Sunday, March 28, 2021

బయట పడుతున్న కాశ్మీర్ నాయకుల ద్వందవైఖిరి


   బయట పడుతున్న కాశ్మీర్ నాయకుల  ద్వందవైఖిరి        


     కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు రాజకీయ నాయకులకు మధ్య  ఉన్న సంబంధాల పై [NIA ] నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  మొట్టమొదటిసారి చార్జిషీట్  ఫైల్ చేసింది.  మాజీ ముఖ్యమంత్రి మెహబూబా  అత్యంత సన్నిహితుడు వహిదా రెహ్మాన్  పారాపై   ఉగ్రవాద కేసులో పాల్గొన్నట్లు ఆరోపిస్తూ చార్జిషీట్ ఫైల్ అయింది. దానితో తీగలాగటం మొదలైంది వహీదా రెహ్మాన్ పారా, రోగ్, కాప్,  డేవిందర్ సింగ్, ఈ నటీనటులు   హిజ్బుల్  ముజాహిదీన్ కమాండర్ లతో ఫోన్ లో  మాట్లాడినట్టు ఎన్ఐఏ నిర్ధారించింది.  ఇందులో ఉగ్రవాది  సయ్యద్ నవీద్ ముష్తాక్, అతని సోదరుడు మరియు మరో ఆరుగురు  దానిలో ఉన్నట్లు స్పష్టమైంది.  దానితో పారాపై అభియోగాలు  ఉన్నట్లు తేలింది.  అహ్మద్ షా అలియాస్ ఫాంటూష్ జిలాని అల్లుడు సయ్యద్ అలీ షా జిలాని ద్వారా హురియత్ సంస్థకి ఐదు కోట్లు సమకూర్చినట్లు చార్జిషీట్లో పేర్కొన్నారు.  హిజ్బుల్ ముజాహిదీన్ లష్కరే తోయిబా కమాండర్ లకు ఆయుధాలు మందుగుండు సామాగ్రి కోసం 10 లక్షలు పంపినట్లుగా తేలింది.  ఈ సందర్భంగా మాజీ సీఎం మహబూబాద్ ఒకసారి ఫోన్ లో కమాండర్ సయ్యద్ నవీన్ ముక్తాతో మాట్లాడినట్లు తెలుస్తోంది ఈ కేసు విచారణలో  పీడీపీ  నాయకులు మరియు ఇతర నాయకుల వివరాలు  పరిశీలిస్తున్నారు. ఇది ఆ రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపెట్లుగా కనబడుతున్నది.  దీనితో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కాశ్మీర్ లో జరుగుతున్న రాజకీయ కుట్రలను విశ్లేషణ చేయవలసిన సమయం ఆసన్నమైనది.  కాశ్మీర్ రావణకాష్టంగా ఉండటానికి అక్కడ రాజకీయ నాయకులు ఎటువంటి వ్యూహాలు తయారుచేసేవారు  జాతి వ్యతిరేక శక్తులకు ఎట్లా అండదండలు అందించావారో తెలిసే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా కాశ్మీర్లో రాజకీయాలకు సంబంధించిన కొన్ని విషయాలను సంక్షిప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

        కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం కాశ్మీర్లో ఉన్న పార్టీల వ్యవహారం ఎట్లా ఉండేదంటే అధికారంలో ఉన్న  పార్టీల  నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండేవారు, అదే  ప్రతిపక్షంలో ఉంటే పాకిస్తాన్ కు అనుకూలంగా ఉంటూ  పాకిస్తాన్ ను పొగిడేవారు.  నరేంద్ర మోడీ  పరిపాలన లోకి వచ్చిన తర్వాత పాలనలో తెచ్చిన సమూల మార్పులు , కశ్మిర్ పై  ఒక స్పష్టమైన వైఖరితో వ్యవహరించటం  ప్రారంభమైంది,  దీనితో కశ్మీర్ లోని  నాయకులు గతంలో వ్యవహరించినట్లు గా వ్యవహరించడం సాధ్యం కావడం లేదు.  దశాబ్దాలుగా మారణకాండతో నలిగిపోయిన కాశ్మీర్ రాజకీయాలలో  ఒక కొత్త అధ్యాయం మొదలైంది.  అక్కడి నాయకులు తాము ఈ దేశం  సమర్థకులా లేక పాకిస్థాన్ ప్రేమికులా తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది.  ఈ మార్పుకు దారి తీసిన సంఘటన పుల్వామాలో సైనిక వాహనాలపై ఉగ్రవాదుల దాడి,  ఆ సమయంలో కేంద్రం తీసుకున్న కఠిన వైఖరి,  ఆ దాడికి కేంద్రం  చెప్పిన గట్టి సమాధానం అక్కడి రాజకీయ నాయకులను సందిగ్ధంలో పడేసింది.  ముఖ్యంగా పీడీపీపార్టీని  ప్రశ్నార్ధకం లోకి నెట్టింది.  2019 ఆగస్టులో  కేంద్ర  ప్రభుత్వం కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి  370 ఆర్టికల్ 35A లను  రద్దు చేసింది.   దాంతో పాటు అక్కడ శాసనసభ కూడా రద్దు  అయిపోయింది,  ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది,  అక్కడి ప్రముఖ రాజకీయ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది,  సుమారుగా ఆ నాయకులు  ఒక సంవత్సరం పాటు గృహ నిర్బంధంలోనే  ఉన్నారు.  ఈ పరిస్థితిని కాశ్మీరు నాయకులే కాదు దేశంలో కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని  సమర్ధించే నాయకులకు కూడా ఊహకు అందకుండా జరిగిపోయింది.  అంతకు పూర్వం వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ ద్వంద వైఖరి తో  రాజకీయాలు నడిపి కాశ్మీర్ కు దేశానికి ఎంతో నష్టం చేశారు.  ఆ రాజకీయాలు  ఉగ్రవాదులకు ఆర్థికంగా నైతికంగాఎట్లా సమర్ధించాయో  ఒకసారి పరిశీలిస్తే  బాగుంటుంది.  2014 పూర్వపు వరకు ఏమి జరిగిందో మనకు అర్థం అవుతుంది. 


 1989వ సంవత్సరంలో కాశ్మీర్లో ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది,  దేనికోసం?  కాశ్మీర్లో వేర్పాటువాదులకు ఉగ్రవాదులకు ప్రత్యక్ష సహకారం అందించేందుకు మరియు  అప్పటివరకూ ఉన్నా ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీరు నేషనలిస్ట్  కాంగ్రెస్  పార్టీ నీ అణగద్రొక్కేందుకు  ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ప్రారంభించారు.  ఫరూక్ అబ్దుల్లా తెరవెనుక ఒక వైఖరి తెరముందు మరో వైఖిరితో  రాజకీయాలు నడిపాడు అందుకే  ఆయన పార్టీకి జెండాగా ఎరుపు రంగు ఎంచుకున్నాడు, అదే  కొత్తగా ప్రారంభమైన పీడీపీ  బహిరంగంగానే వేర్పాటు వాదులకు ఉగ్రవాదులకు పాకిస్థాన్ కు  సానుకూలంగా ఉండటం ప్రారంభించింది అందుకు  వ్యూహాత్మకంగా అది ఆకుపచ్చ  రంగు  జెండాను స్వీకరించింది,  ఆ పార్టీ ఎన్నికల గుర్తు గా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ యొక్క పెన్ అండ్ ఇంకు బాటిల్ ఎంచుకుంది. వ్యూహాత్మకంగా భద్రతా దళాలపై,  మానవ హక్కుల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేది.  2002లో జరిగిన కాశ్మీర్ ఎన్నికలలో ఆ పార్టీ 16 స్థానాలు గెలుచుకుంది. అదే సమయంలో ఫరూక్ అబ్దుల్లా పార్టీ 28 స్థానాలు గెలుచుకుంది మొత్తం స్థానాలు 87.  ఆ సమయంలో  కాంగ్రెస్ పార్టీ పీడీపీ తో  కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది.  2002లో గుజరాత్ లో అక్షరధామ్ ఆలయం పై దాడి చేసిన ఉగ్రవాదులు కుల్గామ్ లోని అబ్దుల్ అజీజ్ ఇంటిలో తలదాచుకున్నట్లు అదుపులోకి తీసుకొన్నవాళ్ళు  చెప్పారు.  ఆ వార్త  పెద్ద దుమారం అయింది.  దానికి అబ్దుల్ అజీజ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ అంగీకరించక కొనసాగించాడు.  2009 నుంచి 2014 వరకు ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.   2015 లో బిజెపి మద్దతుతో  పీడీపీ  సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ ఏర్పడింది.   పీడీపీ  ఉగ్రవాదం తీవ్రవాదం వైపు మొగ్గుచూపటంతో పాటు మసారత్ ఆలం ను జైలు నుండి విడుదల చేయటం వివాదాస్పదమైంది,  దానితో బిజెపి మద్దతు ఉపసంహరించుకుంది,  ప్రభుత్వం పడిపోయింది. 


