Monday, April 26, 2021

పంచ యజ్ఞాలతో పరమ వైభవం

పంచ యజ్ఞాలతో పరమ వైభవం

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?
 యజ్ఞం అనగానే వేదబ్రాహ్మణులు చేసేది అనుకుంటాం, అయితే ఈ పంచ మహా యజ్ఞాలు ఋత్విక్కులు చేసే యజ్ఞాలు కాదు. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు.  
అవి ఏమిటి?  – దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ(ఋషి) యజ్ఞాలు. 

1. దేవ యజ్ఞం

పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు.  వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు.  అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి రావి, మోదుగ, మొదలైన సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. కానీ, ఇదీ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. దానికి బదులుగా నిత్యం దేవుడికి పూజ చేసి ధూపహారతి, కర్పూర హారతి ఇవ్వడం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. ఇది దేవయజ్ఞం.  సృష్టికి మూల కారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం. 

2. పితృ యజ్ఞం

మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రులను ప్రేమగా చూడాలి.  చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి.  ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం.  ఇది పితృ యజ్ఞం. మరణించిన తాతముత్తాతలు, మన వంశీయులు.. మనకు పితృదేవతలు. సదా పూజ్యులు. తల్లిదండ్రులు మరణిస్తే వారు మరణించిన తిథిని గుర్తుపెట్టుకుని ఆ రోజున ఆబ్దికం పెట్టి, బంధుమిత్రాదులకు భోజనం పెట్టడం, నిత్యం పితృదేవతలకు తర్పణాలివ్వడం వల్ల వారు తృప్తిచెందుతారు. ఇది కూడా పితృయజ్ఞంలో భాగమే!

3. భూత యజ్ఞం

గృహస్తు సర్వప్రాణికోటిమీద  దయ కలిగి వుండాలి. పశుపక్షులు, క్రిమి కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి.  అందుకే మనిషికి భూత దయ వుండాలి.  అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే) ప్రదేశంలో పెట్టాలి.  ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి.  ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి.  క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు)  పక్కన పెట్టాలి.  (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు).  జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి.  సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.

4. మనుష్య యజ్ఞం

మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు.  అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు.  రోజులు మారినాయి.  అయినా ఇంటికొచ్చిన వారిని మన కులం వారా, మన మతం వారా మనకేవిషయంలోనైనా పనికి వస్తారా?లేదా? వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి.  తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి.  అందరితో సఖ్యంగా వుండాలి.  ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి. ఇదే మనుష్య యజ్ఞం.

5. బ్రహ్మ యజ్ఞం 

ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రాలని కానీ చదవాలి.  ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి.  ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి.  అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి.  బ్రహ్మయజ్ఞమంటే.. స్వాధ్యాయం. అంటే వేదాన్ని అద్యయనం చేయడం. కానీ, అది అందరికీసాధ్యమయ్యేది, అవకాశమున్నదీ కాదు. కనుక మహర్షులు మరొక అవకాశాన్నిచ్చారు. ‘వేదః ప్రాచేత సాదాసీత్‌ సాక్షాద్రామాయణాత్మనా’.. రామాయణం సాక్షాత్తూ వేదమే. భారతం పంచమవేదం. భాగవతం వేదమనే కల్పవృక్షం నుంచి జారిపడిన పండు. కనుక మనం రామాయణ, భారత, భాగవత, భగవద్గీతాదులను చదివినట్లయితే స్వాధ్యాయం చేసినట్లే. దీనివల్ల మన రుషులు తృప్తిపడతారు.

            ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం, శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి.  ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.  మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచయజ్ఞాలు సూచించబడ్డాయి!
           యింత వరకు మనం చూసిన ఐదు యజ్ఞాలు – దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత యజ్ఞాలు. అంటే – ప్రపంచం లోని – దాదాపు ప్రతి ప్రాణి పట్ల – మన కర్తవ్యం ఏమిటో చూసాము.
ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణులూ – వొకటిపై మరొకటి ఆధార పడి ఉన్నదన్న సత్యాన్ని – ఈ యజ్ఞాలు గుర్తు చేస్తాయి. పంచయజ్ఞాలంటే ఎంతో క్లిష్టతరమైనవని అనుకుంటాంగానీ.. ఇవన్నీ ఎంత సులభమైనవో చూశారు కదా! వీటిని మనందరం బాధ్యతగా నిర్వర్తించినట్లయితే మనకూ మన కుటుంబానికి, సమాజానికి శ్రేయస్సును ప్రసాదిస్తాయి.

- సాకి.

Friday, April 23, 2021

రసానందం!

