......... విలక్షణ నేతృత్వ శిఖరం అటల్జీ.....
ప్రకృతి ప్రేమికుడిగా, భావుకుడిగా, కవిగా, అసమాన్య సాహితీవేత్తగా , వ్యవహారిక మితవాదిగా, సైద్ధాంతిక అతి వాదిగా అన్నింటికీ మించి కరుడుగట్టిన దేశభక్తుడిగా, అనర్గళ ఉపన్యాసకుడిగా అటల్జీ దేశ ప్రజలకు సన్నిహిత సుపరిచితుడు. సహజంగా రాజకీయ పార్టీలకు పార్టీ అధ్యక్షుడు.. ఆయా పార్టీల నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వ అధినేత లు నేతృత్వం వహిస్తారు. అయితే అందుకు భిన్నంగా భారతీయ జనతా పార్టీకి మాత్రమే మార్గదర్శక మండలి నాయకుడి హోదాలో సుప్రీంగా వ్యవహరించడం కేవలం అటల్ బిహారీ వాజపేయి కి చెల్లింది. అటల్జీని పార్టీ కార్యకర్తలు, జాతీయవాద సంస్థలు, ముఖ్యంగా ప్రజలు మనసా, వాచ , కర్మణ త్రికరణశుద్ధిగా సుప్రీంగానే భావించడం విశేషం. రాజకీయ ప్రస్థానంలో భారత ప్రజాస్వామ్య చరిత్రలో అనేక కీలక మలుపులు ఎత్తుపల్లాలను ఆయన చవిచూశారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా సామాజిక రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అటల్జీ స్వాతంత్రానంతరం మూడు దశలుగా రాజకీయ పార్టీ వ్యవహారాలకు నాయకత్వం వహించి చివరకు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచ గల స్థాయి, సామర్థ్యం ఉన్న రాజకీయ పార్టీగా జనసంఘ్, బిజెపి సర్వహంగుల వ్యవస్థాపక నాయకత్వం ఆయనది. తొలితరం జనసంఘ్ కార్యకర్తగా పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో వారసత్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయ నాంది పలికారు. డాక్టర్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ లకు తలలో నాలుకల వ్యవహరించిన అటల్జీ అనతికాలంలోనే వందకోట్ల మంది భారతీయులకు ఆత్మీయుడిగా మారారు. అందుకు ఆయన ఆచరించిన సైద్ధాంతిక మార్గం, పునాదులు, గమ్యం, సహచర్యం అటువంటిది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్, ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ గోల్వల్కర్ , పండిట్ దీన్ దయాల్ మార్గదర్శనంలో బైరాన్ షెకావత్, ఎల్.కె.అద్వాని, సహచర్యంలో అవిశ్రాంత రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. వాజపేయ్ మొదటి దశ భారతీయ జనసంఘ్ కాలంలో పార్లమెంటేరియన్ గా దూరదృష్టితో విశాల దృక్పథం కలిగిన జాతీయ నాయకుడిగా అనుభవం గడించారు. రెండవ దశ విలీన జనతాదళ్ ప్రభుత్వంలో చేరి రాజకీయ పార్టీలో అంతిమ లక్ష్యం అధికారం చేపట్టడం ద్వారా పాలనతో ప్రజలతో మమేకం కావాలన్న తీరును పార్టీ నాయకత్వానికి కార్యకర్త గణానికి తన ప్రయోగం ద్వారా అధికారం రుచి చూపించారు. మరొక దశ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి దేశం మొత్తం విస్తరించేలా చేసి అత్యధిక స్థానాలు పొందిన బీజేపీ అటల్జీ తన నాయకత్వంలో విజయవంతంగా సంకీర్ణ పక్షాల భాగస్వామ్యంతో అధికారం చేపట్టడంలో విజయం సాధించారు. దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తమ ఊపిరిగా కొనసాగుతున్న భారతీయ జనసంఘ్ ను రద్దుచేసి జనతా పార్టీలో కొనసాగారు. తమతో సైద్ధాంతిక వైరుద్యం ఉన్న సోషలిస్టులు కమ్యూనిస్టులతో బంధాన్ని సాగించారు. పొమ్మనలేక పొగ పెట్టిన మాదిరిగా కుట్రతో ద్వంద్వ సభ్యత్వ వివాదాన్ని సృష్టించడంతో విధిలేక జనతా పార్టీ వదలి తమ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ సహచర మిత్రులతో వ్యవస్థాపక అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీని ఆవిర్భవించారు. పాలు నీళ్లలా కలసి అంతుచిక్కని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తూ అటు కాంగ్రెస్ పార్టీ ఇటు సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు, మరోవైపు అప్పుడప్పుడే పురుడుపోసుకుంటున్న ప్రాంతీయ పార్టీలు 1975 నుండి 2014 వరకుఅధికారాన్ని సాగించాయి. అయితే వారందరి అంతిమ లక్ష్యం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, భారతీయ జనసంఘ్ మూలాలున్న నాయకుల చేతుల్లోకి అధికారాన్ని వెళ్ళకుండా చేయడమే. బిజేపియేతర పార్టీల, పక్షాల లక్ష్యాలను ఎమర్జెన్సీ అనంతరం ఏదో ఒక రూపంలో వ్యూహాత్మకంగా పై చేయి సాధిస్తూ అధికారంలో జనతా పార్టీ విలీన భాగస్వామిగా, నేషనల్ ఫ్రంట్ లో బయట నుంచి మద్దతుదారుగా, ఎన్డీఏ నేతృత్వ భాగస్వామిగా కొనసాగేలా చేసి తన నాయకత్వ పటిమతో భారతీయ జనతా పార్టీని అధికారం వైపు నడిపించారు అటల్జీ. ప్రతిపక్షనేతగా, ప్రభుత్వాధినేతగా దేశహితం కోసం అనేక విప్లవాత్మకమైన సరైన నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా పేరుగాంచి తాను నాయకత్వం వహిస్తున్న పార్టీ పట్ల ప్రజల్లో విస్త్రుతమైన విశ్వసనీయత సాధించగలిగారు. ఆ విశ్వసనీయత ఆధారంగానే మితవాదగా, అజాతశత్రువుగా మన్ననలు పొందుతూనే దేశవ్యాప్తంగా సర్వ స్పర్శి , సర్వవ్యాపి గా అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు బిజెపి పార్టీని కమలం గుర్తు తీసుకెళ్లగలిగారు. అందుకు అనుసరించిన రాజ ధర్మం సంకీర్ణ ధర్మం , సైద్ధాంతిక, దేశభక్తి నిబద్ధత ప్రజలను విశేషంగా ఆకర్షించి ఆయనను అనుసరించేలా ఆరాధించేలా చేసాయి. జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి లో చేసిన ప్రసంగం, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రధాని పీవీ నరసింహారావు ఎంపిక చేసిన భారత ప్రభుత్వ ప్రతినిధిగా జెనీవా మానవ హక్కుల సదస్సులో సల్మాన్ ఖుర్షీద్ తో ఆయన చేసిన పర్యటన పోఖ్రాన్ అనుపరిక్షల నిర్వహణ విశ్వాస పరీక్ష సమయంలో పార్లమెంటులో చేసిన ఆయన ప్రసంగం, కార్గిల్ యుధ్ధ విజయం మూస ధోరణిలో ఉన్న ఒక రాజకీయ నాయకుడి అవతారంగా కాకుండా విశాల దృక్పథం ఉన్న పరిణతి గల నాయకుడిగా అటల్జీ దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. పోక్రాన్ పరీక్ష సమయంలో బాహుబలి విధించే దిశగా ప్రపంచంలో దేశాలు పాకిస్తాన్ కు అనుకూలంగా హెచ్చరిస్తే 15 నిమిషాల సమయంలో ప్రపంచ చిత్ర పటం నుండి పాకిస్తాన్ కనుమరుగు చేస్తామని హెచ్చరించిన దీశాలైన కరుడుగట్టిన దేశభక్తుడు అటల్ జీ. ఓవైపు తన వ్యక్తిత్వానికి వస్తున్న ఆదరాభిమానాలను మరోవైపు తన పార్టీకి మల్లెల చాకచక్యంగా వ్యవహరిస్తూ తను నమ్మిన సిద్ధాంతాన్ని విస్తృత పరచగలిగారు అటల్జీ. కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుడిగానే కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అటల్జీకే చెల్లింది. అంటరాని పార్టీగా ముద్రపడిన బిజెపి అందరికీ ఆమోదయోగ్యమైన పార్టీగా, కేవలం ఉత్తరాది హిందీ రాష్ట్రాలపార్టీగా ఉన్న పార్టీలు ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో సైతం అధికారంలోకి రాగలిగిన పార్టీగా బిజెపి అవతరించడంలో అటల్ బిహారీ వాజపేయి పాత్ర ప్రతి మైలురాయి లో ప్రముఖంగా కనిపిస్తుంది. స్వాతంత్రానికి పూర్వం భారతదేశపు దాస్యశృంఖలాలను పెంచేందుకు పోరాడిన మహనీయుల సరసన భారతజాతి పునర్వైభవానికి అంకితమై ఆజన్మాంత బ్రహ్మచారిగా సైద్ధాంతిక పునాదులతో జీవితాన్ని సాగించిన అటల్ బిహారీ వాజపేయి నిలబడ్డారు. ఇవన్నీ ఆయన విద్యార్థి దశలో, యవ్వనంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అందించిన పునాదులే అని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ అధినేత గురూజీ గోల్వల్కర్, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ మార్గదర్శనంలో సామాజిక రంగంలో విశేష అనుభవం పొందిన సహచర గణంతో అటల్జీ ఓ రకంగా విశ్వ నాయకుడిగా ఎదిగాడని ఆయన జీవితం నిరూపిస్తుంది. తాను ఆచరించిన సైద్ధాంతిక కార్య పద్ధతిలో కొత్త తరాన్ని నాయకత్వాన్ని పార్టీకి దేశానికి అందించిన ఘనత అటల్జీదే. 