోచనలో పడవేసే విధంగా ఉన్నాయి.


టర్కీలోని హజియా సోఫియా ప్రదర్శనశాలను మసీదుగా మారుస్తున్నట్లు ఆగస్ట్ 9న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు అది మసీదేనని, క్రైస్తవులే దానిని చర్చ్ గా మార్చారని ప్రభుత్వం తెలిపింది. కమల్ అతతుర్క్ కాలంలో ఆ చర్చ్ ని ప్రదర్శనశాలగా చేశారు. అయితే క్రైస్తవులు, ముస్లింల మధ్య ఆ కట్టడం అనేకసార్లు చేతులుమారిందన్నది ఎవరూ చెప్పరు. ఒకప్పుడు పాగన్ ఆలయం అయిన ఆ కట్టడం మసీదుగా మారడానికంటే ముందు చర్చ్ గా ఉండేదన్నది నిజం. ప్రదర్శనశాలను తిరిగి మసీదుగా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టర్కీలో ఇస్లామిక్ పాలనను పక్కనపెట్టి సెక్యులర్ వ్యవస్థను వృద్ధి చేయడం కోసం ఒకప్పుడు అతతుర్క్ పడ్డ తాపత్రయం ఇప్పుడు పూర్తిగా బూడిదిలో పోసిన పన్నీరు అయింది. మసీదు ఎప్పటికైనా మసీదేనని, దానిని ఎప్పటికైనా ఆవిధంగానే పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా ఇస్లాంవాదులు సగర్వంగా ప్రకటించారు.


అయితే ప్రవక్త స్వస్థలమైన సౌదీ అరేబియాలో కూడా అనేక మసీదులను `తొలగించారు’ అనే సంగతి వీళ్ళు మరచిపోతుంటారు. ఆ తొలగింపు కూడా వాటిని పెద్దవి చేసి, మరింతమంది ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా తయారుచేసేందుకు కాదు. విలాసవంతమైన హోటళ్లు కట్టడానికి అలా మసీదులు తొలగించారు. “విలాసవంతమైన హోటళ్లు, దుకాణా సముదాయాలు, ఆకాశహర్మ్యాలు కట్టడం కోసం మక్కా, మదీనాల్లోని చరిత్రాత్మక ప్రదేశాలను కూడా కూల్చివేయడాన్ని స్థానికులు, వారసత్వ సంపద కాపాడాలనే ఉద్యమకారులు నిర్ఘాంతపోయి చూశారేకాని ఏమి అనలేకపోయారు. గత 20ఏళ్లలో ఈ రెండు నగరాల్లో ఉన్న వెయ్యెళ్ళనాటి పురాతన కట్టడాలలో 95శాతం కూల్చివేశారని వాషింగ్టన్ లోని గల్ఫ్ సంస్థ అంచనా వేసింది. ఒట్టమాన్ కాలం నాటి అయ్యద్ కోటను, ఆ కోట ఉన్న కొండను కూడా సౌదీ ప్రభుత్వం పూర్తిగా కూల్చేసింది. ఇతర చారిత్రక స్థలాలకు కూడా ఇదే గతి పట్టింది. మహమ్మద్ ప్రవక్త పుట్టిన ఇల్లును గ్రంధాలయంగా చేస్తే, ఆయన మొదటి భార్య ఖదీజా ఇంటిని మూత్రశాలగా మార్చారు’’ అని 2012 అక్టోబర్ 26 నాటి ఇండిపెండెంట్ పత్రిక వ్రాసింది. పాకిస్తాన్ లో కూడా ఇలా మసీదులను తొలగించిన సంఘటనలు చాలానే ఉన్నాయి.


హజియా సోఫియాను మసీదుగా తిరిగి మార్చడం  ఒకప్పుడు జరిగిన తప్పిదాన్ని సరిచేయడం కోసమేనని అంటే హిందువులకు కూడా అలాంటి హక్కే ఉంటుంది కదా. టర్క్ లు, మంగోలుల దాడులు, విధ్వంసాన్ని ఎదుర్కొన్న హిందువులు తమ దేవాలయాలను పునరుద్ధరించుకోవాలనుకుంటున్నారు. పైగా భారత్ లో ఇలా ఒక కట్టడం అనేకసార్లు, అనేకమంది చేతులు మారిన వివాదం కూడా లేదు. హజియా సోఫియాను తిరిగి మసీదుగా మార్చడం గురించి ఏ సెక్యులర్ – ఉదార – కమ్యూనిస్ట్ – ఇస్లాంవాదీ ప్రశ్నించలేదు, మాట్లాడలేదు. కానీ తమ దేవాలయాలను పునరుద్ధరించుకోవడానికి హిందువులకు ఉన్న హక్కును మాత్రం ప్రశ్నిస్తున్నారు, కాదంటున్నారు. ఎంతటి ద్వంద్వ వైఖరి !


అలాగే ముస్లిం ప్రతినిధులమని చెప్పుకుంటున్న కొందరు అయోధ్యలో ఉన్నది నూటికి నూరుపాళ్లు మసీదే అని, తాము తగిన బలం సంపాదించుకున్న రోజున రామమందిరాన్ని తిరిగి మసీదు చేయడం ఖాయమని బహిరంగంగా ప్రకటనలు చేసినప్పుడు కూడా ఈ సెక్యులర్ వాదులు ఏమి మాట్లాడలేదు.


ఈ ప్రకటన నిజానికి భారత రాజ్యాంగంపై, భారతీయ రిపబ్లిక్ వ్యవస్థపై పెద్ద దాడి. తమ ప్రయోజనాలకు తగినట్లుగా ఉన్నంతవరకే భారత  రాజ్యాంగాన్ని ముస్లింలు అంగీకరిస్తారని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) చెప్పదలుచుకుందా? తమకు అంగీకారం కాకపోతే షరియాను అమలు చేస్తారా? టీవీలు, వివిధ ప్రసార మాధ్యమాల్లో పలు చర్చల్లో పాల్గొనే ఈ స్వయంప్రకటిత ముస్లిం నేతలు తమకు రాజ్యాంగం కంటే షరియా పైనే గౌరవం ఎక్కువని బాహాటంగానే ప్రకటిస్తుంటారు. తమ అణచివేత, ఆక్రమణ ధోరణి బయటపడిపోకుండా రాజ్యాంగంపై గౌరవం, రాజ్యాంగ విలువలు అనే ముసుగు వేసుకుంటూ ఉంటారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇస్లాంవాదులు ఇలాగే చట్టాలను కించపరుస్తూ, వ్యవస్థలను తూలనాడుతూ ఉంటారు.


వారికి `అవిశ్వాసుల’పై ఉండే అసహనం, కోపం వారి మాటల్లో ఎప్పుడు పయటపడుతూనే ఉంటుంది. మధ్య ప్రాచ్య ప్రాంతం నుంచి `పీడితులైన’ముస్లింలు పక్కనే ఉన్న ముస్లిం రాజ్యంలోకి వెళ్లకుండా పరమతానికి చెందిన యూరప్ కు పడవల ద్వారా చేరుకున్నారు. అక్కడకు శరణార్ధులుగా, దొడ్డిదారిన చేరినవాళ్ళు కాస్త స్థిరపడిన వెంటనే దారుల్ – హర్బ్ (అవిశ్వాసుల భూమి)ను దారుల్ – ఇస్లాం (ఇస్లాం భూమి)గా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అంతే యూరప్ భగ్గున మండింది. ఇక ఇస్లాం దేశాల్లో కూడా ప్రధాన ఇస్లాం శాఖలకు చెందనివాళ్లు, కుర్డులు, యజ్దీల పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది.


రాగల కొన్ని సంవత్సరాల్లో యూరోప్ గతి ఏమవుతుంది? ఇటీవలి బాంబు పేల్లుళ్ళు ప్రమాదవశాత్తు జరిగాయా లేక తీవ్రవాదుల దాడులా అన్నది ఇంకా తేలలేదు. లెబనాన్ ఇప్పటికే పూర్తి షరియా రాజ్యంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల్లో యూరోప్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడవచ్చును. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు వేలాదిమంది `అణచివేతకు గురైన’ పాలస్థినియన్లు లెబనాన్ లో ప్రవేశించారు. ఉదార, ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడిన లెబనాన్ వారందరికి ఆశ్రయం కల్పించింది. 1975నాటికి పాలస్తినియన్ల సంఖ్య 5లక్షలకు చేరింది. అప్పుడే అక్కడ పాలస్తీనా లిబరేషన్ సంస్థ కార్యలయం కూడా వెలసింది. అదే సంవత్సరం పౌరయుద్ధం చెలరేగి ముస్లింలకు `మెరుగైన ప్రతినిధ్యాన్ని’ కల్పించడం కోసం లెబనాన్ ను రెండుగా విభజించారు. కొన్ని దశాబ్దాలలోనే లెబనాన్ తన ఉదారవాద, సంపన్న స్థితిని కోల్పోయింది.