*రసానందం!*

*పుస్తకం..*

*మనోనేత్రాన్ని తెరిపించే దివ్యశక్తి!*

*నిశీథిపొరల్లోంచి ఉషోదయాన్ని రగిలించే మహాశక్తి!!*

*జడపదార్థాలకు చలనం కలిగించే జ్ఞాన భానువు!*

*పాషండహృదయాల్ని* *మంచుముద్ద చేసే మాయాజాలం!*


*పదమై పదిలంగా మనసులలో* *నిక్షిప్తమయ్యే ప్రభావశీల!*

*వాక్యమై రసమై మున్ముందుకు* *నడిపించే పాథేయం!*

*అవును..*

*పేజీలు తిరగేస్తున్నప్పుడల్లా*

*అక్షరాలను స్పర్శిస్తున్నట్లు..*

*పలుకులమ్మ పాదాల అందియలను మీటి*

*జ్ఞాన నాదాన్ని పలికిస్తున్నట్లు..*

*రసభావనాతరంగిణిలో*

*అమృత బిందువుల ఘోష* *వినిపిస్తున్నట్లు..*

*అనిర్వచనీయానందం!*

*కట్టిపడేసే వాక్యం కనిపిస్తేచాలు*

*హృదయం ఆనందశివతాండవమే!*

*రమణీయ శిల్పం తొణికిసలాడిందా?*

*భావనా స్రోతస్వినిలో మనసు మునకలేసి*

*వజ్రవైఢూర్యాలను చేజిక్కించుకున్నట్లు!*

*కదిలించే ఒక్కచిత్రం..*

*వేవేల ఆలోచనలు రగిలించదా?!*

*కథల ఎడారుల్లో*

*పయనం సాగిస్తుంటే*

*ఆఖరిమలుపు ఆనందాల ఒయాసిస్సు!*

*పద్యమో గేయమో మరొకటో ఏదైతేనేం?*

*ప్రత్యక్షరాన్ని ఆస్వాదిస్తూ..*

*అనుభూతి చెందుతూ..*

*సమయాన్ని  కవిత్వంతో పెనవేసి,*

*ఆనంద రసమయం చేసుకోవడమే!*

*సాహిత్యంతో మమేకమైపోవడమే!*

*తాళపత్రాలనుండి తాకేతెరలకు చేరినా..*

*గుహల జీవనం నుండి గూగుల్లో శోధనచేసినా..*

*చేతిలో పుస్తకం పట్టుకోవడమంటే..*

*అజ్ఞానంపై సమరానికి సిద్ధమవడం!*

*తిమిర సంహరణం కోసం*

*సారస్వతజ్యోతిని వెలిగించడం!*

*సామాజిక చైతన్య పాశుపతాస్త్రం*

*జడత్వంపై  సంధించడమే!!*

*చరవాణిని కాసేపు పక్కనపెట్టి*

*'పుస్తకపాణి'నీయులమవుదాం!*

*కర'వాణీ'మయులమవుదాం!*

*ముఖంపై కాంతిపడడంకంటే*

*మనోఫలకంపై సమసిపోని* *జ్ఞానకాంతినద్దుదాం!*

*ఇంటికొచ్చిన అతిథికి*

*ఛాయ్ ఇవ్వడం కన్నా,*

*మనం చదివిన  మంచిపుస్తకాన్ని*

*పరిచయం చేసే మంచి అవకాశం* 

*మనమే తీసుకుందాం!*

*భావిభారత చైతన్యంకోసం*

*రేపటితరం మస్తిష్కంలో*

*నిప్పురాజేయడానికి,*

*పుస్తకాలగదిని చేరువచేద్దాం!!*

*మనం, మన మనమూ...*

*పుస్తకంతో తన్మయత్వం చెందుదాం!!*

   *-అవుసుల భానుప్రకాశ్*

      *9603204507*

Wednesday, April 14, 2021

అంబేద్కర్ అంతరంగాన్ని అర్ధం చేసుకుంటున్నామా!?!?

అంబేద్కర్ అంతరంగాన్ని అర్ధం చేసుకుంటున్నామా!?!?
       డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ యొక్క వ్యక్తిత్వానికి సమకాలీన దేశ రాజకీయాల్లో చాలా ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు అందరు అంబేద్కర్‌ గురించి మాట్లాడుతున్నారు. రకరకాల దృక్పధాల నుంచి రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. ఆయన మౌలిక ఆలోచనలను తమ అవసరాలకు అనుగుణంగా కుదించి, వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్‌ జీవితానికి, ఆలోచనలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? అసలు అంబేద్కర్ జీవితం, ఆలోచనలు ఏమిటి? అంబేద్కర్ చెప్పిన సూత్రాలు ఏమిటి? అంబేద్కర్ అంతరంగాన్ని ఆవిష్కరింపజేయటమే ఈ చిన్ని ప్రయత్నం. అంబేద్కర్‌ అణగారిన వర్గాల కోసం చేసిన కృషి ఎక్కువ భాగం స్వాతంత్య్రానికి పూర్వం జరిగింది.
     అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ లో సైనిక స్థావరమైన ‘మౌ’ ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మాలోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించాడు. నేటి మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లా వారి స్వస్థలం. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్య్రోద్యమ దళిత నాయకుడు. వృత్తి రీత్యా న్యాయవాది, ఆర్ధిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త. కులతత్వ నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి… ఆయన 1956 డిసెంబర్ 6న మరణించాడు.  ఆయన జీవించిన కాలంలో అనేక మంది ఆయన భావాలను పూర్తిగా తిరస్కరించారు. ఆయన కృషిని వ్యతిరేకించిన వారూ లేకపోలేదు. అయినా ఉన్నత వ్యక్తిత్వంతో, అఖండమైన దేశభక్తి తో అంతరానితనం అనే దురాచారం నుండి అట్టడుగు వర్గ ప్రజల్ని చైతన్య వంతులను చేయటానికే తన జీవిత సర్వస్వము అర్పించారు.
*అంబేద్కర్ ఉన్నత ఆలోచనలు*
        కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేరు, మీ బానిసత్వాన్ని మీరే పోగుట్టుకోవాలి. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు… ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు… పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి... ఇలా ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, దాన్ని సగౌరవంగా కాపాడుకోవడానికి ఇలాంటి అనేక ఉన్నత ఆలోచనల్ని డా॥ భీంరావ్ రాంజీ అంబేద్కర్ చెప్పారు. 

