Monday, November 30, 2020

భారతీయతాత్వికుడు గురునానక్

భారతీయతాత్వికుడు గురునానక్
జాతిభేదమణచి జాతీయతనునింపి
చిన్నపెద్దతనము చితిని పేర్చి
గుడ్డితనముబాపె గురునానకుడతడు
శాంతి కేతనంబు సమరసంబు
           జాతి భేద భావాలను అణచి సోదర భావాన్ని నిర్మాణం చేసేందుకు సిక్కుమతాన్ని స్థాపించిన తాత్వికుడు గురునానక్ దేవ్. గురునానక్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సిక్కులు కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతిని ప్రకాశ పర్వం అని కూడా అంటారు. ఈరోజున సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ ను విధిగా  పారాయణం చేస్తారు. గురుగ్రంథ్ సాహిబ్ ను పూలతో అలంకరించిన రథంలో ఊరేగింపుగా తీసుకెళతారు. ఈ పవిత్ర దినం రోజున గురుగ్రంథ్ సాహిబ్ పంక్తులను జపిస్తారు. గురునానక్ జయంతి సిక్కు సమాజానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిఉంది. సిక్కు సమాజానికి 10 మంది గురువులు ఉన్నప్పటికీ, సిక్కు ప్రజల మొదటి గురువు, సిక్కు మతానికి పునాది వేసిన వ్యక్తి ఆయనే కాబట్టి గురునానక్ జయంతిని ఉత్సాహంతో జరుపుకుంటారు.
         గురునానక్ దేవ్ 1469లో పంజాబ్ లో గల తల్వాండి గ్రామంలో కార్తీక పౌర్ణమిన జన్మించారు. ఇది ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది. గురునానక్ తల్లిదండ్రులు కళ్యాణ్ చంద్, దాస్ బేడి. 20 ఏటనే ఇల్లు వదిలి 30 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రయాణం చేశారు. భారత దేశమే కాక, శ్రీలంక, టిబెట్,సౌదీ, ఆప్ఘనిస్థాన్ వంటి వివిధ దేశాలు పర్యటించారు. ఆ సమయానికే మత ఛాందస విదేశీశక్తులతో ఒకవైపు, కుళ్ళుకుట్రల దురభిమానంతోనున్న స్వదేశీయులతో మరోవైపు దేశం నిండిపోయింది. అప్పుడు స్వదేశీ, స్వధర్మ రక్షణ చేస్తూ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పే సిక్కుపంథాను ప్రారంభించారు. దురాక్రమణదారుల నుండి జాతిని రక్షించేందుకు, మూడాచారాలను రూపుమాపేందుకు గురుగ్రంథ్ సాహెబ్ ద్వారా బోధనలు అందించారు.
    గురునానక్ బోధనల్లో మంచితనం, స్వచ్ఛత మరియు నిస్వార్థ సేవ, శాంతి సామరస్యతలను పెంపొందింపజేసే వివిధ సూత్రాలు ఉన్నాయి. గురు గ్రంథ్ సాహెబ్ లోని బోధనలు నిజాయితీతో కూడిన ప్రవర్తన ను మరియు అందరికీ సామాజిక న్యాయం తీసుకురావడానికి దోహదపడును.గురునానక్ దేవ్ బోధనల ప్రకారం సిక్కు మతానికి సంబంధించి మూడు మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. అవి 
1.‘‘నామ్ జపన (దేవున్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం) 2.కిరాత్ కర్ణ (నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటం) 
3.వంద్ చకనా (మీతో ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం).‘‘
        కులానికి ప్రాధాన్యతనివ్వకుండా నేరుగా పరమాత్మతో భక్తి బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలని గురునానక్ తెలిపారు. అందుకే ఆయన శిష్యులలో లాలో అనే వడ్రంగి, శివనాగుడు అనే రాజు, చతుర్దాసు అనే బ్రాహ్మణుడు, సజ్జన్ అనే ముస్లిం ఉండేవారు. సామాజిక సమరసతకు తెచ్చిన మార్పుతో ఆయన మూడు ముఖ్య సూత్రాలు ప్రవేశపెట్టారు. అవే సామూహిక ప్రార్థన, సామూహిక భోజనం, సామూహిక వసతి. ఈ మూడు సమాజంలో ఉచ్చనీచ, ధనిక పేద, ఎక్కువ తక్కువ అనే భావనలను దూరం చేస్తాయనటంలో ఏ సందేహం లేదు. అన్ని జీవులలో భగవంతుణ్ణి దర్శించి, అందరం సమానమే అనే ధర్మసూత్రాన్ని అందించిన గురునానక్ బోధనలు నేటి సామాజిక స్థితికి అవసరం. దేశప్రజలంతా సంకుచిత స్వభావాన్ని వదిలి, దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాల్సిన సమయమిది. గురునానక్ సందేశాన్ని అందుకుని భారత్ ని విశ్వ గురువుగా నిలబెట్టేందుకు కృషి చేద్దాం.
(కార్తీక పౌర్ణిమ గురునానక్ జయంతి)

- సాకి, 9951172202.