ఇస్లాంవాదులవల్ల వివిధ దేశాలు వివిధ కారణాలతో నాశనమయ్యాయి. కానీ వాటన్నింటిలో ఉదార ప్రజాస్వామ్య  సమాజం మాత్రం పూర్తిగా కనుమరుగయ్యింది. ఒకప్పుడు జిన్నా కూడా సెక్యులర్ పాకిస్థాన్ ఏర్పాటుచేస్తానని హామీ ఇవ్వలేదా? వివిధ దేశాల్లో ఉదారవాదులు, ప్రజాస్వామ్యవాదులను నమ్మించడానికి, చివరికి మోసగించడానికి వేరువేరు అంశాలను వాడుకున్నారు. చివరికి ప్రజాస్వామ్యవాదులు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించేలోగానే వామపక్ష నాస్తికులు, మతఛాందస ఇస్లాంవాదులు కలిసి మొదట ప్రత్యేక సదుపాయాలు, హక్కులు పొంది ఆ తరువాత పూర్తిగా దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అనేక ఆఫ్రికా దేశాల్లో కూడా ఇదే జరిగింది. సూడాన్ విభజన, నైజీరియా, కెన్యాల పతనం ఇలాంటివే. ఇక అణచివేత విషయానికి వస్తే కమ్యూనిస్ట్ ల రాజ్యంలో ఇస్లాంవాదులు, ఇస్లాం దేశాల్లో కమ్యూనిస్ట్ లు అణచివేతకు గురయ్యారు. ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి చైనా చూడండి. కానీ కమ్యూనిస్ట్ లు, ఇస్లాం వాదులు కలిసి ప్రజాస్వామ్య దేశాలను నాశనం చేస్తూనే ఉన్నారు.


ఈ సత్యాలను గురించి ఎవరు మాట్లాడతారో వారు ఇస్లాం వ్యతిరేకులు అని ముద్ర వేస్తారు. కానీ నిజాలు చెప్పవలసిందే. ఎందుకంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను ఉపయోగించుకుని చివరికి షరియా రాజ్యాన్ని తేవడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని భారతీయులందరూ తెలుసుకోవాలి, అప్రమత్తమవ్వాలి. అవిశ్వాసులపై యుద్ధం చేసి వారిని జయించడం అన్నది మాత్రమే వారి అంతిమ లక్ష్యమని, అందులో ఎలాంటి రాజీ ఉండదని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటన చూస్తే అర్ధమవుతుంది.


పవిత్ర గ్రంధంలో చెప్పిన ప్రకారమే తాము చేస్తున్నామని తీవ్రవాదులు చెప్పే మాటలు నమ్మరాదని, `నిజమైన’ ముస్లింలు వేరని, వాళ్ళు అలా వ్యవహరించరని నిజాలను చూడలేని కొందరు ఇతరులను మభ్యపెట్టాలని చూస్తారు. వహాబీలు చెప్పేవన్నీ నిజం కావని వాళ్ళు గ్రహించరు. “నీకు నీ మతం ఎంతో, నాకు నా మతం’’ (109:1-6) అనే  సూక్తి నిజమే అయినా, `పవిత్ర మాసాలు పూర్తయిన తరువాత విగ్రహారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ చంపేయ్యి. బందీలుగా పట్టుకో. వాళ్ళను వెంటాడి వేటాడు. వాళ్ళు లొంగిపోతే ప్రార్ధన చేయించు, వాళ్ళు జకా ఇస్తే పుచ్చుకుని వదిలిపెట్టు. ఎందుకంటే అల్లా క్షమిస్తాడు, జాలిచూపిస్తాడు’(9.5) అని కూడా అదే గ్రంధంలో ఉంది. వహాబీలు ప్రవక్త జీవితంలో రెండవ అంశాన్నే అనుసరిస్తామని అంటే అది తప్పని చెప్పే ధైర్యం, బలం ఈ `సెక్యులర్’వాదులకు లేవు. ఆ విధంగా `శాంతిమతం’ వహాబీల చేతిలో చిక్కుకుంది.


ప్రాచీన నాగరకతను పునరుద్ధరించుకునే కార్యంలో రామమందిర నిర్మాణం మొదటి అడుగు మాత్రమే. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటన, హజియా సోఫియా, రామమందిరాలను ఒకే గాటన కడుతున్న వామపక్ష – ఉదార – ఇస్లాంవాదుల కూటమి వాదన భారతీయ నాగరకతపై జరుగుతున్న దాడులు అంతంకాలేదని స్పష్టం చేస్తాయి. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్ళు ఈ పోరాటం మరింత ఉధృతమవుతున్నదని సూచిస్తున్నాయి.


– – రతన్ శార్దా

Source:- VSK Telangana

Thursday, September 17, 2020

*నిజాం నిరంకుశత్వాన్ని నిరసించిన కలాలు*

నిజాం నిరంకుశత్వాన్ని నిరసించిన  కలాలు
            తెలంగాణలో జాతీయ జెండా స్వతంత్రంగా, సగర్వంగా 1947 ఆగస్ట్ 15 న ఎగరలేదనే సంగతి నేటి తరానికి చాల మందికి తెలియదు. దేశమంతా మువ్వన్నెల జెండా స్వేచ్చా విహారం- తెలంగాణ లో మాత్రం పచ్చజెండా స్వైర విహారం. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంగా పిలువబడే నేటి తెలంగాణాలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజానీకం ఊపిరి బిగబట్టు కొని బ్రతుకున్న రోజులవి. మతోన్మాద రజాకార్ల సేనా నాయకుడు ఖాసీం రజ్వీ రాక్షస క్రీడలకు బలైన ప్రజలు తమ మాన ప్రాణాలను అరచేతబట్టుకొని బిక్కుబిక్కుమంటూ మూలుగుతున్న రోజులవి. నిజాం నిరంకుశత్వాన్ని కూకటివెళ్ళతో పెకిలింపడానికి యావత్తు తెలంగాణ సమాజం ఉద్యమించింది. కవులు తమ కలాలని పదునెక్కించారు. ఉద్యమవృక్ష మూలభాగంలో నిల్చి వీరరసాన్ని ఎక్కించారు. చైతన్య వంతమైన సమాజాన్ని తీర్చిదిద్దటంలో కవులు తమ వంతు పాత్ర పోషించారు. తెలంగాణ అంతటా సాంస్కృతిక భావధార తెగకుండా ప్రవహింపజేశారు.
ఓ నిజాము పిశాచమా! కానరాడు 
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని 
తీగలను తెంపి అగ్నిలో దింపినావు 
నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ దాశరథి కృష్ణమాచార్య నిజాం దురాగతాలను, ఆకృత్యాలను ఎలుగెత్తాడు. దాశరథి అనగానే నిజాం వ్యతిరేక ఉద్యమ కవిత్వం వెంటనే గుర్తుకు వస్తుంది. జైలు గోడల పై రాసిన ఈ పద్యం అగ్నిని కురిపిస్తుంది.
నిజాం రాక్షస పాలనలో సామాన్యుల జీవితాలు దుర్భరమైనయి. మాన భంగాలు సరేసరి నిజాం కాలంలో తెలుగు మాట్లాడడానికి వీలు లేదు. ఆస్తుల దోపిడి, గృహ నిర్భందాలు, అమానుష దారుణకాండ, దుస్సహ, దృష్టకృత్యాలు తెలంగాణని నరక లోకంగా మార్చాయి. దాశరథి తన కవిత్వంను విల్లులా ఎక్కుపెట్టి ఆ విల్లు నుండి వెలువరించిన అస్త్రమే ఈ పద్యం.
"ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ బడగొట్టి మంచిమా/గాణములన్ సృజించి ఎముకలో నుసి చజేసి పొలాలు దున్ని లో/షాణములన్ నవాబునకు స్వర్ణము నింపినరైతుదే తెలం/గాణ ముసలి నక్కకు రాచరికం దక్కునే"
నిజాం రాజును పిశాచం అనడం, ముసలి నక్క అనడం, మా నిజాం నవాబు జన్మజన్మల అనడానికి ఎన్ని గుండెలు కావాలి. దానికి ఫలితంగా ఇనుప గొలుసులు వరించాయి.
     దోపిడీలు, హత్యలు, స్త్రీలను చెరచడం వంటి రజాకార్ల యొక్క దమనకాండకు చలించిన మరో కవితాసింహం కాళోజీ. నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా హింసకు ప్రతిహింసే గుణపాఠం అని తిరగబడి కాటేయాలి అంటూ బుస కొట్టాడు కాళోజీ."మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన/మన పిల్లలను చంపి మనల బంధించిన/మానవాధములను మండలాధీశులను/మరచిపోకుండగ గుర్తుంచుకోవాలె../కండ కండగా కోసి కాకులకు వేయాలె/కాలంబు రాగానే కాటేసి తీరాలె."
        స్త్రీలపై నిత్య కృత్యమైన రజాకార్ల యొక్క అత్యాచారాలు, ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిజాం నిరంకుశ పాలనను "చాలింక" అంటూ నినదించాడు కాళోజీ.
"బాధ్యత లేని ప్రభుత్వ భటులు/పెట్టే బాధలు చాలింక/బాధ్యత గల పరిపాలన లేక/బ్రతికిన బతుకులు చాలింక/హద్దుమీరి అధికార వర్గము/ఆడిన ఆటలు చాలింక/రాజు పేరిట అరాజకమునకు/జరిగిన పూజలు చాలింక/రక్కసి తనముకు పిశాచ వృత్తికి/దొరికిన రక్షణ చాలింక." తన కవిత్వంతో తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తూ, నిజాం నిరంకుశ పాలనను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే కాళోజీ "తీర్పు" అనే కవిత ద్వారా నిజాం ప్రభుత్వంను ఎండగట్టాడు. ఇంకా తెలంగాణ లోని కవులు అనేకులు నిజాం నిరంకుశ పాలనని నిరసిస్తూ తమ కలాలను ఝళిపించారు.ఇక్కడ మచ్చుకు దాశరథి-కాళోజీ, ఈ ఇద్దరి కవిత్వాల్లోని కొన్ని అంశాలని తెలుసుకున్నాం. భాషా, సాంస్కృతిక, ధార్మిక, భౌగోళిక విమోచనం కోసం జరిగిన ఈ ఉద్యమం నేటి తరం తెలుసుకొని సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ విలువని గుర్తించాలి. మహారాష్ట్ర, కర్ణాటక లో ఉన్న ఆనాటి కొన్ని జిల్లాల్లో అధికారికంగా ఉత్సవాలు జరగటం విశేషం. కానీ అదే విమోచన దినం తెలంగాణాలో జరిగేలా లేఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి.సాంస్కృతిక, చారిత్రక పోరాట స్ఫూర్తిని యావత్తు తెలంగాణాలో రగిలించాలి.
-సాకి.