   2019 సంవత్సరంలో జమ్ము శ్రీనగర్ హైవే పైన సి ఆర్ పి ఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది జవాన్లు బలి అయినారు దానితో కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది కాశ్మీర్ గురించి ఆలోచించే విధానంలో పూర్తి మార్పు తీసుకుని వచ్చింది,  ఉగ్రవాదులను పూర్తిగా ఏరి  వేయటం ప్రారంభించింది. ఇంతకు పూర్వం యుద్ధం ఉగ్రవాదులు ప్రారంభించే వాళ్లు, 2019 నుండి  భద్రతాదళాల ఉగ్రవాదులను వెతకటం ప్రారంభించింది.  ఉగ్ర వాదులను అదుపులోకి  తీసుకోవటం లేకపోతే కాల్పుల్లో వాళ్ళు  మరణించడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగడం ప్రారంభమైంది.  దానితో 1999 నుండి పాలిస్తున్న పాలకుల రాజకీయాలకు తెర పడటం కూడా ప్రారంభమైంది,  దీంతో రాజకీయ నాయకులకు వేర్పాటువాదులు ఉగ్రవాదులతో సంబంధాల తీగ కదలటం ప్రారంభమైనది ,  ఇది ఎంతో కీలక పరిణామము. దీనితో  కశ్మీర్లో శాంతి భద్రతలను కాపాడడానికి తగు నిర్ణయాలు  తీసుకునేందుకు ఒక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  దీనితో పాటు  పాకిస్థాన్ తో  వ్యవహరిస్తున్న  కఠిన వైఖరి సరిహద్దుల్లో తాత్కాలికంగా నైనా కాల్పుల విరమణకు అవకాశం ఏర్పడింది.  మొత్తం మీద కాశ్మీరును జాతీయ జీవన స్రవంతిలో పూర్తిగా కలిపేందుకు కావలసిన ప్రయత్నాలు వేగంగా  జరగటం అందరం స్వాగతించిన వలసిన విషయం.  