*అంబేద్కర్ అంతరంగమే అంబేద్కరిజం*

      అంబేద్కరిజాన్ని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని, అంతరంగాన్ని అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ సాధారణ వ్యక్తి వలె సంకుచితవాది కాదు, ఆయన విశాల మైన భావాలు కలవాడు. అంబేద్కర్ హింసను విశ్వసించలేదు, ఆయన ఉద్యమం అహింసాయుత మైనది. అంబేద్కర్ కరుణార్ద్ర హృదయుడు.ఒక గొప్ప సంస్కరణ శీలి. అంబేద్కర్ సంస్కరణల్లో అణచబడిన ప్రజలలో స్వాభిమానం, స్వావలంబన నిర్మించటం, సద్గుణాలని పెంపొందింపచేయడం, విద్య పై దృష్టి నిలిపేలా చేయడం ప్రధానమైన అంశాలు. దేశ సమగ్రత పట్ల దృఢమైన వైఖరి అంబేద్కర్ ప్రదర్శించేవారు. ఆయన నిష్కళంక దేశప్రేమికుడు. "మన దేశ ప్రజలలో మనమంతా ఒకే దేశానికి చెందిన వారమనే భావన కల్గజేయటం నేటి తక్షణ అవసరం.నేను మొదట భారతీయుడను అనుకోవడం కాదు, మొదటి నుండి చివరి వరకు నేను భారతీయుడిని అనే భావన ఆదర్శం అవ్వాలి" అని అంబేద్కర్ 1929లో ఒక నివేదికలో చెప్పారు. అంబేద్కర్ హిందూ సమాజంలోని దురాచారాల్ని దూరం చేయుటకు నడుంబిగించిన ప్రొటెస్టెంట్ హిందూ నాయకుడు అని చరిత్రకారులు చెప్తుంటారు. అహంకారంతో హిందుత్వానికి నష్టం తెస్తున్న సవర్ణుల్ని మాత్రమే ఆయన విమర్శించడం మనం గమనించాలి. హిందూ పునరుజ్జీవనానికి అంబేద్కర్ అందించిన స్వేచ్చా, సమానత్వం, సోదర భావం అను మూడు సూత్రాలు కూడా బౌద్ధం లోని ప్రజ్ఞ, కరుణ, సమత అనే మూడు అంశాల ఆధారంగా తీసుకున్నవి. సోదర భావం లేకుండా అసలు స్వేచ్ఛ, సమానత్వం సాధ్యం కావని రాజ్యాంగ సభలో ఆయన స్పష్టంగా చెప్పారు. అంబేద్కర్ భారతీయ సాంస్కృతిక వారసత్వ పరంపరకు వారసుడిగా నిలబడ్డారు. అంబేద్కర్ పెట్టిన పత్రికలకు, సంస్థలకు భారతీయ పేర్లను పెట్టడం...మతం మార్చుకునే సందర్భంలో సాంస్కృతిక ప్రవాహానికి సమీప బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం, ధర్మ చక్రం తో కూడిన జాతీయ పతాకాన్ని బలపరచడం, రాజ్యాంగ ప్రతి లో శ్రీరాముడు-శ్రీ కృష్ణుడు,శివాజీ... మొ,, లగు మహాపురుషుల చిత్రాలని ఏర్పరచటం...... ఇవన్నీ అంబేద్కర్ యొక్క సాంస్కృతిక జాతీయతకు నిదర్శనాలు. అంబేద్కర్ బలమైన ధార్మిక భావాలు కల వ్యక్తి, జ్ఞానవంతుడు, సహన శీలి..... ఇలా ఎన్నో సద్గుణాల కలగలిసిన మహోన్నత వ్యక్తిత్వాన్ని,అంతరంగాన్ని అర్థం చేసుకుంటే అంబేద్కర్ అర్థం అయినట్లే! 
        అంబేద్కరిజం పేరుతో నేడు దేశమంతటా రెండు రకాల ధోరణుల్ని పరిశీలించవచ్చు. పై విధమైన అంబేద్కర్ అంతరంగాన్ని అర్థం చేసుకొని కొనసాగుతున్న సామాజిక సమరసతా ఉద్యమం ఒకటి. కేవలం దళితులని అణచివేయబడ్డాము అనే అభద్రతలో ఉంచుతూ, కుల విభజనని స్పష్టంగా ఏర్పరుస్తున్న ఉద్యమం రెండవది. మొదటి ఉద్యమం ప్రకారం అంబేద్కర్ జాతీయ నాయకుడు, రెండవ ఉద్యమం ప్రకారం అంబేద్కర్ దళిత నాయకుడు మాత్రమే. అంబేద్కర్ ఉద్యమం ఎవరినీ ద్వేషించనిది. అదే అంబేద్కర్ పేరుతో జ్ఞాన సభను ఏర్పాటు చేసి ఇటీవల కాలంలో హిందూ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించిన ఉపాధ్యాయుడు అంబేద్కర్ అంతరంగాన్ని అర్ధం చేసుకున్నట్లేనా!? గతంలో పెద్ద కూర పండుగలు నిర్వహించినా..... స్వేచ్ఛ పేరుతో కిస్ అఫ్ లవ్ నిర్వహించినా...... యూనివర్సిటీ ల్లో తీవ్రవాదసంఘీభావ ర్యాలీ నిర్వహించినా...దేశాన్ని ముక్కలు చేస్తాం అని నినదించినా...... వారి వెనుక ఉన్న శక్తులన్నీ అంబేద్కర్ చిత్రాన్ని ముందు పెట్టుకున్న వారే, కానీ అంబేద్కర్ అంతరంగాన్ని అర్ధం చేసుకున్న వాళ్ళు కాదు. విచ్ఛిన్నకర,సామాజిక విద్వేషకర శక్తులను & సంస్థలను సమాజం కంట కనిపెడుతూ ఉండాల్సిందే. అంబేద్కర్ కోరుకున్న వివక్షరహిత,జ్ఞాన సంపన్న, వ్యసనముక్త, సమరసతా సమాజం నిర్మాణం కావాలి.అన్ని కులాల పట్ల సమభావంతో వ్యవహరించడమే సామాజిక సమరసత.మన ఇంటికి ఎవరు వచ్చినా తేడా చూపకుండా వ్యవహరించ కలిగే ఈ మానసిక స్థితి తయారవ్వాలి. సమరసత ను మన ఇంటి నుండి ప్రారంభించడమే అంబేద్కర్ కి నిజమైన నివాళి. ఆయన చూపిన మార్గంలో ఆయన ఆదర్శాలను విస్తృతపరిచే పనిలో ముందు నిలబడదాం.