       

Tuesday, September 15, 2020

అరాచక శక్తుల నుండి బయట పడినప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్రం

భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం వచ్చింది ఇండియన్ యూనియన్ ఏర్పడింది. ఆ రోజుల్లో రెండు రకాల రాజ్యవ్యవస్థలు ఉండేవి 1] బ్రిటిష్ పార్లమెంట్ పరిపాలనలో ఉన్న భూభాగం 2] దేశంలోని వివిధ సంస్థానాలు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళపార్లమెంట్ పరిపాలనలో ఉన్న భూభాగం,  సంస్థానాలకు   స్వతంత్రం ఇచ్చారు.  ఆ సంస్థానాలను కలుపుకుని ఇండియన్ రిపబ్లిక్ ఏర్పడింది. దేశంలోని అన్ని సంస్థానాలను కలుపుకుంటూ వచ్చారు. అందులో మూడు సంస్థానాలు సమస్యాత్మకం అయినాయి, అందులో  1] హైదరాబాద్ స్టేట్ 2] జూనాగడ్ 3] కాశ్మీర్, ఈ మూడు ముస్లింలతో ముడిపడి ఉన్నవి అవి విలీనం కావటం చాలా ఆలస్యం జరిగింది. అందులో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లో చేరడానికి కేంద్రం పోలీస్ చర్య చేపట్టాల్సి వచ్చింది, తద్వారా 1948 సెప్టెంబర్ 17న అప్పటి హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణ కు చెందిన 8 జిల్లాలు, మరట్వాడ కు చెందిన ఐదు జిల్లాలు, కర్ణాటకకు చెందిన మూడు జిల్లాలు, మొత్తం 16 జిల్లాలకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవాలి. 1948లో తెలంగాణ కు స్వతంత్రం వస్తే మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కు  తెలుగు భాష మాట్లాడే వాళ్లకోసం  ప్రత్యేక రాష్ట్రం సాధించాలని  పొట్టి శ్రీరాములు  బలి అయిన తర్వాత 1953 అక్టోబర్ 11వ తేదీన ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో 11 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం ఒక రకంగా భాష ఆధారంగా ఏర్పడింది. కేంద్రం రాష్ట్రాలను భాషా ప్రయుక్త రాష్ట్రాలుగారీ ఆర్గనైజ్ చేసింది, అలా  చేసిన తర్వాత 1956 నవంబర్ ఒకటో తేదీన ఆంధ్ర ప్రదేశ్ మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమైనది. ఆ సమయంలో హైదరాబాద్ స్టేట్ లోని మరాట్వాడా జిల్లాలను మహారాష్ట్ర లోను కన్నడ జిల్లాలను కర్ణాటకలోనూ కలిపేశారు. తెలంగాణా కు చెందిన 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 జిల్లాలను కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది.1956 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నది, 2014లో తిరిగి మళ్ళీ ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి, ఈ పరిణామ క్రమంలో మొట్టమొదటి హైదరాబాద్ స్టేట్ కు స్వతంత్రం వచ్చిన సెప్టెంబర్ 17న కర్ణాటక మహారాష్ట్రలోని ఆ ఆయా జిల్లాలో స్వాతంత్ర దినోత్సవం  అధికారపూర్వకంగా నిర్వహించుకుంటూ ఉంటారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించ బడవు దీనికి ప్రధాన కారణం ముస్లింలు,  తెలంగాణ రాష్ట్రానికి ముస్లిముల పాలను నుండి స్వాతంత్రం వచ్చింది కానీ ఇప్పటి పాలకులకు వాళ్లు గెలవాలంటే ముస్లిం ఓట్లు కావాలి కాబట్టి ముస్లిం సంతుష్టీకరణ కొరకు పాత విషయాలను వాళ్లకు జ్ఞాపకం చేయకుండా ఉండటానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడంలేదు. అంటే ముస్లిముల ప్రభావము ఇంకా తెలంగాణ పైన ఉన్నది అని మనకు అర్థమవుతుంది.
      
తెలంగాణ చరిత్ర

తెలంగాణకు  కాకతీయుల కాలంలో అంతకంటే పూర్వము ఎంతో వైభవోపేత మైన  చరిత్ర సంస్కృతి ఉన్నది. తెలంగాణలో కాకతీయ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత ముస్లిం పరిపాలన కింద పడిపోయింది .1518 నుండి 1687 వరకు కుతుబ్షాహీల పాలనలో సాగితే 1687 సంవత్సరం గోల్కొండ రాజ్యం మీద ఔరంగజేబు దాడి చేసి ధ్వంసం చేశాడు. సుమారు 37 సంవత్సరాలు అంటే 1724 వరకు ఔరంగజేబు చేత నియుక్తి చేయబడిన వాళ్ల పరిపాలనలో ఉంది, ఔరంగజేబు చనిపోయిన తర్వాత 1724 నుండి 1948వ సంవత్సరంవరకు నైజాం రాజుల పరిపాలనలో ఉంది అంటే మొత్తం మీద 430 సంవత్సరాలు ఇస్లాంపాలన లోమగ్గినది. 1948 లో చివరి నిజాం పాలన నుండి తెలంగాణ స్వేచ్చను  సంపాదించుకుంది. దీనికి పద  మూడు నెలలు పోరాటాలు, త్యాగాలు చేయవలసి వచ్చింది ఈ 13 నెలల పోరాటం తీరుతెన్నుల గురించి కొన్ని విషయాలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవటం ఎంతో అవసరం.

