Friday, July 31, 2020
లక్ష్మీదేవి సందేశం
పగతో పంతం నెగ్గించుకున్న షహీద్ ఉద్దామ్ సింగ్
Thursday, July 30, 2020
సామాజిక సమరసతకు సనాతన మార్గాన్ని చూపిన ఋషి కావ్యకంఠ గణపతి ముని
శ్రీ కావ్యకంఠ గణపతి ముని
కావ్యకంఠ గణపతి ముని గురించి, వారి రచనల గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే. అయినా ప్రస్తుతం సమాజంలో వారి పేరు విన్నవారే కొద్దిమంది.
భరత వర్షం, ఆర్ష భూమి. యుగాలుగ లోకకల్యాణ నిరతులు, తపశ్శక్తి సంపన్నులైన ఋషుల దేశకాల పాత్రమైన, దేశకాలాతీతమైన జ్ఞానం, తపస్సు, కర్మలతో పునీతమైన భూమి ఇది. వారిని అనుసరించే సమాజం నిర్మించుకున్న నాగరికత ఇది.
గత శతాబ్దం భరతజాతి సుదీర్ఘ దాస్యం నుండి విముక్తమైనది. ఆ విముక్తికి కొన్ని దశాబ్దాల ముందు నుండి, దాస్యం వల్ల సమాజంలో వచ్చిన రుగ్మతలు తొలగించి చైతన్యవంతం చేయడం ద్వారా మరల పూర్వ వైభవం, ఔన్నత్యం సాధించే దిశలో నడిపించటానికీ కొందరు ఋషులు అవతరించారు. అరవిందులు, గణపతి ముని, కంచి పరమాచార్యులు, రమణులు మొదలైనవారు అలాంటి మహానుభావులు.
గణపతి ముని బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుశాస్త్ర పారంగతులు, తపో నిరతులు. లోక కల్యాణ నిరతి, తపస్సు, పాండిత్యం వంటి అనేక లక్షణాలు గణపతి ముని జీవితంలో చూడవచ్చు. సాధారణంగా వ్యక్తికి ఒక విషయంలో అధ్యయనం చేత, అభ్యాసం చేత రాణింపు కలుగుతుంది. మహా తపస్సిద్ధులకు అలాకాక వారి దృష్టి ఎటు సారిస్తే అటు లోకోపకారకమైన వెలుగు వస్తుంది. గణపతి ముని లౌకిక, ఆలౌకిక మైన అనేక విషయాలపై లొకానికి మార్గదర్శకమైన రచనలు చేశారు.
గణపతి ముని దృష్టి, రచనలు
తన జీవితాన్ని తపస్సుకి, సమాజొద్ధరణ కి వెచ్చించి, జాతి ఉద్ధరణకు అవసరమైన దాదాపు అన్ని విషయాలపై మార్గదర్శనం చేసారు గణపతి ముని. ఆయన రచనలు నేటి సమాజ పరిస్థితులకు ఎంతో అవసరమైనప్పటికీ అవి చాలా మందికి తెలియకపోవటానికి ఒక ప్రధాన కారణం వారు సంస్కృతంలొ వ్రాయటమే. దురదృష్ట వశాత్తూ ఇప్పటి వరకు వాటిని అనువదించే పని జరుగలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వాలు సంసృత పాండిత్యాన్ని, శాస్త్ర జ్ఞానాన్నీ చిన్న చూపు చూడటం కూడా మరొక కారణం.
రాష్ట్రం, శాస్త్రం, ధర్మం, ఉపాసన, సమాజ శ్రేయస్సు వంటి అనేక విషయాలలో గణపతి ముని అనుభవపూర్వక జ్ఞానం ఆయన రచనలలో కనిపిస్తుంది.
గణపతి ముని స్వయంగా చేసినవేకాక ఆయన స్ఫూర్తితో శిష్యులు చేసిన లోకోపకారకమైన రచనలు అనేకం ఉన్నాయి. వీటిలో వేద సూక్త శైలిని అనుసరించి కూర్చిన దైవరాతుని ఛందోదర్శనం చెప్పుకోదగినది.
గణపతి ముని రచనలలో అతి ముఖ్యమైన విషయాలు చెప్పాలన్నా అది ఒక గ్రంథం అవుతుంది. అందువల్ల వారి దర్శనపు ముఖ్యాంశాలను మాత్రం చూద్దాం.