- సాకి,

Tuesday, April 13, 2021

పిడి వాదుల నుండి దేశాన్ని కాపాడుకోవాలి

  పిడి వాదుల  నుండి దేశాన్ని కాపాడుకోవాలి                                 


130 సంవత్సరాల పూర్వం  జన్మించిన అంబేద్కర్ ను మనం ఎందుకు స్మరించుకోవాలి,  అంబేద్కర్ జీవితం మనకు ఏమినేర్పిస్తోంది ,  జీవితంలో అడుగడుగున అవమానాలు,  అవహేళన ఎదుర్కొంటూ కూడా  తన జీవితాన్ని ఎలా ఉన్నత శిఖరాలకు తీసుకోని వెళ్ళవచ్చో  అంబేద్కర్  జీవితం నుండి   నేర్చుకోవచ్చు.  అట్లాగే అవమానాలను అవహేళనలు  సహిస్తూ ఈ దేశం కోసం ఎలా జీవించవచ్చో దానికి  అంబేద్కర్ ఒక ఐకాన్.  ఈ దేశ చరిత్రలో నిత్య స్మరణీయుడు.   స్వాతంత్ర పోరాట కాలంలో దేశానికి స్వతంత్రం ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన అనేక సమావేశాలలో ఎట్లా స్పష్టంగా మాట్లాడాడో  మనం చూడవచ్చు.   అట్లాగే ఈ దేశం ఎదుర్కొంటున్న  దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో ఎలా  పని చేశాడో అర్థం చేసుకోవాలి, ఈ దేశం భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలపై ఎట్లా విస్పష్టంగా హెచ్చరించాడో  తెలుసుకోవచ్చు.  ఈ సమయంలో వారి జీవితానికి సంబంధించిన కొన్ని  విషయాలు జ్ఞాపకం  చేసుకోవటం ఎంతో  అవసరం.


     భారతదేశంలో  రాబోయే రోజుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ రాబోతున్నది,  దానిలో ఈ దేశంలో ఉండే ప్రజలను ఎలా  భాగస్వామ్యం చేయాలి అనే విషయాల గురించి    ఆలోచించాడు.  వేల సంవత్సరాల చరిత్రకలిగినదేశం,  ఎంతో గొప్ప సంస్కృతి ఉంది,  ఎంతో వైవిధ్యభరితమైనది ఈ దేశం.  ఈ దేశంలో అనేక భాషలు,   జీవన పద్ధతులు  సామాజిక వ్యవస్థలు,  ధార్మిక వ్యవస్థలు  మనకు కనబడుతుంటాయి. ఇంతటి వైవిధ్యభరితమైన దేశంలో సమస్యలకు కూడా కొదువ వుండదు.  వందల సంవత్సరాలుగా  అనేక సామాజిక సమస్యలతో సతమతమవుతూ ప్రయాణం చేస్తున్న దేశం. ఈ  విషయం మనందరికీ తెలుసు భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారానికి అందులో  ప్రజా స్వామ్య వ్యవస్థలో పరిష్కారానికి అనుసరించవలసిన విధానాలను రాజ్య వ్యవస్థ లోనే ఎట్లా ఉండాలో స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నవారు  అంబేద్కర్.   ఈ సందర్భంగా వారు సూచించిన రెండు విషయాలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవడం బాగుంటుంది.


  1] 1930 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో  దళితుల ప్రతినిధిగా మాట్లాడుతూ'' పాలనా వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం ఉండాలి,  భవిష్యత్ భారత దేశ పాలనా వ్యవస్థలో కూడా తగినంత ప్రాతినిధ్యం ఉండాలని'' వారు స్పష్టంగా పేర్కొన్నారు. 

 2] 1947 ఆగస్టు 29న ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ కు అంబేద్కర్ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.   వారి అధ్యక్షతన రూపుదిద్దుకున్న  రాజ్యాంగంలో మానవతా దృక్పథం తో  అంటరాని తనాన్ని నిర్మూలించేందుకు తీసుకోవలసిన చర్యలకు చట్టబద్దత కల్పించారు.   నిమ్నవర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కల్పించారు.  నిమ్నవర్గాల ప్రజల అన్ని రకాల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో చట్టబద్ధమైన హక్కులను కల్పించారు,  అట్లా సామాజికంగా రాజకీయంగా వారికీ  ఒక దిశానిర్దేశనం  రాజ్యాంగ బద్ధం చేసారు. 