Wednesday, November 25, 2020

రాజ్యాంగం అందించిన మన వారసత్వం

రాజ్యాంగం అందించిన మన వారసత్వం
              1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా... రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకొంటారన్న అనుమానాలు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి
           ఎందుకో తెలుసుకోవాలంటే ఓసారి చరిత్రలోకి వెళ్లాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్ట్ 15న. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడమంటే అంత సులువు కాదు. అందుకు రెండేళ్లకు పైనే సమయం పట్టింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు. అంటే 1949 నవంబర్ 26న.రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్... మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం 'జనగణమన'ను స్వాతంత్ర్య సమరయోధురాలు పూర్ణిమా బెనర్జీ ఆలపించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిన రోజు ని "రాజ్యాంగ దివస్" గా జరుపుకుంటున్నాము. ఈ సందర్బంగా మనం కొన్ని ఆసక్తికర అంశాలని కింద తెలుసుకుందాం.

రాజ్యాంగరూపకర్తల దృష్టిలో హిందుత్వం
        రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగపు తుది ప్రతిని పరిశీలిస్తే హిందూ వారసత్వాన్ని రూపకర్తలు గుర్తించినట్లే కనిపిస్తుంది. రాజ్యాంగంలో ఇరవై రెండు రేఖా చిత్రాలు ఉన్నాయి. వాటి జాబితాను చూస్తే ఆసక్తికరమైన అనేక విషయాలు తెలుస్తాయి.

1.ముస్లిం యుగానికి ముందు కాలానికి సంబంధించిన చిత్రాల్లో మొహంజొదారో ముద్ర, వైదిక ఆశ్రమం (గురుకులం), లంకపై రాముని యుద్ధం, గీతోపదేశం, బుద్ధభగవానుడు, మహావీరుడు, ధర్మప్రచారం, హనుమంతుడు, విక్రమాదిత్యుని ఆస్థానం, నలందా విశ్వ విద్యాలయం, ఒరిస్సాకు చెందిన శిల్పం, నటరాజ విగ్రహం, గంగావతరణ దృశ్యం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువల్ని ప్రతిబింబించే చిత్రాలే. ఇవన్నీ దుష్టశిక్షణ, కర్తవ్యపరాయణత్వం, సేవాభావం, మానవత్వం, జ్ఞానం, ధర్మపరాయణత్వం వంటి హిందూ జీవన విలువల్ని చూపుతాయి.

2. మధ్యయుగానికి ప్రతీకగా ఒరిస్సాకు చెందిన హిందూ శిల్పం, నటరాజ విగ్రహం, భగీరధుని తపస్సు, గంగావతరణాల చిత్రాలు తీసుకున్నారు. అంటే అప్పటి వరకు హిందూ పరంపర, సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగాయని రాజ్యాంగకర్తలు గుర్తించారు. ఆ తరువాత ముస్లిం యుగం ఈ అవిచ్ఛిన్న పరంపరను అడ్డుకుందని కూడా వాళ్ళు సూచించారు.
           ఈ సాంస్కృతిక భావనే వివిధ రాజ్యాంగపు గుర్తులు, ప్రభుత్వ సంస్థల ఆదర్శ వాక్యాలలోనూ కనిపిస్తుంది.
 *పార్లమెంటులో స్పీకర్ కుర్చీకి పైన ‘ధర్మచక్ర ప్రవర్తనాయ’ (ధర్మచక్రాన్ని తిప్పుటకొరకు) అని చెక్కి ఉంటుంది. ‘ధర్మ’ భావన హిందూ సంస్కృతిలో తప్ప మరెక్కడా కనిపించదు. (దీనిని మతంగా పొరబడు తుంటారు). 
*అలాగే  ‘లోక ద్వార మపావార్ను పశ్యేమ వయంత్వా'   -ఛాందోగ్య ఉపనిషత్ (ప్రజాశ్రేయస్సు కొరకు ద్వారాన్ని తెరచి వారికి ఉదాత్తమైన సార్వభౌమత్వ పథాన్ని చూపించు) అని ప్రవేశ ద్వారం వద్ద రాసి ఉంటుంది. 

*సెంట్రల్ హాల్ దగ్గర ---
అయం నిజః పరోవేతి 
గణనా లఘు చేతసాం
ఉదార చరితానాంతు
 వసుధైవ కుటుంబకం - పంచతంత్రం. (నావాళ్ళు, ఇతరులు అంటూ ఆలోచించటం సంకుచిత మార్గం. ఉదారశీలురైన వారికి సమస్త జగత్తు ఒకటే కుటుంబం) అని ఉంటుంది. 