     దేశం ముందుసవాలు విసురుతున్న ఒక ప్రశ్నకు సమాధానం వెతకాలి   

     మొత్తానికి స్వతంత్రానంతర  కాశ్మీర్  చరిత్రను పైపైన చదివిన సమాధానం వెతక వలసిన ఒక ప్రశ్న దేశం ముందుకు వస్తుంది. ఈ ప్రశ్న కేవలం కాశ్మీర్ ను చూస్తేనే కాదు అధిక సంఖ్యలోముస్లిం లు  ఉన్న ప్రతిచోటా కొద్దో గొప్పో తేడాతో ఆ ప్రశ్న వస్తున్నది అదేమిటంటే మేము మెజారిటీ ఉన్న భూభాగం మాది అక్కడ మా ఇష్టానుసారమే జరగాలి లేకపోతె జిహాదే. ఇక్కడే 1940మార్చి 23న ముస్లిం లీగ్ లాహోర్ లో చేసిన తీర్మానం గుర్తు చేసుకోవాలి. ఆ  తీర్మానం  లో ''ముస్లిం జనాభా మెజారిటీ ఉన్న అన్ని చోట్ల ఇస్లాం రాజ్యాలు ఏర్పాటు చేయాలనీ'' పిలుపు నిచ్చారు. దీని అర్ధం ఈ దేశంలో ప్రత్యేక ముస్లిం దేశాలు కావాలి. దానికోసం చేయవలసిన  పనులు చేయాలి. ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొని  పరిణామాలను విశ్లేషిస్తే  ''ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా సలహామేరకు నెహ్రు కాశ్మీర్ రాజు తో కాశ్మిర్ ను ఇండియన్ యూనియన్లో  విలీనం చేసినవెంటనే నీవు   కాశ్మీరును విడిచి వెళ్లిపోవాలని'' కండీషన్ పెట్టాడు.  దానిప్రకారం కాశ్మీర్ రాజు ముంబయి వెళ్ళిపోయాడు. దానితో  షేక్ అబ్దుల్లానే పాలనా చేపట్టాడు. కాశ్మీర్ పాకిస్తాన్ లో కలిపితే తన అధికారానికి ఎసరు వస్తుంది,  భారత్ లో పూర్తిగా కలిపితే ముస్లిం ఆధిపత్యం ఉండదు అందుకే మద్యేమార్గం గా ప్రత్యేక ప్రతిపత్తి కోరి సాధించుకొన్నాడు. అట్లా ముస్లిం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. అక్కడ జరుగుతున్నా వేర్పాటువాద, ఉగ్రవాద  కార్యకలాపాల సారాంశం కూడా  ఒకటే కాశ్మీర్ స్వతంత్రదేశంగా ఉండాలా,  లేక  పాకిస్తాన్ లో కలపాలా అంతేకాని  భారత్ లో ఉండే  ప్రశ్నే లేదు,  అక్కడి రాజకీయాలు కూడా దీనిచుట్టూనే తిరిగాయి. ఈ ఆలోచనలు విసురుతున్న సవాళ్లకు సమాధానాలు వెతకాలి, 370 ఆర్టికల్ 35ఏ రద్దు ఒకతాత్కాలిక చర్యమాత్రమే కాశ్మీర్ జాతీయజీవన స్రవంతిలో కలవాలంటే ఇంకా ఏదో చేయాలి దాని గురించి ఆలోచించాలి, దానితో మరన్ని స్వతంత్ర ఆలోచనలు తలెత్తకుండా నివారించవచ్చు దీనికోసం ప్రభుత్వమేకాదు దేశప్రజలందరూ ఆలోచించాలి.    

-- శ్రీ రాంపల్లి మల్లికార్జున్      





 









Tuesday, March 9, 2021

మరో వివేకానందుడు పూజనీయ శ్రీ గురూజీ

 మరో వివేకానందుడు పూజనీయ శ్రీ గురూజీ 


                                                    సూర్యుడు తన కిరణాలను ప్రసరించి  పద్మాలను వికసింపజేస్తాడు, చంద్రుడు తన వెన్నెల జల్లులను  కురిపించి కలువలను వికసింపజేస్తాడు, అడగడం అక్కర్లేకుండానే మేఘాలు జలాలను వర్షిస్తాయి,   మహా పురుషులు కూడా స్వయంగానే ప్రజాసేవకు తమని తాము అంకితం చేసుకుంటారు.