2005 సంవత్సరం తర్వాత రాజకీయాలనుండి శాశ్వతంగా తప్పుకుంటున్నానని ప్రకటించిన వాజపేయి తాను అవకాశమిచ్చి నాయకుడిని చేసిన నరేంద్ర మోడీని ప్రజలు ఆదరించేలా గుజరాత్ ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. అదే నేడు బీజేపీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు బాటలు వేశాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు, సంతుష్టీకరణ వచ్చినా అవకాశవాద రాజకీయాలకు కాలం చెల్లెలా చేశారు. అది కేవలం దేశహితం కోసం ఆయన చేసిన ప్రయత్నాలుగా ప్రజలు భావించి విశ్వసించారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవ దర్శనం సిద్ధాంతం ఆధారంగా ఐదేళ్ళపాటు మూడుసార్లు పాలించి సాంస్కృతిక ఆర్థిక జాతీయవాదాన్ని అమలుపరిచి సంక్షేమ ఫలాలను అభివృద్ధిని విశాల దృక్పథంతో అందించారు. అదే సమయంలో సంకీర్ణ ధర్మాన్ని విస్మరించకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కొనసాగించారు. ప్రధానిగా అధికారంలో ఉండగా రాష్ట్రపతి ఎంపిక ఎన్నిక విషయంలో అందివచ్చిన అవకాశాన్ని అటల్ బిహారీ వాజపేయి క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎంపికచేసి సగటు భారతీయుల హృదయాన్ని రెండింతలు గెలిచారు. దీంతో అటల్ బిహారీ వ్యక్తిత్వం శిఖరస్థాయికి చేరింది. మూడు దశాబ్దాల సంకీర్ణ ప్రభుత్వాల లో అవినీతికి ఆస్కారం లేని పాలనాకాలం అటల్జీ నేతృత్వం వహించిన ప్రభుత్వ కాలమే కావచ్చు. బహుశా అటల్ బిహారీ వ్యక్తిత్వం మీద విశ్వాసంతో గౌరవంతో ఆయన ప్రభుత్వంలోని సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు తమ స్వలాభ పనుల కోసం ఒత్తిడి చేసి ఉండకపోవచ్చు.కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ దశాబ్దపు పాలనలో జరిగిన అవినీతి పదేళ్లపాటు మచ్చలేని వాజపేయ్ జీవితంపై ప్రజల మస్తిష్కంలో చర్చ జరిగింది. ఓ రకంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని సుస్థిర బిజెపి ప్రభుత్వానికి బాటలు వేసింది అటల్ బిహారీ వాజపేయి అవినీతిరహిత, పారదర్శక సుపరిపాలన ప్రధాన కారణం. అటల్జీ ప్రథమ వర్ధంతి లోపే సంపూర్ణ మెజారిటీ తో మళ్లీ అధికారం చేజిక్కించుకున్న బిజెపి అటల్ జీ చిరకాల స్వప్నమైన జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేసింది. అంతేకాకుండా భవ్యమైన రామమందిర నిర్మాణం ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి తెచ్చే రోజులు దగ్గరలో ఉన్నట్టు జాతీయవాద సంస్థల కార్యకర్తలు ప్రగాఢంగా నమ్ముతున్నారు ఇదంతా విశ్వాసంతో సాగిన అటల్జీ వ్యక్తిగత చరిష్మా మాదిరిగానే కొనసాగుతున్న భాజాపా నాయకత్వంతో సాధ్యమవుతుందని బిజెపి కార్యకర్తలు విశ్వాసం. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు, అవినీతి లేని పారదర్శక సుపరిపాలన పట్ల ప్రజలలో విశ్వాసం, ఆదరణ రోజురోజుకూ పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రతి పథకం నేరుగా ప్రజలు వ్యక్తిగతంగా లబ్ది పొందేలా చర్యలు చేపట్టారు.ఇదంతా దృడ నిర్ణయాలు తిసుకోగలిగిన బిజేపి నాయకత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఇదంతా అటల్జీ నిర్మించిన బాటగా ప్రజలు భావిస్తున్నారు. విశాల ప్రజాస్వామ్య దేశంలో సుదీర్ఘ సామాజిక రాజకీయ ప్రస్థానం సాగించిన అటల్ బిహారీ వాజపేయి ఆయన జీవితంలో ఆచరించిన నైతిక విలువలు, రాజనీతిజ్ఞత, సైద్ధాంతిక కట్టుబాటు, విశాల దేశహిత దృక్పథం నేటి తరానికి సదా ఆచరణీయం కావాలి . తమ మరణానంతరం గంగా నదిలో కలిపే అస్థికలు సైతం భారత్ మాతాకీ జై అంటుందన్న ఆ భావుకుడి కవితాగానాలను నిరంతరం మననం చేసుకోవాలి. ఒప్పుకోనూ పరాజయం.... కొత్త దారి నా ద్యేయం... కాలం తలరాతను చెరిపేస్త... సరికొత్త గీతాన్ని పడేస్తా... ; అంటూ ఆచరిస్తూ.... సదా స్మరణలో.....
-- కొట్టె మురళీకృష్ణ
( డిసెంబర్ 25 న మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి పురస్కరించుకొని సుపరిపాలన దినోత్సవం సందర్భంగా)