*సభలోని ఒక గుమ్మటం లోపలి వైపున -   ‘న సా సభా యత్ర న సంతి వద్ధా| , వృద్ధా| న తే యే న వదంతి ధర్మం, 
ధర్మ| స నో యత్ర న సత్యమస్తి, 
సత్యం న తద్ యచ్ఛలమభ్యుపైతి (మహాభారతం) (పెద్దలు లేని సభ సభ కానేకాదు, ధర్మానికి అనుగుణంగా మాట్లాడనివారు వృద్ధుడే కాదు. సత్యం లేనిదే ధర్మం నిలువజాలదు. ఏ సత్యమైనా సరే వంచనకు, కపటత్వానికి తావు లేనిదిగా ఉండాలి) అని రాసి ఉంటుంది. 

*ఇక రెండవ గుమ్మటం లోపల 
సభా వా న ప్రవేష్టాయ 
వక్తవ్యం వా సమంజసం, 
అబ్రువన్ విబ్రువన్ వాపి, 
నరో భవతి కిల్విషి 
(సభలో ప్రవేశించకుండా ఉండడమో, లేక అందులో ఉంటే ధర్మానుగుణంగా మాట్లాడటమో చేయాలి. అసలు మాట్లాడనివారు, లేదా అసత్యంగాను, అధర్మంగానూ మాట్లాడేవారు పాపం చేస్తున్నట్లే) అని ఉంటుంది. ఇవే కాక అనేక ఆదర్శవాక్యాలు, సూక్తులు పార్లమెంటు గోడలపై కనిపిస్తాయి. ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువలేనని వేరే చెప్పక్కరలేదు.
        అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం అందించే విశాల దృక్పథం పెంపొందించే సాంస్కృతిక విలువలే నేడు మనకు శ్రీరామరక్ష. ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా తన మతాన్ని అనుసరిస్తూ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అంగీకరిస్తూ, దేశ సమగ్రతకి, దేశాభివృద్ధికి పాటు పడటమే రాజ్యాంగ దినోత్సవ సందేశం. రాజ్యాంగ మౌలిక విషయాలను, ప్రాథమిక హక్కులను, పౌర విధులు, ఆదేశ సూత్రాలను అర్ధం చేసుకొని భారత దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి గా నిలుపుదాం.

-సాకి.

 

Wednesday, November 18, 2020

స్త్రీ సాధికారికతకు ప్రతీక ఝాన్సీరాణి

*స్త్రీ సాధికారికతకు ప్రతీక ఝాన్సీరాణి*
           ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు19 న వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయిలు. వీరిది మహారాష్ట్రలోని సతారా. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక. ముద్దు పేరు మను. ఝాన్సీ తల్లి ఝాన్సీ నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే మరణిస్తుంది. ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకుంటాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావుసాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా భావించి కలసిమెలసి ఉంటారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకొని పోయేది.     
       లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహం జరుగుతుంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారుతుంది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మిస్తాడు.దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకుతుంది. ఎవరినైనా బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇస్తారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. కానీ ఆ మరుసటి రోజునే అనగా 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణిస్తాడు.

ఝాన్సీ రక్షణ లో రాణి

     సభలో ఝాన్సీ తండ్రికున్న ప్రాబల్యం వలన, మిగిలిన యువతులు, ఎవరైతే జనానా ఆచారాలు పాటిస్తుంటారో వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఝాన్సీ కలిగి వుండేది. లక్ష్మీబాయి కత్తియుద్ధం, గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది. అంతే కాకుండా తన స్నేహితురాళ్లందరినీ చేర్చుకొని స్త్రీల దళాన్ని తయారుచేస్తుంది.దామోదర్ రావు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించదు. దామోదర్ రావు వీరికి పుట్టిన బిడ్డకానందువలనే ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం దత్తపుత్రుడు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేస్తుంది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా ప్రయోజన లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులు రాణి మీద కక్ష కడతారు. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకుంటారు. మార్చి 1854 లో రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ చేస్తుంది.రాణి ఝాన్సీ ని ఇంగ్లీషు వారికి ఇవ్వకూడదని నిర్ణయించుకుంటుంది. ఆమె తన సైన్యాన్ని బలపర్చి మరియు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళను పోగుచేసి ఒక సైన్యాన్ని తయారుచేస్తుంది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదా బక్ష్, లాల భుబక్షి, మోతీ బాయి, సుందర్-ముందర్, ఖాసి బాయి, దీవాన్ రఘునాథ్ సింగ్, మరియు దీవాన్ జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు.