  1950వ సంవత్సరం జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేసుకునే సమయంలో ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం కొన్ని అంశాలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం చాలా చాలా అవసరం.  వారి ప్రసంగంలో'' ఈ దేశం రాజకీయ స్వాతంత్రం సంపాదించుకుంది ఇంకా సంపాదించుకో వలసినది  సామాజిక ప్రజాస్వామ్యం,  సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఈ దేశ ప్రజలజీవన విధానం, అది ఎట్లా ఉండాలి? ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం నిర్మాణం కావాలి. అదే  ఈ దేశ ప్రజలను కలిపి ఉంచగలుగుతుంది. ఆ మూడు పరస్పరం పెనవేసుకున్న విషయాలు,  దేనికదిగా వాటిని విడివిడిగా మనం చూడలేము,  అందులో ఏఒక్కటి తొలగించిన ప్రజాస్వామ్య మనుగడ ఉండదు, 1]  సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది  2] స్వేచ్ఛలేని  సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది  3]సోదరభావం లేని స్వేచ్ఛా సమానత్వం సహజంగా ఉండలేవు,  సోదరభావం లేనిచోట స్వేచ్ఛ సమానత్వాన్ని  బలవంతంగా రుద్ది వలసిన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి దేశంలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చేయాలి,  అట్లా చేసేందుకు ఈ దేశంలో వందల సంవత్సరాల నుండి అనేక మంది వ్యక్తులు,  సంస్థలు పని చేసుకుంటూ వస్తూనే ఉన్నాయి, ఆ ప్రయత్నాల ప్రభావం సమాజంలో పరివర్తన దిశ మనకు కనబడుతోంది.   ఈ రోజుల్లో కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.   అందులో ప్రబలమైన సమస్య రాజకీయ ఆధిపత్యం. అధికారం కోసం  సమాజాన్ని చీల్చే  ప్రయత్నాలు అనేకం జరుగుతున్నాయి. ఒక ప్రక్క కులాలను మరిచిపోవాలని,  కులాల ఆధిపత్యం తొలగిపోవాలని  మాట్లాడుతూనే కులాలను గుర్తుచేస్తూ రెచ్చగొడుతున్నారు. దేశ ప్రజలలో అపోహలు అవిశ్వాసం,  సంఘర్షణలు నిర్మాణం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు.  నిజమైన సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించ వలసింది గ్రామాలలో,  గ్రామాలలో ఒకప్పుడు సామాజిక ప్రజాస్వామ్యం ఉండేది,   కానీ అది ఈ రోజు ఎంతగా ద్వంసమైందో  మనం అందరం చూస్తూనే ఉన్నాం,  గ్రామాలలో రాజకీయాల కారణంగా స్పర్ధలు, వైషమ్యాలు నిర్మాణం చేయటం ఈరోజు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.  సమస్యలు సృష్టించేందుకు,  వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు అంబేద్కర్ పేరును ఎట్లా ఉపయోగించుకుంటున్నారో కూడా మనం చూస్తున్నాము.   ఈ రోజున కమ్యూనిస్టులు, మావోయిస్టులు,   ఉదారవాదం ముసుగు ధరించిన  అనేక మంది మేధావులు, ఈ సమాజంలో ఒక బేధ  తంత్రాన్ని నడుపుతున్నారు  దానిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది .

   అంబేద్కర్   చేసిన కొన్ని హెచ్చరికలను ఈ సందర్భంగా  జ్ఞాపకం చేసుకోవాలి                     


 1] భారతదేశంలో కమ్యూనిజాన్ని మనం పెరగ నివ్వకూడదు  అని చెప్పారు.  కమ్యూనిస్టులు తమ రాజకీయ లాభాల కోసం కార్మికులను ఎట్లా ఎరగా  వాడుకుంటున్నారో  అంబేద్కర్ వివరించారు.   కమ్యూనిజాన్ని నిరోధించాలని గట్టిగా చెప్పారు.  ఈ విషయం మనకు దత్తోపంత్ జీ   అంబేద్కర్ గురించి వ్రాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా కనబడుతుంది,  అంబేద్కర్  దత్తోపంత్ జీ  తో'' కమ్యూనిజానికి దళితులకు మధ్య నేను ఒక ఇనుప గోడ గా నిలబడతాను,  మిగతా సమాజానికి కమ్యూనిజం కు మధ్య  మీరు ఇనుప గోడలాగా నిలబడాలని'' సూచించారు.  కమ్యూనిజం గురించి అంబేద్కర్ కు ఎంత స్పష్టత ఉందొ  మనకు అర్థమవుతుంది. 

2] ఈ దేశంలో పిడి వాదులను హెచ్చరించేందుకు తాను హిందూమతంలో కొనసాగ లేను అని స్పష్టంగా చెప్పారు. ఈ వార్త  దేశంలో అనేక ప్రకంపనాలను సృష్టించింది,  ముస్లిం,  క్రైస్తవులు మొదలైనవారు అంబెడ్కర్ ను  తమ మతం లోకి రావాలని ఆహ్వానించారు,  మతం మార  వద్దని అనేకమంది సంస్కరణ వాదులు కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు,  కానీ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బౌద్ధమతం హిందూ సమాజంలోని కుతర్క   వాదాలను సంస్కరించేందుకు ప్రారంభమైన ఒక సంస్కరణ సిద్ధాంతం,    అంటే  బౌద్ధం హిందూ సమాజంలో ఒక అంతర్భాగమని మనకు అర్థమవుతుంది. అంబెడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన దేశంలో సమానత్వం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు.   ఈ రకంగా బౌద్ధం స్వీకరించడానికి వాళ్ల కుటుంబ నేపథ్యాన్ని కూడామనం  అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.   అంబేద్కర్ తాత మాలోజీరావు  రామానంద భక్తిమార్గంలో దీక్ష తీసుకున్నారు,  తండ్రి రాంజీ కబీర్ భక్తిమార్గంలో దీక్ష తీసుకుంటే వారి పెదనాన్న సన్యాస దీక్ష తీసుకున్నారు,  ఆ కుటుంబ పరంపర అటువంటిది. 