''   పద్మాకరం దినకరోవికచం కరోతి

చంద్రో వికాసయతికైరవ చక్రవాలం

నాభ్యర్ధితో జలధరోపి జలంవదాతి సంతః

స్వయం పరహితే విహితాభియోగం  ''


అని భర్తృహరి పై సుభాషితంలో చెప్పాడు.   అటువంటి మహాపురుషుల పరంపరలో జన్మించినవారు పూజ్య  శ్రీ గురూజీ.  సంఘర్షణ కాలంలో కొందరి గొప్ప తనం బయటపడుతుంది, శాంతి సమయంలో కొందరి శ్రేష్ఠత్వము వెలువడుతుంది,  అరి  భయంకరుడు లోకరంజకుడు  కూడా కావటం ఒకే వ్యక్తికి సర్వసాధారణంగా సాధ్యపడదు, అది శ్రీరాముడికే సాధ్యపడింది.   శ్రీరామచంద్రుడు ఎంతటి రణ కోవిదుడో  అంతటి ప్రజా పాలనా దక్షుడు.  అటువంటి అరుదైన మహాపురుషులలో పూజనీయ శ్రీ గురూజీ  కూడా ఒకరు.


శ్రీ గురూజీ గా ప్రసిద్ధి పొందిన మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ మాఘ బహుళ ఏకాదశి సోమవారం రోజున అంటే 1906 సంవత్సరం ఫిబ్రవరి 19న నాగపూర్ లో జన్మించారు.  వారి తండ్రి పేరు సదాశివరావు గోల్వాల్కర్ తల్లి పేరు లక్ష్మీ బాయి,  మాధవ్ బాల్యము నుండే అత్యంత ప్రతిభసామర్థ్యం  కలిగినవాడు.  1926 సంవత్సరంలో బీఎస్సీలో ఉత్తీర్ణులయ్యారు,  కాశీ విశ్వవిద్యాలయంలో 1928 సంవత్సరం ఎమ్మెస్సీలో సర్వ ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యాడు, 1930వ సంవత్సరంలో కాశీ విశ్వవిద్యాలయంలోని  విజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేశారు,  అక్కడ ఉన్నప్పుడే  ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నా గ్రంథాలయ మొత్తాన్ని ఔపోసన పట్టారు.   గురూజీ ఆధ్యాత్మిక సాధనలో కొంతకాలం సారగాచి  ఆశ్రమం లో గడిపారు.  ఆ  ఆశ్రమంలో వారికీ స్వామి అఖండానంద  సన్యాస దీక్ష ఇచ్చారు.  ఆ తదుపరి  అఖండానంద స్వామీజీ ఆదేశంతో గురూజీ  నాగపూర్ చేరుకున్నారు.   నాగపూర్ లో పరమ పూజనీయమైన డాక్టర్ జీ మార్గదర్శనంలో రాష్ట్రీయ స్వయంసేవక  సంఘంలో పని చేయటం ప్రారంభించాడు