1857 సంగ్రామానికి నేతృత్వం  
    
    ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నపుడు మే 10,1857లో మీరట్ లో భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ( ఆంగ్లపాలకుల దృష్టిలో సిపాయి తిరుగుబాటు) మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మానులకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసి కూడా, వాళ్ళు యుద్ధములో తుపాకి గుండ్లు తగలకుండా వేసుకొనే తొడుగులకు, మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళను వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి,ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో చంపబడతారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొంటారు.
ఇంతలో, మే 1857,లో భారత దేశంలో కలవరం మొదలైంది, ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితులలో,బ్రిటిష్ వాళ్ళు వేరే ప్రాంతంలో వాళ్ళ దృష్టిని పెట్టవలసిందిగా ఆదేశాలు రావడంతో, ఝాన్సీ ని లక్ష్మిబాయిని గురించి పెద్దగా పట్టించుకోరు. ఝాన్సీ రాజ్యం రాణి ఆధీనంలోనే ఉంటుంది. ఇదే సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, తన చాతుర్యంతో ఝాన్సీరాణి యుద్ధానికి కావలిసిన సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. ఈ సమర్థత కారణం వలన ఝాన్సిని శాంతియుతంగా ఉంచగలిగింది.

యుద్ధరంగంలో అపరకాళిక
 
           జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు ఝాన్సిలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని మరియు తిను భండారాలను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మిబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది.ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ వారితో చాలా భయంకరంగా యుద్ధం చేసింది. లక్ష్మిబాయికి సహాయం చేయటానికి తిరుగుబాటుదార్ల నాయకుడైన తాంత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం వస్తుంది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కేవలం 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నారు కాని, ఏ శిక్షణ లేని తాంత్యా తోపే సైన్యం కంటే బ్రిటీష్ సైనికులు చాలా శిక్షణ పొందినవాళ్ళు, మరియు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో, బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వారు నగర గోడలను బద్దలుకొట్ట నగరాన్ని ఆక్రమించుకోగలుగుతారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున కట్టుకొని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.
రాణి మరియు తాంత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు సహాయంతో గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని గ్వాలియర్ ను స్వాధీనం చేసుకుంటారు. ఆ సంతోషంలో వీరుండగా మరుసటి రోజే బ్రిటీష్ సేనలు గ్వాలియర్ ను ముట్టడిస్తాయి. లక్ష్మీబాయి గ్వాలియర్ కోట తలుపులు తెరపించి బ్రిటీష్ వారిని ఎదర్కొంటుంది. యుద్ధం భయంకరంగా సాగుతుంది. కాని,17 జూన్ 1858 యుద్ధములో రాణి మరణిస్తుంది .
తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను ఆక్రమించుకుంటారు. ఈ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ *విప్లవ కారుల్లోకెల్లా ఆమె అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పింది* అని మెచ్చుకుంటాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. నేటి స్త్రీలోకమంతా కర్తృత్వ, నేతృత్వ, మాతృత్వాలకి ప్రతీకగా లక్ష్మీబాయి అడుగుజాడల్లో నడవాలి. స్త్రీ సాధికారికతలో నారీలోకానికి ఆదర్శ ప్రాయులైన భారతీయ మహిళలు ఎందరో... అందరికి వందనాలు.

-సాకి -9951172002.

Thursday, November 12, 2020

జ్ఞానకాంతులను వెదజల్లడటమే దీపావళి

మనదేశంలో జరుపుకునే పండుగలలో కొన్ని ఉత్తర భారతంలో ప్రసిద్ధి, కొన్ని దక్షిణ భారతంలో ప్రసిద్ధి, కానీ దీపావళి పండుగ ఈ దేశమంతా  ప్రసిద్ధి.దీపావళికి పౌరాణికంగా కూడా  ఎంతో వైశిష్ట్యం ఉంది. దీపావళి కి సంబంధించి అనేక పురాణ గాధలు  ఉన్నాయి.   ఆ గాధలలో  పాలసముద్రం నుండిలక్ష్మీదేవి ఆవిర్భవించిన శుభ దినం అని కొందరి అభిప్రాయం, శ్రీరాముడు రావణాది రాక్షసులను అంతమొందించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన రోజు అని కూడా అంటారు అందుకే అయోధ్యలో దీపోత్సవకార్యక్రమము పెద్దఎత్తున జరుగుతుంది.   మనం జాగ్రత్తగా ఆలోచిస్తే త్రేతాయుగంలో భగవాన్ శ్రీ రామ చంద్రుడు రావణాసురుని విజయదశమి పండుగ రోజున సంహరించాడు,   అందుకే ఆరోజు రామ్ లీలా కార్యక్రమం పెద్దఎత్తున చేసుకొంటాము , అదే మాసంలో ద్వాపరయుగంలో భగవాన్ శ్రీ కృష్ణుడు నరకాసురుని సంహరించిన రోజు   దీపావళి పండుగ జరుపుకుంటాము,  మొత్తం మీద అసుర సంహారం, అసుర ప్రవృత్తి సంహారము ఎప్పుడైనా లోక కల్యాణానికి దారితీస్తుంది అందుకే ఆ రోజుల్ని పండుగ గా  జరుపుకుంటాం.

 శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన శుభ ఘడియలలో  జరుపుకొనేది  దీపావళి పండుగ అయితే  అట్లాగే  కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినరోజు గీతాజయంతి జరుపుకొంటాం   ఈరెండింటికి కృష్ణుడుతోనే సంభంధం ఉన్నది అందుకే దీపావళి  భగవత్గీతకు  అన్నగారిని  చెప్పవచ్చు,  ఉపదేశ  గ్రంథాలలో  భగవద్గీత కు ఎంతటి ప్రాధాన్యత ఉందో  పండుగలలో  దీపావళికి  అంతటి ప్రాధాన్యత ఉంది.   దీపావళి  పండుగ ఈ దేశంలోని  బౌద్ధులు, జైనులులతో సహా  అన్ని మతాలు, సంప్రదాయాల వారు  కూడా జరుపుకుంటారు.   ఈ పండుగకు ఇంకొక విశేషం కూడా ఉంది ఈ పండుగను  దేశమంతా ఒకే రోజున జరుపుకుంటారు, ఎందుకు ఈ పండుగ కి ఇంతటి  ప్రాధాన్యత ఉందో  తెలుసుకోవాలి, ఆ   వివరాలు కంచి పరమాచార్య మాటలలో  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  

'' ప్రస్తుతం ఉన్న  అస్సాం  ప్రాంతంలో ప్రాగ్జోతిషపురం అనే నగరం ఉండేది, ఆ నగరాన్ని భౌముడు అనే  రాజు పాలించేవాడు అతనికి నరకాసురుడు అనే మరో  పేరు ఉండేది. నరకాసురుడు గొప్ప తపస్వి దాని  ద్వారా సాధించిన శక్తులను  ప్రజాహితం కోసం కాకుండా   లోకాలను హింసించేందుకు ఉపయోగించాడు. ఆధర్మ మార్గంలో లోకాలను హింసిస్తూ  లోకకంటకుడైనాడు.     అభేద్యమైన దుర్గాలలో అజేయుడుగా ఉండేవాడు.,   అతడు కొన్ని వేల మంది కన్యలను చెరపట్టాడు, అట్లాగే సాధు సంతులను హింసించేవాడు.    ఇటువంటి లోక కంటకులను  సంహరించేందుకు ద్వాపరయుగ అంతంలో భగవంతుడు కృష్ణావతారం   ఎత్తవలసి వచ్చింది. భగవంతుడు కూడా నరకాసురుని యుక్తితోనే   సంహరించవలసి వచ్చింది.   స్త్రీలకు పుత్ర శోకం కంటే గొప్ప శోకం వేరే లేదు.  భర్త చనిపోతే తనకున్న రక్షణ పోయిందే  తన సౌకర్యాలను చూసేది ఎవరు, ముత్తయిదువులమైన మాకు హేయమైన వైధవ్యం ప్రాప్తించిందే  అని స్త్రీలు దుఃఖ పడవచ్చు ఈ దుఃఖం లో కొంత స్వార్థం ఉంది, కానీ కొడుకు విషయం వేరు  కొడుకు వయసులో ఉండి  చనిపోయినప్పుడు   ఆ తల్లి దుఃఖం మాటలలో చెప్పలేము.   నరకాసురుని సంహారము జరిగిన  సమయంలో నరకాసురుని  తల్లి లోకానికి విరుద్ధంగా పుత్రశోకం పొందకుండా భగవంతుని చేతిలో చనిపోయిన తన కుమారుని మరణానికి సంతోషించింది, ఎంత అదృష్టం ఉంటే ఎంత తపస్సు చేస్తే తన కొడుక్కి అటువంటి భాగ్యం లభించింది, నా పుత్రుడు చనిపోతే పోనీ నాకు పుత్రశోకం కలిగిన ఫర్వాలేదు లోకాలకు ఏ విధమైన  కష్టం ఉండరాదు అని ఆ తల్లికోరుకొంది.  నరకాసురుడు లోకాలన్నిటిని    ఏకచ్ఛత్రంగా  పరిపాలించిన సార్వభౌముడు అటువంటి పుత్రుడు  చనిపోయిన రోజు లోకాలకు  పండుగ కావాలి అని ఆ తల్లి భగవంతుణ్ణి, ప్రార్థించింది,  అట్లాగే  యుద్ధరంగంలో  భగవాన్ ని చేత పడిపోయినప్పుడు     నరకాసురునికి  భగవద్దర్శనం కలిగింది, జ్ఞానోదయం కలిగిన నరకాసురుడు   కూడా భగవంతుని ప్రార్థిస్తూ తన స్మృతి చిహ్నంగా మానవజాతి అంతా కూడా పండుగ చేసుకో వాలి అని భగవంతుని ప్రారంభించినట్లు ప్రతీతి, అట్లాగే ఆరోజు ఎవరెవరు అభ్యంగన స్థానం చేస్తారో  వారికి గంగాస్నాన ఫలం మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని కూడా నరకాసురుడు భగవంతుని ప్రార్థించాడట.