 3 అంబేద్కర్ రచించిన ''థాట్స్ ఆన్ పాకిస్తాన్'' గ్రంథంలో ముస్లిం మనస్తత్వాన్ని ఎంతో చక్కగా విశ్లేషించారు.  ముస్లిములు భారత దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ద్వేషించటం కంటే ఈ దేశం బయట ఉండి వ్యతిరేకించటం ఎంతో మేలు అని చెప్పారు.  అందుకే  దేశ విభజన సమయంలో ఈ దేశంలో ఉన్న ముస్లిములనందరిని పాకిస్థాన్ కు పంపించి వేయాలని, విడిపోయిన భూభాగంలో ఉన్న హిందువులనందరిని  భారతదేశం తీసుకుని రావాలని చెప్పిన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్. అప్పటి నాయకుల అనాలోచిత వ్యవహారం ఈ దేశానికి ఎంతో నష్టం చేసింది లక్షల మంది సంహరించబడ్డారు కోటి మంది ప్రజల మార్పిడి జరిగింది,  ఇంతటి విధ్వంసాన్ని నిలువరించేందుకు ఎవరూ ఏమీ చేయలేకపోయారు,  అస్పష్టమైన ఆలోచనలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో విభజన చరిత్ర చెప్పే పాఠం,  దానికి ఇప్పటికే ఎంతో మూల్యం చెల్లించుకున్నాము,  ఇంకా చెల్లించుకొంటూనే ఉన్నాము. 

4]  ఈ దేశంలో ఉన్న అన్ని భాషల కు  మూలం సంస్కృతం.   వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని కలిపి ఉంచుతున్న భాష సంస్కృతం,  ఆ సంస్కృత భాషను మన జాతీయ భాషగా ప్రకటించాలని 1928లో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో స్పష్టం చేశారు. ఒకవేళ సంస్కృతభాషను జాతీయ భాషగా ప్రకటించి ఉన్నట్లయితే ఇవాళ దేశం ఎదుర్కొంటున్న భాషా  సమస్యలు ఇంత తీవ్రంగా ఉండక పోయేవి,  దానికి అప్పటి నాయకత్వం అంగీకరించని కారణంగా రాజ్యాంగంలో లేని ఇంగ్లీష్ భాష ఈ దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్నది,  రోజు రోజుకు ఆ భాష మీద విపరీతమైన వ్యామోహం ఈ దేశంలో పెరుగుతోంది,  దాని కారణంగా ఈ దేశ ప్రజలను సంస్కృతి సంప్రదాయాల నుండి దూరం చేస్తున్నది.  దూరదృష్టి లేని నాయకత్వం దేశాన్ని సమస్యల గందరగోళంలోకి నెట్టివేసింది,  దాని నుండి ఇంకా మనం బయట పడలేక పోతున్నాము 

                                                   ముగింపు

               మన హిందూ సమాజంలో కాలదోషం పట్టిన అనేక వాదనలు వివాదాలకు విద్వేషాలకు కారణ అవుతున్నాయి,  ఆ వివాదాలతో ఈ దేశాన్ని చీల్చేందుకు సమాజంలో విద్వేషాలు నిర్మాణం చేసేందుకు అనేక శక్తులు పనిచేస్తున్నాయి,  ఆ శక్తులు  కూడా నిమ్న వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాయి, దానికి వాళ్లకు ఒక ఐకాన్ గా  అంబేద్కర్  పేరు ను వాడుకొంటున్నారు.   అంబేద్కర్ వివిధ సందర్భాలలో అప్పటి అవసరాలకు మాట్లాడిన విషయాలకు వక్ర  భాష్యం చెబుతూ దళిత వర్గాలను రెచ్చగొడుతున్నారు, వాటిలో ఒకటి  అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన సమయంలో ఈ దేశంలోని దేవీ దేవతలను పూజించ వద్దని చెప్పాడని కొందరు ప్రచారం చేస్తున్నారు.  ఈ దేశ సమైక్యతకు నష్టం కలిగించే కమ్యూనిజం మొదలైన  సిద్ధాంతాలను అంబేద్కర్ చాలా స్పష్టంగా వ్యతిరేకించారు,  తీవ్రంగా హెచ్చరించారు,  ఆ సిద్ధాంతాల వాళ్లే  ఈరోజు దళితులను గందరగోళంలో పడేసేందుకు అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారు.  ఈ దేశంలో ముస్లింలు,  క్రైస్తవులు,  కమ్యూనిస్టులు, మావోయిస్టులు, ఉదారవాదులు  అనేకమంది దళితులను హిందూ సమాజం నుంచి వేరుచేసే  షడ  యంత్రం నడిపిస్తున్నారు.  ఆ శక్తుల వాదనలను పటాపంచలు చేయాలి.   ఈ దేశంలో జన్మించిన అంబేద్కర్ మొదలైన  అనేకమంది జాతీయ మహా పురుషులు ఆశించిన దేశ సమైక్యతను సాధించేందుకు  మనం ప్రతినబూన  వలసిన అవసరం ఎంతో ఉన్నది.  ఈ దిశలో ప్రయత్నం చేయడమే అంబేద్కర్ కు మనం సమర్పించే నిజమైన నివాళి అవుతుంది.  