    వివేకానంద శ్రీగురూజీ ల సారూప్యత                                      

స్వతంత్ర పోరాట సమయంలో స్వామి వివేకానందుడు  ఈ దేశాన్ని జాగృతం చేసేందుకు నేను హిందువునని గర్వించమని పిలుపు నిచ్చాడు, శ్రీ గురూజీ ఈ దేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు  కృషి చేశారు.  వివేకానందుడి ఆలోచనలు వారి  జీవితం,  శ్రీ గురూజీలో  కూడా కనపడుతుంది.  ఉదాహరణకు వివేకానందుడు తన జీవితంలో రెండు సార్లు భారతదేశ భ్రమణం  చేశాడు,  మొదటిసారి చికాగో మహాసభలకు వెళ్ళటానికి పూర్వం దేశమంతా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు తిరిగాడు,  ఆ సమయంలో దేశంలో ఉన్నసామాన్య  ప్రజల దుస్థితి చూసి  ఎంతో రోదించాడు,  చివరకు కన్యాకుమారిలో ఇప్పుడు వివేకానంద శిలా స్మారకం వున్నా శిలపైన మూడు రోజులు అంతర్ముఖుడై ఈ దేశం గురించి ఆలోచించారు.  చికాగో ఉపన్యాసాల తర్వాత కొలంబో నుండి ఆల్మురా   వరకు ఒక తుఫాను పర్యటన చేశారు.  దేశ స్వాతంత్ర పోరాటానికి జవజీవాలు కల్పించారు,  ఈ దేశం బాగుపడాలంటే వ్యక్తి  నిర్మాణమే మౌలికమైన పని అనివారు  భావించారు అందుకే "ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్రం లాంటి హృదయం కలిగిన వంద మంది యువకులు" నాకు దొరికితే ఈ దేశ భవిష్యత్తు మార్చేస్తానని చెప్పారు అట్లాగే రాబోవు 50సంవత్సరాలు మనము పూజించే దేవతలనందరిని ప్రక్కకు పెట్టి మన అందరి  తల్లియైన భారతమాతను ఆరాధించాలని పిలుపునిచ్చారు,  ఈ దేశం మళ్ళీ తిరిగి విశ్వ గురుత్వ స్థానానికి వెళ్లాలంటే ఆధ్యాత్మిక జ్ఞానమే మౌలిక మైనది అని కూడా  చెప్పారు. ఆ  జ్ఞానాన్ని అందించటానికి వివేకానందుడు రామకృష్ణమిషన్ ప్రారంభించారు  అట్లాగే పరమపూజ్య శ్రీ గురుజీ   దేశమంతటా నిరంతరం  పర్యటన చేశారు. శ్రీ గురూజీ  రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి 1940 నుండి 73 వరకు సర్ సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం షుమారుగా   రెండుసార్లు దేశమంతా  తిరుగుతూ ఉండేవారు,  వేలాది మంది  కార్యకర్తల నిర్మాణం చేశారు.  వందల సంవత్సరాలుగా చిన్నాభిన్నమైన సమాజాన్ని సంఘటితం చేసేందుకు ప్రయత్నం చేశారు,  దేశం యొక్క సమగ్రాభివృద్ధికి సమాజ జీవనంలోని అన్ని రంగాలలో వ్యవస్థలను  సంస్థలను నిర్మాణం చేశారు.  వివేకానందుడు కోరుకున్నట్లు ఈ దేశాన్ని ఒక ఆధ్యాత్మిక శక్తిగా మలిచేందుకు పూజ్య శ్రీ గురూజీ ఈ దేశంలోని మఠాధిపతులు,  పీఠాధిపతులను  సమాజాభిముఖం చేశారు.  ఈ దేశంలోని సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు వివేకానందుడు ఎంత పరితపించారో  శ్రీ గురూజీ కూడా  ఈ సమాజంలోని అంటరానితనం అనే సమస్యను క్రమంగా దూరం చేసేందుకు మన శాస్త్రాలలో అంటరాని తనం అనేది ఎక్కడా లేదు అని   పీఠాధిపతులు మఠాధిపతులతో ప్రయాగ లో జరిగిన సాధు సంతుల సమ్మేళనం లో   చెప్పించారు.  ఆ సమస్యలు దూరం చేసేందుకు సాధు సంతుల బాధ్యతలను వారికి గుర్తు చేశారు.  హిందూ సమాజంలో  ఆధ్యాత్మిక మహాపురుషులు పాత్ర చాలా కీలకమైనది.  అందుకే శ్రీ గురూజీ స్వయంగా ఆధ్యాత్మిక మహాపురుషుల సమన్వయం కోసం  విశ్వహిందూ పరిషత్ ప్రారంభించారు.