  ఈ పండుగ వెనుక పుత్రశోకం కలిగినా  లోక క్షేమం కాంక్షించే ఒక తల్లి ప్రార్ధన ఉన్నది, ఇంతకంటే చిత్తశుద్ధిని వేరే ఎక్కడ చూడగలం,  మనం అయితే ఈ విధంగా ప్రార్ధించి ఉండేవాళ్లమా? నా కొడుకు పోయిన బాధ నాకు లేదు లోకం క్షేమంగా ఉండాలి అన్న కోరిక లో ఎంతటి మహత్తర త్యాగం ఉంది అందుకే ఈ పండుగని తరతరాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం.  మనము కష్టపడుతున్నాం,  సుఖ పడుతున్నాం దానికి ఇతరులు దుఃఖించినా  లోకం కష్టపడిన  నాకేం పర్వాలేదు అనే మనోభావం మనకి ఉండకూడదు,  మనకు బాధ కలిగినా పర్వాలేదు లోకం క్షేమంగా ఉండాలి అన్న నీతిని  దీపావళి మనకు బోధిస్తున్నది,  అందుకే మన బాధలను మనం సహించు కుంటూ లోక క్షేమం కాంక్షిస్తూ పాటుపడుతూ ఉండాలి. అందుకే  ఉపదేశ గ్రంథాలు గీత కు ఎంత ప్రాధాన్యత ఉందో పండుగలలో లోక క్షేమము అనే మహత్తర ఆకాంక్ష ఉన్న దీపావళికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది''

                           ఇక్కడే  ఇంకొన్ని విషయాలు  మనం గుర్తు చేసుకోవాలి.  నరకాసుర సంహారం తరువాత నరకాసురుని చెరలో ఉన్న కన్యలకు శ్రీకృష్ణుడు  విముక్తి కలిగించాడు, ఈ విషయాన్ని  లోకాని కంతటికి తెలియ చేసాడు ఎందుకంటే ఆ కన్యల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకువెళ్లాలని, కానీ కొద్దిమంది మాత్రమే తీసుకొనివెళ్ళారు దానితో  కృష్ణుడికి   మరోసమస్య వచ్చిపడింది వేలమంది ఈ కన్యలను ఎట్లా కాపాడాలి దానిపరిష్కార మంథన   లోనే బృందావనం ఏర్పడింది, వాళ్ళందరూ కృష్ణుని భక్తులైనారు అట్లా అప్పుడు తలెత్తిన సామజిక సమస్య పరిష్కరించబడింది, కృష్ణుడి రక్షణలో వారందరు గౌరవంగ జీవించారు.  

 స్త్రీలను చెరపట్టే  ప్రవృత్తి ఈ రోజు కూడా మనచుట్టూ కనపడుతున్నది, ఆటువంటి ప్రవృత్తిని అంతం చేయవలసిన అవసరం ఉంది అట్లాగే  మన చుట్టూ అనేక అసురీ శక్తులు విజృంభించి పని చేస్తున్నాయి.  కుల వివక్ష, స్వార్థ చింతన లక్ష్యంగా పనిచేసే శక్తులు మన చుట్టూ ఉన్నాయి.  బాధ్యత లేని పౌరుల  దురభిమానాలు, విలువలు లేని విశృంఖలత వాతావరణము, కాలుష్యం మొదలైన వికృతులు మన  జీవన విధానంగా మారి  మన సంస్కృతి సంప్రదాయాలపై ఉదాసీనభావం కలిగిస్తున్నాయి,  ఆ ఉదాసీన   దృష్టి కలిగిన యువతీ యువకుల విచ్చలవిడితనం, దేశ సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రు వ్యూహాలు ఇట్లాంటి అనేక అసురీ ప్రవృత్తులు మనచుట్టూ ఉన్నాయి.  అసురీ భావాలతో కలిగే దుఃఖం కంటే నరకం ఇంకేముంటుంది, ఇటువంటి  నరకాన్ని పొగొట్టి జ్ఞానానంద కాంతులను వెదజల్లడటమే   దీపావళి ఆంతర్యం.  ఈ శార్వరి{దీని మరోపేరే రాత్రి} ఆ నరకాలు అన్నిటినీ నిర్మూలించి ఆనంద దీప కాంతులను ప్రసరింప చేయవలసిందిగామనము  ‘’ దీపలక్ష్మీ నమోస్తుతే ‘’ అని దీపలక్ష్మిని  ప్రార్థిద్దాం.

 స్వదేశీ ఉత్పత్తులతో నే దీపావళి పండుగ జరుపుకుందాం. 