13 నెలల పోరాట చరిత్ర

13 నెలల పోరాట చరిత్రలో 1] నైజాం రజాకార్లు 2 ]కమ్యూనిస్టులు  3] కాంగ్రెస్ ఆర్యసమాజ్ 4] తెలంగాణ గ్రామీణ క్షేత్రంలో రైతాంగ పోరాటం ఉన్నవి.  ఇందులో రజాకార్లు హైదరాబాద్ స్టేట్ ను  ప్ర త్యేక ఇస్లాం రాజ్యంగా ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, కమ్యూనిస్టులు భారత్ లో కమ్యూనిస్ట్ దేశం ఏర్పాటు చేసుకోవాలని పోరాటం సాగించారు, నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా గ్రామీణ క్షేత్రంలో  రైతాంగ పోరాటం జరిగింది. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం చేసేందుకు కాంగ్రెస్ ఆర్య సమాజ్ పోరాటం చేశారు. ఆర్య సమాజం సాగించిన పోరాటం తెలంగాణ విముక్తి లో ఎంతో కీలకమైంది. నైజాం రజాకార్లు స్వతంత్ర ఇస్లాం  రాజ్యం కోసం పోరాటానికి ప్రేరణ, ఆశ రెండవ ప్రపంచ యుద్ధంలో నిజాం బ్రిటిష్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాడు. దానికి ప్రతిగా హైదరాబాద్ స్టేట్ కు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇస్తాడని పగటి కలలు కనడం, ఆ కలలు సాకారం చేసుకోవడం కోసం హైదరాబాద్ స్టేట్ ను ఇస్లామీ కరణ చేసేందుకు ప్రయత్నాలు చేశాడు దానిలో ఎన్నో హత్యలు  మతమార్పిడులు  దౌర్జన్యాలు జరిగాయి. ఆ సమయంలో  కాశీం రజ్వీ రజాకార్లకు అధ్యక్షుడు అయినాడు నైజామును లొంగదీసుకున్నాడు, ముస్లిం  స్వతంత్ర రాజ్యం కోసం  దౌర్జన్యాలు ప్రారంభించాడు. దానికి ఉదాహరణగా బైరాన్ పల్లి గ్రామం పతాక స్థాయిలో నిలిచింది, అట్లాగే కొలనుపాక గ్రామంలో 22 మంది యువకులను బంధించి కాల్ఛి వేశారు. 20 వ శతాబ్దం లోనే ఇది అతి పెద్ద ఘోరం. ఇట్లాంటి  కిరాతకాలు తెలంగాణ ప్రాంతంలో అనేకం జరిగాయి.  పాకిస్తాన్ సైనికులు తూర్పు బెంగాల్ లో తమ ముస్లిం సోదరుల పైన ఎన్ని అత్యాచారాలు జరిపారో ప్రపంచానికి తెలుసు అయితే తెలంగాణలో  ముస్లింలు హిందువులపై జరిగినదాడులు  అసలు ప్రపంచం దృష్టికి రాలేదు.  ఇట్లా రజాకార్ల విధ్వంసకాండ జరిగిపోయింది, దీనికోసం ఆ రోజుల్లో బహుదూర్ యార్ జంగ్ నాయకత్వంలో మజ్లీస్ ఈ ముత్తియి హదుల్ పేరుతో ఒక సంస్త కూడా పనిచేసింది, దానితో తెలంగాణలో అలజడి ప్రారంభమైంది మతం మార్పిడిలు పెద్దఎత్తున సాగుతున్నాయి ఇదే సమయంలో ఆంధ్రా లోని కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు మొదలైన వారు తెలంగాణలో జరుగుతున్న సంఘర్షణ లో ప్రవేశించి తమప్రాబల్యం పెంచుకోవాలని ప్రయోజనం పొందాలని పథకాలు తయారు చేసుకున్నారు, వెంటనే నేరుగా పార్టీ పేరుతోరాలేరు  కాబట్టి చంద్ర రాజేశ్వరరావు సుబ్బారావు అనే మారు పేరుతో ఆంధ్రమహాసభలో చొరబడ్డారు. ఆ మహాసభలో నాయకులైన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ల తీవ్ర స్వభావం చూసి ఇద్దరినీ దగ్గరకు తీశారు. జాతీయవాదులయిన  సురవరం ప్రతాపరెడ్డి, నరసింహారావు, బూర్గుల రామకృష్ణ రావు, మాడపాటి హనుమంతరావు మొదలైన వారిని పొగ పెట్టకుండానే బయటకు వెళ్లేట్లు  చేసి 1944లో ఆంధ్ర మహాసభను కమ్యూనిస్టు సభగా మార్చి వేశారు. దానికి సాకుగా ఆ జాతీయవాదుల మీద అ పెత్తందార్ల మద్దతుదారులు అని ముద్ర వేశారు, యఈ పరిస్థితుల్లో స్వామి రామానంద తీర్థ ఆర్య సమాజ్ ఆది-హిందూ తదితర సంస్థలకు చెందిన ప్రముఖులు ఒక వేదిక మీదకు తీసుకువచ్చి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు తెలంగాణ గ్రామీణ క్షేత్రంలో కమ్యూనిస్ట్ ల   తో సంబంధం లేకుండా బేతవోలు, కొలనుపాక, మునుగోడు పరిటాల రైతులు గ్రామీణ సమస్యలు ,రజాకార్లకు వ్యతిరేకంగా అజ్ఞాత సాయుధ పోరాటం ప్రారంభించారు. ఇట్లా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, రజాకార్లు, రైతాంగ పోరాటం సభ్యులు ఎవరి లక్ష్యంకోసం వాళ్ళు పోరాటం చేస్తున్న సమయంలో రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల దృష్టిని ఆకర్షించింది. తాము కూడా సాయుధ పోరాటం చేసేందుకు అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర గ్రాండ్ గా పేరు పొందిన విజయవాడ దగ్గరలోని  కొండపల్లి, కంకి పాడు గ్రామంలో కమ్యూనిస్టు కార్యకర్తలకు గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు, నైజామును  ఫాస్ట్ గా ప్రకటించారు, ఆ సమయంలో కమ్యూనిస్టులకు రజాకార్లు హిందువుల మీద చేస్తున్న దాడుల గురించి ఏమీ మాట్లాడలేదు, పట్టించుకోలేదు. రెండవ ప్రక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను బలహీనం చేసేందుకు కుట్రలు పన్నారు. దానికి ఉదాహరణగా స్వామి రామానంద తీర్థ ఒక సమయంలో చేస్తున్న నిరసన దీక్షలో  ప్రవేశించి దానిని భగ్నం చేసి రామానంద తీర్థను  నైజాం నిర్బంధంలోకి తీసుకున్నట్టు చేశారు.   గ్రామాలలో  పెత్తందారులకు, రజాకార్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని పూర్తిస్థాయిలో నైజాం వ్యతిరేక పోరాటంగా మలచ లేకపోయారు. కొమరం భీం నాయకత్వంలో తమ భూముల పట్టాల కోసం చేస్తున్న పోరాటం ఫలితంగా నిజాం హైమన్ డార్ఫ్ కమిషన్ నివేదిక ఆధారంగా వాళ్ల భూములకు పట్టాలు ఇప్పించారు, ఆ ఉద్యమం వేరే రూపం తీసుకున్న కారణంగా కొమరం భీమ్ బలిదానం కావలసి వచ్చింది, చాకలి ఐలమ్మ నైజాం పై పోరాటం చేస్తున్న సంఘానికి తన ఇంటినే కార్యాలయంగా ఇచ్చింది, ఆ పోరాటంలో ఐలమ్మ వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంది చివరకు పోరాటంలో గెలిచింది. అయినా కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం లేదు అనే నెపంతో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమెకు   పింఛన్ కూడా రాకుండా చేశారు. ఆమె చనిపోయిన తర్వాత మాత్రం ఆమెను తమ ఖాతాలో వేసుకుని సిపిఎం పార్టీ వాళ్ళు ఆమె విగ్రహాలు పెట్టించారు.
పోలీసు చర్యతో లొంగిపోయిన నైజాం

భారత్ కు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ప్రకటిస్తే ఆగస్టు 17 వ తేదీ నాడు నిజాం తనకు తాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించు కొన్నాడు. తన లక్ష్యాన్ని సాధించుకునేందుకు కమ్యూనిస్టులతో యధాతథ స్థితి ఒప్పందం చేసుకున్నాడు. కానీ కమ్యూనిస్టులు ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణను కమ్యూనిస్టు దేశంగా నిర్మాణం చేయటానికి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. రష్యా అధినేత తో కూడా ఈ విషయాలు చర్చించారని అధినేత తెలంగాణ కమ్యూనిస్టు రాజ్యం కావటం అనేది ఏ కోణంలో కూడా అసాధ్యం అని తేల్చి చెప్పారని అంటారు, ఇక్కడే నిజాం, కమ్యూనిస్టులు ఇట్లా ఎట్లా ఆలోచనలు చేయగలిగారు అనేది ఆశ్చర్యమేస్తుంది, ఎందుకంటే తెలంగాణ దేశంలో కీలకమైన రక్షణ స్థానంలో ఉంది  నిజాం ఆశించినట్లుగా పాకిస్థాన్ సైన్యం గాని కమ్యూనిస్టులు ఆశించినట్లుగా రష్యా సహాయంగాని  జరగటం అసాధ్యం. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత నిజాం 20 కోట్లు పాకిస్తాన్ కు ఇచ్చాడు తన స్వతంత్ర రాజ్యం కోసం పాకిస్తాన్  ను కోరాడు.   అట్లాగే ఐక్యరాజ్యసమితి కి తన బృందాన్ని పంపించాడు ఇవన్నీ చూసి కాంగ్రెస్ నాయకుడైన స్వామి రామానంద తీర్థ ఢిల్లీకి వెళ్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నెహ్రూకు హైదరాబాద్ స్టేట్ లో జరుగుతున్న అన్ని కుట్రల వివరాలు చెప్పాడు. దాని కారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజామును లొంగదీసుకునేందుకు సైనిక చర్యకు సన్నాహాలు ప్రారంభించాడు. సైన్యానికి పూర్తి బాధ్యతలు  అప్పగించడం భారత సైన్యం అన్ని వైపుల నుండి హైదరాబాద్ స్టేట్ ను నిర్బంధం చేసి నూట ఎనిమిది గంటలలో తమ పని పూర్తి చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ చేరుకునెట్లు చేశారు. ఆ సమయంలో నిజాం నేరుగా airportకు వెళ్లి వల్లభాయ్ పటేల్ ను   కలిసి తన లొంగుబాటును ప్రకటించాడు. దానితో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ రిపబ్లిక్ లో అంతర్భాగం అయిపోయింది. రాజ్యాధికారమే లక్ష్యంగా గ్రామాలలో అశాంతిని లేపిన కమ్యూనిస్టులు పోలీసు చర్యకు వ్యతిరేకంగా తమ కుంటి గుర్రాలతో తోలు  కత్తులతో భారత సైన్యం పైన యుద్ధం చేశారు. యుద్ధము పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, తెలంగాణ కమ్యూనిస్టు నాయకులకు సంబంధం లేకుండా ఏకపక్షంగా నిర్వహించారు. మొత్తం మీద తెలంగాణ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మరించుకుంటూ ఉంటే, కమ్యూనిస్టులు మేము తెలంగాణలో మూడువేల గ్రామాలను విముక్తం చేశామని తమ గ్రంథాలలో వ్రాసుకొన్నారు. తెలంగాణ మాత్రం కమ్యూనిస్టుల నుండి జాగ్రత్త పడి కమ్యూనిస్టులు తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేశారు.