-రాంపల్లి మల్లికార్జున్

     


Monday, April 12, 2021

విశిష్టమైనది భారతీయ కాలగణన

   విశిష్టమైనది భారతీయ కాలగణన


గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన, కాలం దైవ స్వరూపం,  కాలం అనంతమైనది,  ఈ సృష్టి అన్వేషణకు మూలం కాల గణన  మనదేశంలో కాల గణన ఎంతో శాస్త్రీయమైనది.  అసలు ఈ సృష్టి ప్రారంభమై ఇప్పటికీ నూట తొంభై అయిదు కోట్ల యాభైఎనిమిది లక్షల ఎనభైఐదువేల ఎనభైఒక్క సంవత్సరం[195,58,85,081]   అయినట్లు లెక్క తెలుస్తున్నది,  ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం చేప్పే లెక్క  కూడా  దాదాపుగా మన పంచాంగం చెప్పే లెక్కకు  దగ్గర ఉన్నది.  మన కాలగణనలో మన్వంతరము, యుగాలు,   సంవత్సరాలు,  మాసాలు, పక్షము,  రోజులు ఉంటాయి.  అందులో  14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ  మన్వంతరాల  క్రమంలో ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన  వైవస్వత  మన్వంతరం ఇప్పుడు  నడుస్తున్నది.  ఒక మన్వంతరము అంటే 71 మహా యుగాలు,  ఒక మహాయుగం అంటే నాలుగు యుగాల మొత్తం.   నాలుగు యుగాలు 1] కృతయుగము   2]త్రేతాయుగము 3]  ద్వాపరయుగము 4]  కలియుగం. ఒక యుగంలో నాలుగు పాదాలు ఉంటాయి.    మనము ఇప్పుడు వైవస్వత మన్వంతరం లోని  కలియుగంలో మొదటి పాదం లో  ఉన్నాం.  ఈ కలియుగం ప్రారంభమై  ఇప్పటికీ 5122 సంవత్సరాలు పూర్తి అయ్యి ఈ ఉగాదితో   5123 లోప్రవేశిస్తున్నాం.

మనకాలగణనలో   సంవత్సరాల ఆవర్తం ఉన్నది.    ఒక ఆవర్తము అంటే  60 సంవత్సరాలు.   ఆ 60 సంవత్సరాల  ఆవర్తంలో 34 వ సంవత్సరమైనా   శార్వరీ నామ సంవత్సరం పూర్తయి 35వ సంవత్సరమైన   ప్లవనామ సంవత్సరం లో ఈ ఉగాది తో   ప్రవేశిస్తున్నాము.  

     ఈ కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? ద్వాపర యుగ  అంతం లో జరిగిన మహాభారత సంగ్రామం తరువాత 36 సంవత్సరాలకు కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమైంది అని చెప్పటానికి  ప్రమాణం ఏంటి? కలి శకం గ్రహ గమనాల ఆధారంగా చెప్పారు. కలియుగం ప్రారంభంరోజు ఆకాశం లో ఏడు  గ్రహాలు  మేష రాశి లో ఉన్నాయి  ఆ ఏడుగ్రహాలలో 1] శని 2] గురువు 3]  కుజుడు 4]  సూర్యుడు 5]  శుక్రుడు 6] బుధుడు 7]  చంద్రుడు.  ఇప్పటి క్రీస్తుమానం  లెక్క ప్రకారం క్రీస్తు కు పూర్వం 3101 సంవత్సరం,  ఫిబ్రవరి 20వ తేదీ,  అర్ధరాత్రి 2 గంటల 27 నిమిషాల 30 సెకన్లకు ప్రారంభమైంది,  అంటే  3101 +2021=5122 సంవత్సరాలు పూర్తిఅయి  5123 వ  సంవత్సరంలో ప్రవేశిస్తున్నది.   కలియుగం ప్రారంభమైన రోజు  అర్ధరాత్రి శ్రీకృష్ణుని చే  నిర్మాణం చేయబడిన ద్వారకా పట్నం సముద్రంలో కలిసిపోయింది. అప్పటి నుండి  ద్వాపరయుగ అంతమయ్యి,  కలియుగం ప్రారంభమైంది.  అందుకే మన కాలగణన ఎంతో శాస్త్రీయమైనది.

        దేశ చరిత్రలోని కొన్ని తిరుగులేని విజయాలే శకాలు  

   దేశ చరిత్ర లోని కొన్ని తిరుగులేని విజయాలను మనవాళ్ళు శకాలుగా వర్ణించారు. అవి చాల ఉన్నాయి,   అందులో ప్రసిద్ధమైనవి 1]  యుధిష్ఠిర శకము 2]విక్రమార్క శకము 3]శాలివాహన శకము. ద్వాపర యుగ అంతం లో యుధిష్ఠిర శకము ప్రారంభమైతే కలియుగంలో విక్రమార్క శకము, శాలివాహన శకము గుర్తించారు .   భారతదేశానికి ఉత్తర భాగంలో విశేషంగా  విక్రమార్క శకం ప్రాచుర్యంలో ఉంటే   దక్షినాపథం లో  శాలివాహన శకము విశేషంగా ఉన్నది.    ఈ దేశ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనలో ధర్మ నిష్ఠ, పౌరుష పరాక్రమాలు, పెంపొందించుకోవడం ప్రధాన లక్ష్యంగా అవి మనకు కనబడతాయి. ఆ శకాల  గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

         యుధిష్ఠిర శకం       

        ద్వాపర యుగం అంతం లో జరిగిన  కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ధర్మరాజు సమ్రాట్ గ పట్టాభిషేకం జరిగిన రోజు నుండి ప్రారంభమైంది. అది కలియుగానికి పూర్వం 36 సంవత్సరం లో అంటే ఇప్పటికి [ 5123+36=5159]5158 సంవత్సరాలు పూర్తి అయి  5159వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నది.  కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు 36 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు.       యుధిష్టర శకం  మనకిచ్చే సందేశం ఏమిటి? ఎప్పుడైనా అంతిమ విజయం ధర్మానిదే, మహాభారత సంగ్రామం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటం ,  అది  ధర్మం జయించిన వేళ.  