 అందరికీ దీపావళి శుభాకాంక్షలతో -----

-రాంపల్లి మల్లికార్జున్

Wednesday, November 4, 2020

త్యాగానికి ప్రతిరూపం చిత్తరంజన్ దాస్

*త్యాగానికి ప్రతిరూపం చిత్తరంజన్ దాస్*
   ‘'దాస్‌ జీవితం త్యాగానికి ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తుంది.’' దేశబంధు చిత్తరంజన్‌దాస్‌ గురించి విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ అన్న మాటలివి. గాంధీజీ రాకముందు, తర్వాత రెండు దశల స్వాతంత్ర్య ఉద్యమంలోనూ దాస్‌ ప్రముఖంగానే కనిపిస్తారు. భువన మోహన్‌దాస్, నిస్తరిణీదేవిల కుమారుడు దాస్‌. అఖండ భారత్‌లో ఢాకా సమీపంలోని విక్రమపురిలో ఆయన నవంబర్‌ 5, 1870 లో జన్మించారు. వైద్యం ఆ కుటుంబానికి పారంపర్యంగా వచ్చేది. కానీ భువనమోహన్‌ న్యాయవాది వృత్తి చేపట్టారు. చిత్తరంజన్‌ కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో పట్టభద్రుడైన తరువాత ఐసీఎస్‌ పరీక్ష కోసం 1890లో ఇంగ్లండ్‌ వెళ్లారు. ఆ పరీక్షలో సఫలం కాలేక, న్యాయశాస్త్రం చదివి 1893లో భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన నివాసం కలకత్తాయే. ఆ హైకోర్టులోనే ఆయన అద్భుతమైన బారిస్టర్‌గా ఖ్యాతి గడించారు. 1917- 1925 మధ్య రోజులలో దాస్‌ అంటే యువతరంలో ఎంతో ఆకర్షణ ఉండేది. దాస్ గొప్ప వక్త, కవి, రచయిత, పత్రికా రచయిత, ప్రఖ్యాతి గాంచిన బారిస్టర్‌. దాస్ కి సురేంద్రనాథ్‌ బెనర్జీ పట్ల అమితభక్తి ఉండేది.బెనర్జీ కుటుంబం బ్రహ్మ సమాజాన్ని అవలంబించేది. భారతీయ మూలాలను విశేషంగా గౌరవిస్తూ, ఆధునిక ప్రపంచానికి తగ్గట్టు భారతీయ సమాజాన్ని నడిపించడమే బ్రహ్మ సమాజ సభ్యుల ఆశయంగా ఉండేది. దాస్‌ కూడా ప్రాచీన భారతీయ విలువలుగా ప్రసిద్ధి పొందినవాటిని గౌరవిస్తూ, వాటి పునాదిగానే ఆధునిక భారతావనిని కలగన్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంతో బలంగా ప్రభావితమైనవారు చిత్తరంజన్‌ దాస్‌. 
     
*దాస్ వాదించిన ప్రముఖ కేసులు*

   దాస్‌ వందేమాతరం ఉద్యమంలోనూ భాగస్వామ్యులై అతివాదుల వైపు నిలబడ్డారు. 1907వ సంవత్సరంలో ఆయన అలీపూర్‌ బాంబు కుట్ర కేసుని వాదించారు. అందులో ప్రధాన నిందితుడు అరవింద్‌ ఘోష్‌. అలీపూర్‌ బాంబు కుట్ర కేసు దాస్ పేరును భారతదేశమంతటా స్మరించుకునేటట్టు చేసింది. ఈ కేసులో దాస్‌ చూపించిన ప్రతిభ భారతీయులనే కాదు.... యూరోపియన్‌ న్యాయ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. 
      అనుశీలన సమితి సభ్యుల మీద నమోదైన మరో కేసు ఢక్కా కుట్ర కేసు. అనుశీలన సమితి వ్యవస్థాపకులలో ఒకరైన పులీన్‌ బిహారీ దాస్, మరో 36 మందిపై కేసు నమోదైంది. వీరందరినీ కూడా చిత్తరంజన్‌దాస్‌ విడుదల చేయించగలిగారు. 11 మందికి మాత్రమే శిక్ష పడింది. తరువాతి కేసు ఢిల్లీ కుట్ర కేసు. 1912 డిసెంబర్‌లో లార్డ్‌ హార్డింజ్‌ వైస్రాయ్‌గా వచ్చాడు. ఇతడి గౌరవార్థం ఏర్పాటు చేసిన ఊరేగింపు జరిగింది. అప్పుడే అతడు ప్రయాణిస్తున్న వాహనం మీద బాంబు పడింది. త్రుటిలో తప్పి వెనుక ఉన్న రక్షకభటుడి మీద పడి పేలింది. అతడు మరణించాడు. హార్డింజ్‌ కూడా చిన్న దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. అమీర్‌చంద్,అవద్‌ బిహారీ, బాలముకుంద్, బసంత్‌కుమార్‌ బిశ్వాస్‌ అనే యువకులను అరెస్టు చేశారు. కానీ పథక రచనలో కీలకంగా వ్యవహరించిన రాస్‌బిహారీ బోస్‌ తప్పించుకున్నాడు. తరువాత జపాన్‌ వెళ్లిపోయాడు. చిత్తరంజన్‌ ఈ కేసును కూడా వాదించి వారిని విడిపించారు. అందుకోసం ఆయన కలకత్తా నుంచి ఢిల్లీ వెళ్లేవారు. జలియన్‌వాలా బాగ్‌ ఉదంతంలో డయ్యర్‌నీ, ఓడ్వయ్యర్‌నీ బోను ఎక్కించాలని తీవ్రంగా శ్రమించినవారిలో చిత్తరంజన్‌ ఒకరు. ఆ మారణ హోమం దాస్‌ను కలచివేసినట్టు కనిపిస్తుంది.