    నిరంతర భ్రమణంలో సమాజ స్థితిగతులను అర్థం చేసుకుని వాటికి పరిష్కార మార్గాలు మార్గదర్శనం చేశారు,  దేశ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకుని వెళ్ళటానికి గురూజీ ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కేంద్ర హోం శాఖ మంత్రితో  కొద్దిసేపు మాట్లాదేవారు.   అట్లా వివేకానందుడు శ్రీ గురూజీ ఇరువురు ఈ దేశం ఆధ్యాత్మిక జ్ఞానంతో విశ్వగురుత్వం సాధించాలని  స్పష్టంగా వ్యక్తం చేశారు.  వివేకానందుడు భారత మాత ఆరాధన చేయాలని చెప్పారు,  పూజ శ్రీ గురూజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ లో   నమస్తే సదా వత్సలే మాతృభూమే అనే ప్రార్థన,  చివరకు భారత్ మాతాకీ జై అనే మంత్రం శాఖలో స్వయం సేవకులు ప్రతిరోజూ చేసే వ్యవస్థను వికశింప చేశారు.  అట్లా వివేకానందుడు గురూజీ ఇరువురు  ఒకరి తర్వాత ఒకరు ఈ సమాజాన్ని తిరిగి విశ్వ గురువుగా నిర్మాణం చేయటానికి కావలసిన ప్రయత్నాలు, మార్గదర్శనం చేసిన మహా పురుషులు.


దేశం క్లిష్టసమయంలో గురూజీ మార్గదర్శనం


పరమపూజ్య శ్రీ గురుజీ  1940 నుండి 73 వరకు సర్ సంఘచాలక్ గా ఉన్నారు,  ఆ సమయంలో దేశవిభజనకు రంగం సిద్ధం అవుతున్నవేళ ,  దేశంలో అనేక సమస్యలు ఎదురవుతున్న సమయం,  దేశ స్వాతంత్రం చివరి ఘట్టంలో ఉన్న సమయం దేశానికీ స్వతంత్రం వచ్చింది కానీ దేశం ముక్కలయింది ఆ రోజులలో సంఘం దేశ  విభజనను ఆపలేకపోయింది కాని విభజన కారణంగా ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దగలిగింది.   అట్లా  దేశ విభజన,  సంఘంపై నిషేధం వంటి అత్యంత క్లిష్టమైన సమస్యలను ఎదుర్కోవడానికి గురూజీ  సరి అయిన నేతృత్వం వహించారు.  వారి నేతృత్వంలో స్వయం సేవకులు దేశ హితమే గీటురాయిగా అనేక కష్టనష్టాలను భరించి దేశం కోసం పని చేశారు .  భారతదేశం అన్ని విధాల అగ్రగామిగా వికసించేందుకు సమాజ జీవన రంగాలలో అవలంబించవలసిన విధానాలను గురించి వారు చేసిన మార్గదర్శనం చిరస్థాయిగా స్ఫూర్తి ప్రదంగా ఉంది.