తెలంగాణను  తెలంగాణ గా నిలబెట్టేందుకు ఎదురుచూస్తోంది 

తెలంగాణ విముక్తం అయిన తరువాత ఆ సమయంలో జరిగిన పరిణామాలను ప్రారంభంలో నేను వివరించాను, మొత్తానికి ఆచరణలో సమస్యాత్మకమైన మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది, ఇదంతా గతించిన చరిత్ర కానీ  వర్తమానం ఎట్లా ఉంది? నైజాం రజాకర్ల విధ్వంస అవశేషాలు తెలంగాణలో ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ అవశేషాలు ఆధిపత్యం కోసం నిరంతర విధ్వంసం అనేక సమయాలలో చేస్తున్నారు అనేది తెలంగాణలోని పాత 8 జిల్లా కేంద్రాలలో పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది ,మనకు అర్థము కానిది ఏమిటంటే ఇస్లాం అంటేనే ఆక్రమణ, విధ్వంసము. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇది కనబడుతున్నఇస్లాం విద్వంసమును మనం అర్థం చేసుకోవడం లో ఎక్కడో తేడాలు కనబడుతున్నాయి దాంతో సంఘర్షణ ,మతమార్పిడులు, ఆక్రమణలు జరిగిపోతూనే ఉన్నాయి. అట్లాగే కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి పుట్టిన ఇప్పటి మావోయిస్టులు తెలంగాణ మాదే మా రాజ్యం రావాలి అని కొన్ని దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తూనే ఉన్నారు, పడిపోయిన కమ్యూనిస్టులకు అప్పుడప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం గుర్తుకువచ్చి తెలంగాణ మాదే అని ఏదో చేయాలని అనుకుంటున్నారు. ఇటువంటి  అరాచక శక్తుల నుండి తెలంగాణ బయట పడినప్పుడే తెలంగాణ తెలంగాణ గా ఉంటుంది, తెలంగాణ వైభవోపేతమైన చరిత్ర సంస్కృతి తెలంగాణ ప్రజలకు ఎవరూ తెలియచేయడం లేదు, ఇట్లా తెలియజేయటం అనేది ఇప్పటి చారిత్రక అవసరం అని కూడా ఎవరూ గుర్తించడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఒక ప్రత్యేక చరిత్ర, సంస్కృతి తెలంగాణకు ఉంది. ఈ విషయాలను ప్రజలకు అర్థం చేయిస్తూ తెలంగాణను  తెలంగాణగా  నిలబెట్టేందుకు తెలంగాణ ఎదురు చూస్తుంది. అప్పుడే తెలంగాణ కు నిజమైన స్వాతంత్రంవచ్చినట్లు

-రాంపల్లి మల్లికార్జున్

Thursday, September 10, 2020

అమెరికా సోదర సోదరీమణులారా!

నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వెలువడిన ఓ సంభోధన భారతదేశ సనాతన ధర్మాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింప చేసింది.
1893 సెప్టెంబర్ 11న స్వామి వివేకానందులు తొలిసారిగా అమెరికా దేశంలోని చికాగో నగరంలో సర్వమత మహాసభలో పాల్గొంటూ ఓ అమెరికా సోదర సోదరీమణులారా అన్న వారి సంబోధన తో అప్పటివరకు పాశ్చాత్యుల్లో భారతదేశంపై ఉన్న దురభిప్రాయం ఆ ఒక్క మాటతో,ఆ ఒక్క సంబోధనతో తుడిచివేయబడ్డది. 
భారతదేశం అంటే ఒక జ్ఞాన ప్రకాశ దేశమని, నాగరికతకు పుట్టినిల్లు అనే ఒక భావనను ప్రపంచ దేశాల్లో కలిగించిన ఆ సంఘటన మన దేశ సాంస్కృతిక పరమ వైభవ స్థితిని విశ్వ శిఖరాగ్రాన నిలిపింది.
స్వామి వివేకానందులు భారతదేశపు కీర్తి విశ్వంబరాన ఉదయించిన వేగుచుక్క .మన దేశ ఔన్నత్యాన్ని, హిందూ మత ఘనతను ప్రపంచ నలుమూలల చాటిన మహోన్నత సన్యాసి.
సామాన్య ప్రజల అభ్యున్నతి కై ఆహరహరం తపించిన జగద్గురువు.
 స్వామీజీ తన ఉపన్యాసాల ద్వారా ప్రపంచ చింతన వైఖరిలో మార్పు తీసుకు వచ్చిన యుగాచార్యులు వివేకానందుల వారు.
తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు అందరినీ వదిలి ఒంటరి జీవితం గడపడం, ఒకే చోట స్థిరంగా ఉండకుండా నిత్య సంచారం చేయడం పరివ్రాజక వృత్తి యొక్క పరమలక్షణం. స్వామీజీ ఇలాగే జీవించాలని దేశమంతటా పర్యటించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూడడం, దానిద్వారా తాను నేర్చుకుంటూ, సమాజానికి నేర్పడం అనే భావనతో పర్యటించడం మొదలుపెట్టాడు. ఈ దేశ ఉద్ధరణ జరుగాలంటే మన ఔన్నత్యాన్ని పాశ్చాత్యదేశాలలో చాటాలి. అక్కడి నుండే దేశోధ్ధరణ ప్రారంభం కావాలి అనుకున్నాడు. కారణమేమంటే పాశ్చాత్యదేశాల్లో మన దేశం అంటే స్త్రీలు పిల్లలను మొసళ్ళకు ఆహారంగా వేస్తారని, క్రూర మృగాల తో దేశం నిండి ఉందని,నిత్యం రోగాలతో భారతదేశమంతా రోగగ్రస్తం అయి ఉంటుందని, స్త్రీలను సజీవ దహనం చేస్తారని, మూఢనమ్మకాలతో చిన్నపిల్లలను కాకులకు ఆహారంగా వేస్తారని అభిప్రాయం నిండి ఉంది. దీనికంతటికీ కారణం మన దేశంలోకి మత ప్రచారానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలు. వారు ఈ దేశ ఆచారాలను, సంస్కృతి సంప్రదాయాలను హేళన చేస్తూ పాశ్చాత్య దేశాలలో మన దేశంపై ఇలాంటి దుష్ప్రచారాలు కోకొల్లలుగా చేశారు.
వీటన్నింటిని దూరం చేసి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని పాశ్చాత్యులకు ఎరుక పరిచి అక్కడి నుండే మన దేశ ఉద్ధరణ ప్రారంభించాలి అనుకున్నాడు.
ఈ ఆలోచనలు ఇలా సాగుతున్న సందర్భంలోనే అక్కడ పాశ్చాత్య దేశాలలోఆనాడు అత్యంత సంపద, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న దేశంగా అమెరికా కొనియాడబడుతోంది. నూతన ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి 1890 నాటినుండే అమెరికాలో ప్రారంభమైంది.
అయితే డబ్బు,ఇంద్రియ సుఖాల వెంట ప్రజలు పరుగులు తీస్తూ జీవితం గడుపుతున్నారు ఈ రెండూ అవలక్షణాలు వెరసి ప్రజలను నైతిక విలువలకు దూరం చేశాయి. దీనికంతటికీ కారణం ప్రొటెస్టంట్ మత సంస్కర్త అయినా కాల్విన్ మత సిద్ధాంతాలు. ఆయన సిద్ధాంతం లో ధనవంతులు స్వర్గానికి పోతారు. దరిద్రులు నరకానికి పోతారు. ఎందుకంటే ధనం రావడానికి భగవదనుగ్రహం కారణమని, అందుకే ధనవంతులకే భగవదనుగ్రహం ఉన్నదని, వారు మాత్రమే స్వర్గానికి పోతారని ఆయన సిద్ధాంతం. నాటి అమెరికా ప్రజల నైతిక పతనానికి కారణం కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా మనిషి దిగజారాడు .ఈ సందర్భంలో ఆ నాటి అమెరికా సమాజంలో అసమానతలు హెచ్చుమీరాయి. దీంతోపాటు యాజమాన్యాలకు కార్మికులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. 1893లో అమెరికా యావత్తు ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిపోయింది. ఇదే సందర్భంలో  కొలంబస్ అమెరికా కనుగొని నాలుగు వందల ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలని తీర్మానించారు. ఇందులో భాగంగా చికాగో ప్రజలు ఒక ప్రపంచ ప్రదర్శన భారీ సంఖ్యలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఈ ప్రదర్శన దేనిపై ఉంటే బాగుంటుందనే అంశంపై చర్చోపచర్చలు జరిగాయి. అమెరికా నైతికంగా దిగజారుతున్న తరుణంలో మళ్ళీ క్రైస్తవ మత ఔన్నత్యాన్ని చాటి ప్రజలందరినీ మతం వైపు మళ్ళించాలనే ఒక సంకల్పం మరియు ప్రపంచ మతాలలో క్రైస్తవమే గొప్పదనే ముద్ర వేయడం అనే అంశాలు అంతస్సూత్రంగా సర్వమత మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అనేక దేశాల నుండి అనేక మత శాఖల వారిని ఆహ్వానించి వారి వారి మతాల కంటే క్రైస్తవ మతం గొప్పదని భావనను స్థాపించుటకు సర్వమత మహాసభ నిర్ణయం జరిగింది.
ఇందుకు సంబంధించి1892 మధ్యకాలంలో ది హిందూ దిన పత్రికలో చికాగోలో 1893 జూలైలో ప్రపంచ సర్వమత సభ జరుగుతుందని, ఎవరైనా ఒకరు హిందూ మతానికి ప్రతినిధిగా అక్కడికి వెళ్లాలని దానిలో ఒక ప్రకటన వెలువడింది.

 అదే సమయంలో స్వామీజీ చెన్నై రావడం, అమెరికా లోని హిందూ సమితితో సన్నిహిత సంబంధం ఉన్న యోగి పార్థసారథి అయ్యంగారు అనే వ్యక్తికి అల్లుడైన అలసింగ పెరుమాళ్ కు స్వామీజీతో సాన్నిహిత్యం ఏర్పడడం ఆ సందర్భంగా స్వామీజీతో మీరు ఎందుకు చికాగోలో జరుగనున్న సర్వమత మహాసభలో పాల్గొనకూడదని స్వామీజీని అలసింగ అడగడం, దానికి స్వామీజీ నన్ను ఎవరైనా పంపిస్తే నేను వెళ్లడానికి నాకు అభ్యంతరం లేదని చెప్పడం వెంట వెంటనే జరిగిపోయాయి.
 సర్వమత మహాసభలో పాల్గొనేందుకు సమాయత్తం కోసం స్వామీజీ దక్షిణ భారతం లోని అన్ని ప్రాంతాలను పర్యటించడం జరిగింది హైదరాబాద్ లో గోల్కొండ కోటను కూడా స్వామిజీ సందర్శించారు.ఈ సంఘటనలన్నీ గడిచి స్వామీజీ కన్యాకుమారి వద్ద సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి ఒక ఏకశిల మీద మూడురోజులు ధ్యానంలో ఉండి చికాగో వెళ్ళుటకు సంకల్పం తీసుకోవడం జరిగింది.