         విక్రమార్క శకం  


  విక్రమార్క శకం కలియుగంలో 3044 సంవత్సరంలో ప్రారంభమైంది, అంటే 5123-3044=2079. 2078 సంవత్సరాలు పూర్తి 2079 లో ప్రవేశిస్తున్నది   దానిని బట్టి  క్రీస్తుకు పూర్వం 57లో విక్రమార్క శకం  ప్రారంభమైంది, క్రీస్తు లెక్క ప్రకారం 2021+57=2078 పూర్తి అయి 2079 లో ప్రవేశిస్తున్నది.     2078 సంవత్సరాల పూర్వం ఉన్న  విక్రమార్కుని కాలంలో భారతదేశం మీద శకులు దండయాత్రలు జరుగుతుండేవి,   చిన్న వయసులోనే విక్రమార్కుడు ఆ  దాడులను తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభం  చేశాడు.  ఐదు సంవత్సరాల వయసులో విక్రమార్కుడు అరణ్యంలోకి వెళ్లి 12 సంవత్సరాల పాటు సుదీర్ఘ సాధన చేసే అద్భుత శక్తులు సంపాదించాడు.  అతను మాళవ ప్రాంతంలోని ఉజ్జయని  ని రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు,   ఉజ్జయిని  మహాకాలుని దేవాలయం  ఉన్నది అది జ్యోతిర్లింగాలలో ఒకటి. విక్రమాదిత్యుడు శకులు, హుణులను జయించటానికి   భయంకరమైన యుద్ధాలు చేశాడు.  శకుల బాధ  మనకే కాదు   ఇప్పటి అరేబియా  బాబిలోనియా ,  పర్షియా,   దేశాల కు కూడా ఉండేది, ఆ దేశాల రాజుల పిలుపుపై    విక్రమార్కుడు అక్కడికి కూడా వెళ్లి అక్కడి నుండి శకులను తరిమివేసాడు  అందుకే ఆ అరబ్ దేశాల  ప్రజలు విక్రమాదిత్యుని తమకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించిన రాజుగా  కీర్తిస్తారు. అరేబియాలో  మహా దేవుని మందిరం నిర్మాణం చేశాడు.  అట్లాగే విక్రమార్కుడు అయోధ్య పట్టణంలో రాముడు జన్మించిన స్థలంగుర్తించి  అక్కడ భవ్యమైన రామమందిర నిర్మాణం చేశాడు.  ఈ విషయాలన్ని  కాళిదాసు రచించిన గ్రంథాలలో మనకు తెలుస్తాయి.  శకుల నుండి ఈ దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుని పేరుతో అప్పటి నుండి  విక్రమార్క శకం ప్రారంభమైంది  

         శాలివాహన శకం


శాలివాహన శకం ఇది కలియుగంలో  3179 లో ప్రారంభమైంది. అంటే [5122-3179=1943] ఇప్పడు  1943 లో ప్రవేశించింది.  క్రీస్తు లెక్కప్రకారం క్రీస్తుశకం 78 లో శాలివాహన శకం ప్రారంభమైనది,  అంటే [2021-78=1943]  1943 లో    ప్రవేశిస్తుంది.   శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనవడు.  శాలివాహనుడు శకులను, చీనులను, తార్తారులను, బాహ్లికులను, కామరూపాదేశీయులగు కిరాతాది మ్లేచ్చులను రోమనులను, శట్లైన  ఖోరాసదేశస్తులను జయించి వారుదోచుకొనిపోయిన ధనరాశులను తిరిగి స్వాధీనం చేసుకొని వారిని దండించాడు. సింధునదికి తూర్పునగల భారత దేశమును ఆర్యస్థానమని సింధునదికి పశ్చిమాన గల దేశమును మ్లేచ్ఛ దేశమని హద్దులు ఏర్పరచి దిగ్విజయ విజయం సాధించిన  వేళానుండి శాలివాహన శకం ప్రారంభమైనది. శాలివాహన శకం  విక్రమశకం  తరువాత 135 సంవత్సరాలకు ప్రారంభమైనది.   శాలివాహనుడు  ఈ దేశంలో  మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుని ఒకే ఛత్రం  కింద ఈ దేశాన్ని పాలించినవాడు.  ఈ విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది.  ఆయన కాలంలో ఈ దేశంపై దాడి చేసిన విదేశీయులను సంపూర్ణంగా నాశనం చేసి భారతదేశాన్ని  శక్తివంతం చేశాడు.

  ఇటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకునేందుకు యుధిష్టర ,  విక్రమార్క , శాలివాహన శకాలు  ఏర్పడ్డాయి. అవి  ఇప్పుడు మనకు  ఇచ్చే సందేశం ఏమిటంటే 1000 సంవత్సరాల  భావ దాస్యాన్ని వదిలించుకుని హిందుత్వ జాగరణతో జాతీయ  పునరుజ్జీవనం తో స్వాభిమానంతో ఈ దేశం ప్రపంచంలో నిలబడి,  ప్రపంచానికి శాంతిబాటలు  వేసే మరో కొత్త శకం ప్రారంభించు కోవాలని పిలుపు నిస్తున్నది .  ఈ ప్లవ నామ సంవత్సరం అందరికీ అటువంటి ప్రేరణ ఇవ్వాలని కోరుకొంటూ అందరికి ఉగాది శుభాకాంక్షల తో ... 

రాంపల్లి మల్లికార్జున్

   

                                          


*మరణం లేని మహావీరులు*

*మరణం లేని మహావీరులు*          "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...