దేశ సమస్యల పై గురూజీ దూరదృష్టి


పూజనీయ శ్రీ గురూజీ ఆ రోజులలోనే  చైనా విసురుతున్న సవాళ్లు గురించి చేసిన హెచ్చరికలను ఈ సమయంలో  ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం బాగుంటుంది. 1959 మే 18వ తేదీన గురూజీ చెప్పిన విషయాలు  పాంచజన్య పత్రికలో  వ్యాసంగా  ప్రచురించబడింది . అందులో వారు టిబెట్లో చైనా సాధించిన విజయానికి ఇక్కడ కమ్యూనిస్టులు వేడుకలు చేసుకుంటున్నారు  మన దేశంలో కూడా అలాంటి ముక్తి కావాలని కలలు కంటున్నారు అని అన్నారు .  వాళ్లు చరిత్ర నేర్పుతున్న గుణపాఠాలను విస్మరిస్తున్నారని,   కమ్యూనిస్టుల దేశద్రోహ  భూమికను  సంకేతీస్తున్నదని  చెప్పారు. చైనాలో  అణువణువునా అహంకారం స్వోత్కర్ష నిండి ఉన్నదని  చెప్పారు.  పురాతన కాలంలో తమ దేశం నెలకొల్పిన విశాల సామ్రాజ్యం ఆదర్శాన్ని చైనా ఇంకా మర్చిపోలేకపోతున్నదని చెప్పారు, ఇది చివరకు రష్యాకు కూడా ప్రమాదం అని కూడా చెప్పారు,  చైనా విస్తరణ వాదాన్ని త్రిప్పికొట్టడం  రష్యాకు కూడా క్షేమకరం   అని చెప్పారు.  చైనా 1954 నుండి లద్దాక్ పై కన్ను వేసి ఉంది అని హెచ్చరించారు.  భూటాన్ కూడా ఆక్రమించే ప్రయత్నం చేయవచ్చు,  నేపాల్ పై కూడా పట్టు సంపాదించవచ్చని చెప్పారు.  భారతదేశాన్ని ఏకాకిగా చేయటానికి చైనా బర్మాతో సంబంధాలు పెట్టుకుని పూర్తిగా తన అదుపులో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నది అని హెచ్చరించారు.  స్వాతంత్రం వచ్చిన దగ్గర్నుంచి మన ప్రభుత్వం మన సరిహద్దుల ఎడల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నది అందుకే ఈ పరిస్థితులు ఉన్నాయి అని చెప్పారు. అది ఈరోజకి   అక్షర సత్యం.  గురూజీ చైనాతో సంప్రదింపులు జరపాలంటే  మొదటి నిబంధన దురాక్రమణ నుండి చైనా దూరం జరగాలి అని చెప్పారు.  హిమాలయ పర్వతాలు దాటి చైనా మనదేశంలో మైదాన ప్రాంతం లోకి  ప్రవేశించడానికి ఎంతో సమయం అవసరం లేదు అని ఆ రోజునే గురూజీ  హెచ్చరించారు.మొన్నమొన్నటి లఢక్ ఆక్రమణకు చేసిన ప్రయత్నాలు దానికి భారత్ గట్టి సమాధానం చెప్పటం చూసాము దశాబ్దాలకు పూర్వమే గురూజీ హెచ్చరించారు.    ఈ పరిస్థితులలో  కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ పని చేస్తున్న తీరుమనం గమనించివుంటాం.   శ్రీ గురుజీ చెప్పిన పద్ధతిలో చైనాను  తన కట్టడిలో తాను ఉండే టట్లు  చెయ్యాలి.  ఆ దిశలో కేంద్ర  ప్రభుత్వం పనిచేస్తున్నది.  ఇట్లా శ్రీ గురూజీ దేశానికి సంబంధించిన మౌలిక సమస్యలను విశ్లేషించారు అవి ఈ రోజు కూడా అక్షర సత్యాలు అందుకే శ్రీ గురూజీనీ ఈ దేశం ఎంత చక్కగా అర్థంచేసుకొంటే  అంతే  త్వరగా ఈ దేశం ఈ దేశం గా ప్రపంచం లో నిలబడి ప్రపంచ శాంతిని సాధించే సాత్విక శక్తిగా నిలబడుతుంది.  ఆ దిశలో ప్రయత్నాలు చేయటమే మన అందరి కర్తవ్యం.

ముగింపు

గురూజీ లాంటి   మహాపురుషులు భారతదేశంలో అరుదుగా జన్మిస్తూ ఉంటారు, వారు  భర్తృహరి చెప్పినట్లు సమాజానికి తమను తాము అంకితం చేసుకుని  సమాజాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలబెడుతూ ఉంటారు.  అటువంటి  కోవకు చెందిన వారే శ్రీ గురూజీ,  వారు జన్మించి ఈ మాఘ బహుళ ఏకాదశి కి 115 సంవత్సరాలు పూర్తవుతున్నాయి,  ఈ సందర్భంగా వారి జీవనాన్ని మరొక్కసారి మనం  మననం చేసుకొని దేశ కార్యంలో  పునర్ అంకితం కావడమే మనం  వారికి సమర్పించే నిజమైన నివాళి.

 -శ్రీ రాంపల్లి మల్లికార్జున్


 


 


 


 


 


                                                                      


*మరణం లేని మహావీరులు*

*మరణం లేని మహావీరులు*          "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...