 1893 మే 31వ తేదీన స్వామీజీ అమెరికా బయలుదేరాడు. రెండు నెలలు దాదాపు 13 వేల కిలోమీటర్లు ప్రయాణించి జూలై 27న వాంకోవర్ చేరుకున్నారు.వాంకోవర్ నుండి చికాగో 2000 దూరం రైలులో ఐదు రోజుల ప్రయాణం చేసి జూలై 31 న స్వామీజీ చికాగో చేరుకున్నాడు.
అయితే సర్వమత మహాసభ సెప్టెంబర్ కి వాయిదా పడడం స్వామీజీ చేసేది లేక చికాగోలో ఖర్చు ఎక్కువ కాబట్టి  బోస్టన్ కు ప్రయాణం అవ్వడం, రైలులో కేథరిన్ పరిచయంతో స్వామీజీ పలువురు ప్రఖ్యాత వ్యక్తులను కలుసుకోవడం, ప్రొఫెసర్ రైట్ తో పరిచయం ఇలాంటి సంఘటనలు జరిగాయి.
 ప్రొఫెసర్ రైట్ సర్వమత సంఘానికి అధ్యక్షుడైన డాక్టర్ బారోస్ కు స్వామీజీ గురించి ఉత్తరం రాస్తూ సర్వమత సభల్లో పాల్గొనడానికి ఒక వ్యక్తిని పంపుతున్నాను మన దేశంలోని విద్యాధికులైన మన ఆచార్యులు అందరినీ ఏకం చేసిన వారంతా ఈ ఈయన జ్ఞానానికి సాటిరారు అంటూ స్వామీజీ గురించి పరిచయ వాక్యాలు రాస్తాడు.
 చివరకు అనుకున్న సమయం రానే వచ్చింది. సర్వమత మహాసభ చికాగో కళా సంస్థలో(ఆర్ట్ ఇన్స్టిట్యూట్ )1893 సెప్టెంబర్ 11వ తేదీ సోమవారం నుండి 27వ తేదీ వరకు జరిగింది.
 ఈ కళా సంస్థ మిచిగాన్ ఎవెన్యూ లో ఉంది.  సర్వమత మహాసభ కొలంబస్ హాల్లో ప్రారంభమైంది. ఆరు వేల మంది ప్రతినిధులు ఆ సభలో ఉన్నారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది.
 ఆ సభలో పాల్గొన్న ముఖ్యమైన 10 మతాలైన హిందూ, బ్రహ్మసమాజం,  యూదు, ఇస్లాం,  బౌద్ధ, తావో ,కన్ఫ్యూషియస్, షింటో, జొరాస్ట్రియన్, క్యాథలిక్ చర్చ్ ,ప్రొటెస్టెంట్ మతాలను సూచించే రీతిలో అక్కడున్న న్యూ లిబర్టీ గంట 10 సార్లు మోగించారు.
ఆరోజు స్వామీజీ ఎరుపురంగు దుస్తులు,పసుపు రంగు తలపాగ ధరించి 31వ,ఆసనంలో కూర్చున్నారు .
ఒకరి తర్వాత ఒకరి ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి. వివిధ మతాల ప్రతినిధులు వారి వారి మత గొప్పతనాన్ని వినిపిస్తున్నారు.

 కార్యక్రమ నిర్వాహకులు చాలాసార్లు స్వామిజీని ఆహ్వానించారు.స్వామీజీ వాయిదా వేస్తున్నాడు. తప్పని పరిస్థితిలో స్వామీజీ మాట్లాడడానికి లేచారు.

 ఒక్క క్షణం సరస్వతీదేవిని, శారదా మాతను గురువు భగవాన్ రామకృష్ణ పరమహంసలను తలుసుకున్నారు.
 అమెరికా సోదర సోదరీమణులారా అంటూ సంబోధిస్తూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు.
అంతే ఒక్కసారిగా ఆరువేల మంది ప్రతినిధులు తమలో ఏదో నూతనోత్తేజం ఆవహించినట్లుగా లేచి చప్పట్లు కొట్టనారంభించారు .అది సద్దుమణుగడానికి కనీసం పది నిమిషాలు సమయం పట్టింది.తర్వాత స్వామీజీ తిరిగి ఉపన్యసించడం ప్రారంభించారు.
 మాకు మీరు ఇచ్చిన హృదయపూర్వక స్వాగతానికి ఆనందిస్తూ,కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
 ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సాంప్రదాయం పేర  మీకు నా నమస్సులు తెలియజేస్తున్నాను. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు మాతృక అయిన సనాతన ధర్మం పేర మీకు నా ధన్యవాదాలు. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో, భారత జన సహస్రాల పేరిట నేను మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నాను.
సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని  లోకానికి అందించిన సనాతన ధర్మానికి నేను వారసునిగా మీ ముందు మాట్లాడుతున్నాను. సర్వమత సహనమే కాక సర్వ మతాలు సత్యాలే అని మేము నమ్ముతాం.అలాంటి నమ్మకానికి పునాది అయిన నావేదధర్మానికి సాక్ష్యంగా నేను మీముందు మాట్లాడుతున్నాను.
 సమస్త మతాల, సమస్త దేశాలనుండి పర పీడితులై, శరణాగతులై వచ్చినవారికి నా దేశం ఆశ్రయమిచ్చింది అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. శరణార్థులై వచ్చిన యూదులను మహా జోరాస్ట్రియన్లను ఆదరిస్తూ వారికి ఆశ్రయమిచ్చిన ధర్మం నా సనాతన ధర్మం అని గర్వంగా చెప్తున్నాను .
శాఖాభిమానం, మతమౌఢ్యం వంటి వాటిని ఖండించి అవి లేని సమాజాన్ని నిర్మించాలి . ఇటువంటి మూఢత్వాలకు,మూర్ఖపు సిద్ధాంతాలకు అవసానదశ ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం ఈ నాటి ఉదయం మోగించిన గంట స్వమత దురభిమానానికి,  పరమతద్వేషానికి కత్తితో,కలంతో  కావించబడే వివిధ రకాలైన హింసకు మాత్రమే కాక ఒక్క గమ్యాన్ని కోరే కొందరిలోని అకారణ ద్వేషభావాలకు ఈ గంట శాంతి పాఠం కాగలదని నేను ఆశిస్తున్నాను. అని స్వామీజీ తన ప్రసంగాన్ని ముగించాడు.
ఇది చిన్న ఉపన్యాసమే అయిన అది మత చరిత్ర లోనే కాక ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడిన ఒక పుటగా నిలిచిపోయింది .
ఆయన మాటల్లో అగ్ని కణాలు విరజిమ్మాయి అని రోమారోలా రాశారు.ఈ అగ్నికణాలు మతమౌఢ్యంతో కళ్ళు మూసుకుపోయిన ఎందరో కుహనా మతాధిపతులకు హృదయ కమలాలు తెరిపించిన కిరణాలు వారి మాటలు.
 స్వామీజి నిత్యం తన సంవేదనంతా విశ్వమానవ సౌభ్రాతృత్వం,విశ్వమానవ కల్యాణమే ఈతపననే స్వామీజీని ఒక ప్రత్యేక ఆకర్షణగా విశ్వవేదికపై నిలిపింది .వారి వేదమత బోధనలతో సనాతన ధర్మం ధగధగలు ప్రపంచవ్యాప్తంగా పరుచుకున్నాయి.
 విశుద్ధి నుంచి, నిశ్శబ్దత నుంచే అమోఘమైన వాక్కు వెలువడుతుందని స్వామీజీ అన్నట్లుగా వారి నిర్మలమైన హృదయకమలం నుండి వెలువడిన నిశ్చలమైన సనాతన ధార్మిక భావనలు ప్రపంచమంతా వ్యాపించాయి.
 స్వామీజీ ఉపన్యాసం గురించి,వారి బోధనల గురించి మరునాడు అక్కడి పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. రాత్రికి రాత్రే వివేకానందులు విశ్వ విశ్వమానవులు అయినారు.
 అంతటి ఆ కీర్తికి వారు పొంగిపోలేదు తన గదికి తిరిగివచ్చి పడుకుంటే వారి కళ్ల ముందు భారతదేశమే కనిపించేది. పేదల కోసం ఆయన హృదయం స్పందించేది. వారి వేదనంతా వాడిపోతున్న సోదర భారతీయుల కోసమే.
 ఇలా స్వామీజీ నాలుగు సంవత్సరాలు వైదిక మత ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలలో విస్తృతంగా ప్రచారం చేసి  ఈ దేశ కీర్తిని పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళినవారు స్వామి వివేకానందులు.

ప్రతి మనిషిలో దివ్యత్వాన్ని చూడాలి తప్ప ఏ మనిషిని మీరు పాపులు, అజ్ఞానులు,గతిలేనివారు అని సంబోధించకూడదని,ప్రతిమనిషి అమృత పుత్రుడే,దైవసమానుడేనని చెప్పి పాశ్చాత్య మతాల భావనలలోని తప్పులను సరిదిద్ది సమ్యక్ మార్గాన్ని చూపించిన సద్గురువు స్వామి వివేకానందులు. 

భగవాన్ శ్రీ రామకృష్ణులు స్వామీజీ గురించి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. స్వర్గంలో జీవించే ఒక ఋషి మానవ రూపుదాల్చి ఈ భూమికి ఏతెంచారు అని భగవాన్ లతో  కీర్తించబడిన దేవర్షి స్వామి వివేకానందులు.