*గాంధీజీతో దాస్*

      1922లో గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనాలని దాస్‌ నిర్ణయించుకున్నారు. బెంగాల్‌ ప్రాంతంలో ఆ ఉద్యమానికి అవసరమైన సన్నాహాలలో కూడా నిమగ్నమయ్యారు.జలియన్‌ వాలా బాగ్‌ ఉదంతం తరువాత ఆయన న్యాయవాద వృత్తిని వీడారు. మరోవైపు చౌరీచౌరా ఉదంతం తరువాత గాంధీ ఏకపక్షంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం దాస్‌కు నచ్చలేదు. ‘బార్డోలీలో తలపెట్టిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేయడానికి ఏదైనా బలవత్తరమైన కారణం ఉండవచ్చు. కానీ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని స్తంభింప చేయడానికి ఉద్దేశించిన స్వచ్ఛంద సేవకుల కార్యక్రమాన్ని నిలిపివేయడం అసమంజసం. ఈ విధంగా మహాత్ముడు పొరపాటు చేయడం ఇది రెండోసారి’ అని దాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1922 నాటి గయ జాతీయ కాంగ్రెస్‌ సభలకు ఆయన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. శాసన మండళ్లను బహిష్కరించడం సరికాదన్నదే ముందు నుంచీ దాస్‌ వాదన. ఆ వాదన అక్కడ వీగిపోయింది. దాస్‌ కాంగ్రెస్‌కు రాజీనామా ఇచ్చారు. తరువాత స్వరాజ్‌ పార్టీ స్థాపించారు. 

*దాస్ కల గ్రామ స్వరాజ్యం*

         గ్రామాలకు పునర్వైభవం తీసుకురావడం, అక్కడ స్వయం పాలన ఏర్పాటు చేయడం దాస్‌ కలల్లో ముఖ్యమైనది.గ్రామాల్లో సహకార వ్యవస్థను ఏర్పాటు చేసి, కుటీర పరిశ్రమలను నెలకొల్పి స్వయం సమృద్ధంగా ఉంచాలని ఆయన భావించారు. అలాగే గాంధీజీతో కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ జాతీయ విద్యను, దాని అవసరాన్ని దాస్‌ సరిగానే గుర్తించారు. తాను ఏర్పాటు చేసిన జాతీయ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా నేతాజీ బోస్‌ను దాస్‌ నియమించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించడానికి కూడా ఆయన వెనుకాడలేదు.  చిత్తరంజన్‌ దాస్‌ జీవితానికి మరొక కోణం కూడా ఉంది. అది సృజనాత్మక రచనలు. మలంచా, మాల అనే గేయాల సంపుటాలు ఆయనవే. వీటికి బెంగాలీ సాహిత్యంలో ఎంతో ఖ్యాతి ఉంది. సాగర్‌ సంగీత్, అంతర్యామి, కిశోర్‌–కిశోరి ఆయన ఇతర రచనలు. ఒక అకుంఠిత కృషి తరువాత తీవ్రంగా అలసిపోయిన దాస్‌ విశ్రాంతి కోసం డార్జిలింగ్‌ వెళ్లారు. అక్కడే ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయం కలకత్తాకు వచ్చినప్పుడు దాదాపు మూడులక్షల మంది హాజరయ్యారు.  టాగోర్‌ చెప్పినట్టు చిత్తరంజన్‌ త్యాగశీలతను జాతికి నేర్పారు. అందుకే ఆయన దేశబంధు. ఆ దేశబంధు అడుగుజాడల్లో దేశ పునర్మిర్మాణానికి మనమంతా అంకితమవుదాం.
(నవంబర్ 5 దేశబంధు చిత్తరంజన్ దాస్ జయంతి)
-సాకి, కరీంనగర్-9951172002.

*మరణం లేని మహావీరులు*

*మరణం లేని మహావీరులు*          "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...