 చికాగో ఉపన్యాసం ఇచ్చిన ఈరోజును స్మరించుకుంటూ స్వామీజీ బోధనలు ప్రేరణగా తీసుకొని హైందవ ధర్మ ధ్వజంతో ఈ భారతావనికి పునర్వైభవం సాధించుటకు మనమంతా కృషి చేద్దాం.
 జై హింద్ 
           గాజుల రవీందర్
             9848255525

తనను తానుపొగుడుకొంటున్న చైనా

తనను తానుపొగుడుకొంటున్న చైనా
నిన్నటి  రోజు [9. 9. 2020]చైనా మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్  పత్రిక సంపాదకుడు తన దేశాన్ని పొగుడుతూ భారత్ ను నిందిస్తూ ఒక ప్రత్యేక  కథనాన్ని వ్రాసాడు దానిలో ''చైనా భారత్ సరిహద్దులలో యుద్ధవాతావరణాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పూర్తగా తన అదుపులో ఉంచుకొన్నదని ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు తనకు చెప్పారని, ఒక వేళా యుద్ధం వస్తే  భారత సైన్యానికి పరాభవం తప్పదనివ్రాసాడు.  PLA [పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ] సరిహద్దులలో ఒక్క అంగుళం భూమిని కూడా కోల్పోదు అని అంతటి పోరాటపటిమ  PLAకు ఉన్నాదని చైనా  ప్రజలకు భరోసా ఇస్తున్నట్లుగా ''వ్రాసాడు.
 
       చైనా  PLA[పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ] కథ ఏమిటో ఒకసారిచూద్దాం.   PLA [పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ] చైనాలో 1949 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది , అప్పటి నుండి విదేశాలతో చేసిన పలు యుద్దాలలో PLAతన శత్రుపక్షం ను తక్కువగా అంచనా వేస్తూ వెనుకకు తగ్గేదని స్పష్టంగ తెలుస్తున్నది. అందుకే  చైనాపైనే అనేకదేశాలు దాడులు చేస్తుంటాయని చైనా మాత్రం ఎప్పుడు శాంతినే  కోరుకొంటుందని అందుకే చైనా నిరంతరం భాదిత దేశం అని ప్రపంచానికి చెప్పుకొంటున్నది. ప్రపంచం దానిని అమాయకంగా నమ్ముతుందని చైనా కలలు గంటున్నది.1962లో చైనా భారత్ పై దాడి  చేసి మనదేశానికి సంభంధించిన కొంత భూభాగాన్ని ఆక్రమించుకొని వెనక్కి వెళ్ళింది ఆ భూభాగం ఇంకా చైనా ఆధీనంలోనే ఉన్నది. ఈ వాస్తవాన్ని వక్రీకరించి ఆ సమయంలో భారత్ చైనాకు సంధించిన భూభాగాన్ని ఆక్రమించుకొనేందుకు విఫల ప్రయత్నం చేసే భారీ మూల్యం చెల్లించుకొన్నదనివ్రాసాడు. 1962 ముందు వరకు భారత్ కు ఏ భయం లేదు కానీ చైనా తో  యుద్ధం తరువాత చైనా అంటే భారత్ కు భయం ఏర్పడింది ఇప్పుడుఏమి ధైర్యం వచ్చిందోతెలియదు   భారత్ చైనానుకవ్విస్తున్నది. చైనా సైన్యం సంయమనం తో ఉంటె భారత్ నిప్పు రాజేస్తున్నది అనే వ్రాసుకొంటూపోయాడు.
  చైనా ఎప్పుడు శాంతిని కోరుకొంటుంది అభివృద్ధిని కోరుకొంటుంది అందుకే గడచినా 30సంవత్సరాలుగా మేము ఏ దేశం తో యుద్ధం చేయలేదు ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని దేశాలు చైనా శాంతిని బలహీనంగా భావిస్తున్నారని సన్నాయి నొక్కులు నొక్కింది చైనా ప్రపంచం లో ఒక అభివృద్ధి చెందిన దేశంగ తీర్చి దిద్దుకొనుటకు ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితులలో చైనా కేవలం అభివృద్ధే కాదు చైనాకు పోరాడేశక్తి ఉన్నదని ప్రపంచానికి తెలియాలని చైనా ప్రజలు కోరుకొంటున్నారు. పదే  పదే  మమల్ని రెచ్చకొట్టవద్దని భారత్ ను హెచ్చరిస్తున్నాము చైనాకు తన శక్తిని ప్రదర్శించే పరిస్థితులు కల్పించవద్దని భారత్ ను కోరుతున్నాం. మా విధానం భారత్ ను శక్తి వంతం చేయటంకానీ  భారత్ మమ్మల్ని రెచ్చగొడుతున్నది. మా దేశంలోని  సాధారణప్రజలు ఏమి భయపడరు వారికీ PLA పై పూర్తి విశ్వాసం ఉన్నదని వ్రాసాడు. ఇది చూస్తుంటే సరిహద్దులలో భారత్ సమస్యలు సృష్టిస్తున్నదని చైనా ప్రజలకు అర్ధం చేయించటానికి నానా తంటాలు పడు తున్నారని  అర్ధమౌతున్నది.

                    చైనాకు భారత్ నుండి మూడు  విషయాలలో ఆందోళన ఉన్నది.  1] చైనా తలపెట్టిన రోడ్ పాకిస్తాన్ నుండి పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మిర్ గుండాపోతున్నది. ఈ మధ్య భారత్ భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడులుచేయటం మరియు భారత్ లో ఉన్న కశ్మీర్ కు సంబంధించిన 370 అధికరణాన్ని రద్దు చేసింది, లద్ధాకును  కేంద్రపాలితప్రాంతం చేసింది. సమీపభవిష్యత్తలో POK స్వాధీనం చేసుకొనే అవకాశం ఉన్నది, అప్పుడు తన పథకం సాగదు. 2]భారత్ ఈ మధ్య టిబెట్ విషయంలో ప్రపంచ దేశాల దృష్టికి తెస్తున్నది. వీటి కారణంగా చైనాకు ఇబ్బందులు రావచ్చు. 3]భారత్ అమెరికా మధ్య సంభందాలు బలపడుతున్నాయి. ఇది తనకు సమస్య అని చైనా భావిస్తున్నది.   అంతేకాదు లద్ధాకు కేంద్రం పరిధి లోకి వెళ్ళటం తన ఆక్రమణ లో వున్నా భారత్ భూభాగాన్ని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం జరగవచ్చు. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే భారత్ ను ఒత్తిడి లో ఉంచాలని చైనా ముందుస్తు  దాడికి దిగుతున్నది . ఈ ఎత్తుగడ ఫలించెట్లు లేదు అని చైనాకు అర్ధమవుతున్నది. అందుకే దారులు వెతుకుతున్నది.
భారత సైన్యం అత్యంత కీలక స్థానాన్ని చేచ్ఛికించుకోంది దానికి చైనా నిరసన తెలుపుతొంది. భారత సైన్యం ఇప్పుడు  పాంగోంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డున ఉన్న చైనా సైన్యం సైనిక స్థావరాలను  మాత్రమే కాకుండా, సరస్సు యొక్క ఉత్తరాన ఉన్న ఫింగర్ 4 ప్రాంతానికి ఎదురుగానిలబడి ఉన్నది. ఇట్లా భారత్ సరిహద్దులలో తన స్థానాన్ని స్థిరపరచుకొంటున్నది. ఇది చైనా కు సమస్య. భారతీయ సైనికులుమన సరిహద్దులలో ముళ్లకంచ ఏర్పాటు చేశారు. చైనా దళాలుదూరంగా ఉండాలి దానిని దాటిచొరబాటుకు  ప్రయత్నిస్తే ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం చైనా దళాలకు నిన్న  కఠినంగా హెచ్చరించింది. ఈరోజు చైనా ప్రభుత్వ అధికారులతో మన విదేశాంగశాఖ మంత్రి మాట్లాడ బోతున్నారు ఏమి చర్చలు జరుగుతాయో వేచి చూద్దాము.

రాంపల్లి మల్లికార్జున్

Saturday, September 5, 2020

నిషేధం పై ఎట్టకేలకు స్పందించిన చైనా


     గడిచిన నాలుగు నెలలు గా  భారత్ చైనా ల మధ్య జరుగుతున్నా శాంతిచర్చలు చైనా తెగనివ్వటం లేదు. చైనా ఎత్తుగడలను పసిగడుతున్న భారత్ చైనా పై ఆర్ధిక ఒత్తుడులు తెస్తున్నది. చైనాకు సంబంధించిన 224 apps నిషేధించినది.  pubji app  నిషేధించిన తరువాత మొదటిసారి  చైనాలో కదలిక వచ్చింది. దాని పై  చైనా అధికారిణి HUA స్పందిస్తూ'' పురాతన సంస్కృతి కలిగిన మన రెండు దేశాల మధ్య వేల సంవత్సరాల  నుండి సంబంధాలు ఉన్నాయి.   'మా దేశంలో రవీంద్రనాధ్ ఠాగూర్ కవితలు, యోగ కు ఎంతో ఆదరణ ఉన్నది. నాకు కూడా యోగ, భారతీయ సంస్కృతి అంటే  ఎంతో ఇష్టము అవి మాదేశానికి ప్రమాదమని మేము ఎప్పుడు భావించలేదు. మా apps దేశ భద్రతకు ప్రమాదమని భారత్ భావించటం మాకు ఆశర్యం కలిగిస్తున్నది. apps నిషేధించటం వాషింగ్టన్ కు ఏమైనా సంబంధం ఉన్నదా?ఎందుకంటే భారత్ మా apps నిషేధించిన రోజే అమెరికా విదేశాంగ శాఖా చైనా కు సంబంధించిన 100appsనిషేధించింది. దీనితో భారత్ నిర్ణయాలపై అమెరికా ప్రభావం ఉన్నదని అనిపిస్తున్నది. భారత్ సొంత నిర్ణయాలు తీసుకోవటానికి కట్టుబడి ఉంటుందని మేము భావిస్తున్నాం. భారత్ మా దేశానికీ సంభందించిన 275 apps ఫై దృష్టి పెట్టిందని మాకు తెలుసుచైనాను ఆర్ధికంగా దెబ్బకొట్టాలని, చైనా పెట్టుబడిదారులకు నష్టం కలిగించాలని చూస్తున్నది. ఇది భారత్ నిర్లక్ష్యధోరణి'' అని వ్యాఖ్యానించింది. భారత్ అమెరికా మధ్య సంబంధాలు, అవగాహన పెరగటం పై చైనా మొదటిసారి  తన అక్కసు వెళ్లగక్కినది.
          ఒక ప్రక్క ఇట్లా అక్కసు వెళ్లగక్కుతూ మరోప్రక్క భారత్, నేపాల్ మధ్య ఉన్న 1700 KM ల   సరిహద్దులలో భారత్ వ్యతిరేక ప్రదర్శనలు చేయటానికి నేపాల్ లోని వివిధ సంస్థలకు 2. 5కోట్ల నేపాలీ డబ్బు ఇచ్చిందని  మన నిఘా సంస్థల సమాచారం. చైనా mothpice ఐనా globaltimes పత్రికలో ఈరోజు ''భారత్ చైనాను ఏకపక్షంగా రెచ్చగొట్టటం ద్వారా సరిహద్దులు యధాతథ స్థితిని ఏకపక్షంగా మార్చాలని చూస్తున్నది. భారత్ తనకు తాను అతిగా అంచనా వేసుకొంటున్నది. టిబెట్ వేర్పాటు వాదులను రెచ్చగొడుతూ చైనాను హెచ్చరించాలని చూస్తున్నది. దీనితో  భారత్ తనకు  తాను  మరింత దిగదార్చుకొంటున్నది. వీలైనంత త్వరగా భారత్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవట హేతుబద్ధమైన చర్యగా మేము  భావిస్తున్నము'' అని వ్రాసుకొంటూ వచ్చింది.
 మొత్తం మీద చైనా ఒకప్రక్క సరిహద్దులలో సైన్యాన్ని ఆయుధాలను పెంచుతూ మరోప్రక్క నేపాల్ ను రెచ్చగొడుతూ టిబెట్ విషయం మాట్లాడుతూ ఇంకోప్రక్క మనం అమెరికా కంటే ఎక్కువ సంబంధాలు ఉన్న వాళ్ళం అని సర్ది చెబుతూ  తనపెద్దరికాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నది. ఆర్ధిక నష్టం చైనాను ఆలోచింప చేస్తున్నది ఇది మనదేశానికి సానుకూలమైనది. దీనితో మనదేశం ఆచితూచి అడుగులు వేస్తున్నదని అర్ధమవుతున్నది

 రాంపల్లి మల్లికార్జున రావు
                                                            9440912192 

 
.

Friday, September 4, 2020

దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

 
“మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్యదేవో భవ “ అని తైత్తరీయ ఉపనిషత్తు తల్లి, తండ్రి తరువాత ఆచార్యునికి ఉన్నతమైన గౌరవ స్థానమును ఇచ్చింది. ఆచార్యుడు అంటే తమ ఆచరణ ద్వారా ఎవరైతే నేర్పిస్తారో వారు అని అర్ధం. ఇక్కడ ఆచార్యుడ్ని ఉపాధ్యాయునిగా అనుకుని ఆలోచిద్దాం! పాఠశాల సమాజానికి  ఓ చిన్న రూపం. పాఠశాల అనే చిన్న సమాజాన్ని తీర్చిదిద్ది,తద్వారా దేశాభివృద్దిలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్న వారు ఉపాధ్యాయులు. విద్యార్థుల శ్రేయస్సే ఆశయంగా అహర్నిశలు శ్రమిస్తూ, అంకిత భావం కల ఉపాధ్యాయులు ఎందరో.. నేటికీ దేశ శ్రేయస్సుకి తోడ్పడుతున్నారు. వ్యక్తి అభివృద్ధియే దేశాభివృద్ధి అవుతుంది. అలాంటి మంచి వ్యక్తుల నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది.
*ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యత*
        
"స్వాతంత్ర్యమే నా జన్మ హక్కు" అనే నినాదంతో స్వతంత్ర పోరాటములో పాల్గొన్న బాల గంగాధర తిలక్ ని ఒక పత్రికా విలేఖరి ఇలా అడిగాడు. “దేశానికి స్వతంత్రము వచ్చి, ప్రభుత్వమును ఏర్పాటు చేస్తే మీరు ఏ శాఖకు మంత్రి గా పనిచేస్తారు?'' అప్పుడు బాల గంగాధర్ తిలక్ ఇలా అన్నాడు. “ ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక  నేను మంత్రిని అయితే ఆ శాఖకు మాత్రమే వన్నె తెస్తాను. కాని నేను ఉపాధ్యాయునిగా తిరిగి పునాకు వెళ్లి, ఇలాంటి  వన్నె తెచ్చే ఎంతో మంది మంత్రులను తయారు చేస్తాను"అని ఉపాధ్యాయవృత్తి యొక్క ప్రాధాన్యతను తెలియ చేసాడు.   
        
డా,,అబ్దుల్ కలాం గారు తమిళ పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి "చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారు కదా!మీ విజయానికి కారణం అదృష్టమా?" అని అడిగితే "అవును చిన్నతనంలో నాకు మంచి దారి చూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం" అని బదులిచ్చారు. కలాం గారి గారి మాటల్లో ఇంకా చెప్పాలంటే “ ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని, సామర్ధ్యాన్ని , భవిష్యత్తును రూపుదిద్దే  మహోన్నత వ్యక్తే ఉపాధ్యాయుడు. వీలు దొరికినప్పుడల్లా ఏదైనా కళాశాలకు గాని,  విశ్వవిద్యాలయానికి గాని వెళ్లి వివిధ అంశాలపై కలాం గారు ఉపన్యసించేవారు.తన అనుభవాలను విద్యార్థులతో పంచుకొనేవారు.

 ఉపాధ్యాయ వృత్తితో ప్రారంభమైన తన జీవన యానంలో అంచెలంచెలుగా ఎదిగిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్  రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని నిర్వహించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినపుడు- దేశ విదేశాల్లో ఉన్న తన శిష్యులు, శ్రేయోభిలాషులు అభినందించి, ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుతామని చెప్పగా, తన పుట్టినరోజును ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకుంటే తాను ఆనందిస్తానని రాధాకృష్ణన్ అన్నారు. తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని కోరినందుకు- అధ్యాపక వృత్తిపై ఆయనకున్న గౌరవం ఎంతటిదో మనకు అవగతమవుతుంది. దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు బోధనావృత్తిని ఆయన ఎంతో పవిత్రంగా నిర్వహించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, తన ఉపాధ్యాయ జీవితాన్ని ఆయన ఏనాడూ మరిచిపోలేదు. ఉపాధ్యాయ దినోత్సవం జరపడమంటే- ఆ వృత్తికి సమాజంలో గౌరవం, గుర్తింపు, ప్రతిష్ట మరింతగా ఇనుమడించాలనేది ఆయన విశ్వాసం.
నైపుణ్యాలను వెలికితీయుటలో....
       వజ్రం ఎంత గొప్పదైనా.....దానికి సానపట్టడం ద్వారా దాని వెలుగు బయటపడుతుంది. అదే విధంగా చిన్నారులలో సహజ సిద్దంగా దాగిఉన్న సామర్థ్యాలను వెలికి తీసి, సానబట్టి, వజ్రాల్లా తయారు చేయుటలో నిమగ్నమై పోయేవారు ఉపాధ్యాయులే.మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయటంలో ప్రధాన పాత్ర పోషించేవారు ఉపాధ్యాయులే. అత్యున్నత పురస్కారాలు పొందిన వారి దగ్గర నుండి సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ప్రగతికి  చిన్న నాటి ఉపాధ్యాయులే కారణమని,  ప్రేరణ అని  చెప్పుకోవడం సహజంగా గమనిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఒక ఉపాధ్యాయుని దగ్గర శిక్షణ పొందినవారే కావడం ఒక విశేషం. ఆ విధంగా సమాజ వికాసానికి, సమాజ నిర్మాణానికి అహర్నిశలు పనిచేసే ఉపాధ్యాయులను స్మరించుకోవడం మన కనీస బాధ్యత. అంతే కాదు వారిని సముచితమైన రీతిలో గౌరవించుకోవటం కూడా ఎంతైనా అవసరం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు అయినా ప్రతి వ్యక్తి- ప్రతి విద్యార్ధి, తనను తీర్చిదిద్దిన లేదా తనకు స్ఫూర్తినిచ్చిన ఉపాధ్యాయునికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పుదాం. వారి యోగక్షేమాలు తెలుసుకుందాం. వారిని ఆనందింపజేద్దాం.
(సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక వ్యాసం)
-సాకి.

*మరణం లేని మహావీరులు*

*మరణం లేని మహావీరులు*          "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...