నితంతర జపధ్యాన సమాధులవల్ల అనేక దేవతల అనుగ్రహానికి పాత్రులైన గణపతి ముని, దేవతా తత్వాన్ని, విద్యలను అందరికి తెలియజెప్పేందుకు స్తోత్ర, సూత్ర రూపంలో ఉంచారు. వీటిలో వారి భక్తి, జ్ఞానాలతో పాటు వారి దేశ ప్రేమ, లోకోద్ధరణ కాంక్ష కనిపిస్తాయి. ప్రధానంగా శక్తి ఉపాసకులైన గణపతి ముని శక్తి తత్వాన్ని అనేక స్తోత్ర, సూత్ర గ్రంథాలలో కీర్తించినా, అనేక దేవతా తత్వ చర్చ, వివరణ కూడా చేసారు. వేదం అపౌరుషేయమని కొన్ని ఆస్తిక దర్శనాలు చెప్తాయి. అయితే వేదం పౌరుషేయమా, అపౌరుషేయమా అన్న చర్చలో గణపతి ముని తనదైన ప్రమాణసహితమైన వాదన చేసారు. వేదంలోని ప్రధాన దేవతలైన ఐన ఇంద్రుడికి, రుద్రుడికి తేడాలేదని, వారిద్దరూ ఒక్కటేనని ఇంద్రేశ్వరాభేద సూత్రాలలో చూపించారు.
సామాజిక సంస్కరణ
బ్రిటిషువారు చేసిన అనేక దుర్మార్గాలలో ఒకటి సమాజాన్ని కుల ప్రాతిపదికన చీల్చటం. జాతి మొత్తం అణచివేతకు గురైనప్పుడు కొందరు ఎక్కువగా, మరికొందరు అంతకంటే కాస్త తక్కువ నష్టపోతారు. ఇలా ఎక్కువ నష్టపోయినవారు, పీడితుల కష్టాలకు కారణం తక్కువగా నష్టపోయినవారు, పీడితులేననే తప్పుడు అభిప్రాయాన్ని పుట్టించి, ఆంగ్ల విద్యా విధానంతో ఆ భావాన్ని బాగా ప్రచారం చేసారు. అలా తమ అణచివేత మూలంగా సమాజంలో కలిగిన పతనావస్థకు తాము కాకుండా ఇక్కడి సంస్కృతీ సభ్యతలు, వాటిని నిష్టగా అనుసరించాలనుకున్నవారే కారణమని చూపించడానికి ప్రయత్నించారు. ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవటానికి అనేకమంది అనేక మార్గాల్లో ప్రయత్నించారు. సమాజంలొ ఉన్న దురాచారాలు రూపుమాపాలి అనే దృష్టి తో సంఘ సంస్కర్తలు అనేకులు పని చేసారు, కొంత ఫలితం కూడా సాధించారు. కాని సంస్కర్తలలో చాలామంది సమాజాన్ని విదెశీయుల దృష్టితో చూసి అర్ధం చేసుకోవడం వల్ల వారి ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదు.
సమాజాన్ని ధర్మ దృష్టి తో చూసి, దానిలో రావలసిన మార్పును సంప్రదాయం, తపస్సు, జ్ఞానం ద్వారా తెచ్చిన అతి కొద్ది మహానుభావులలో ఒకరు గణపతి ముని.
అస్పృశ్యత నిర్మూలించటానికి, షెడ్యుల్ కులాలు, తెగలకు చెందినవారిని (వీరిని పంచములు అనేవారు) తిరిగి వర్ణ వ్యవస్థ శ్రేణి లోకి ఐక్యం చేయడానికి, వారి వెనుకబాటు తనాన్ని తొలగించడానికి గణపతి ముని కొన్ని సూచనలు చేయడమేకాక అందుకు స్వయంగా ప్రయత్నించారు. మంత్ర దీక్షల ద్వారా, బోధల ద్వారా, ఈ వర్గాలకు చెందినవారి వెనుకబాటు తనాన్ని తొలగించడానికి కృషిచేసారు. ఈ పనిలో సమాజం నుంచి వచ్చిన వ్యతిరేకతను అధిగమిస్తూనే, సమాజాన్ని దుయ్యబట్టకుండా సకారాత్మకమైన ఉద్యమం చేపట్టారు. పంచమ మీమాంస, పంచజన చర్చ వంటి రచనలలో వారి దృక్పథం తెలుస్తుంది. ప్రకృతి త్రిగుణాత్మకము (సత్వ, రజో, తమో గుణములు కలది). త్రిగుణాధారంగా ఏర్పడినందువల్ల సమాజంలో నాలుగు వర్ణములు ఉండడమే సరైన వ్యవష్ట అని, షెడ్యుల్ కులాలు, తెగలు మధ్యలో ఏర్పడినవి కనుక ఆయా వర్గాలను ప్రధానమైన నాలుగు వర్ణాలలో విలీనం చేయడమే సరైన పరిష్కారమని గణపతి ముని రచనలు, కార్యం ద్వారా మనకు తెలుస్తుంది. అలా కాక వెనుకబాటుతనాన్ని ఒక ప్రత్యేకత లక్షణం, గుర్తింపుగా చేసి సమాజంపై సంస్కరణ అనే దండయాత్ర చేయటం ఎంత నష్టదాయకమో ఈరోజు చూడవచ్చు.
సమాజం లో అనేక వర్గాల ఐక్యత, సమరసత అనాదిగా సంప్రదాయాల వల్లనే సాధ్యమయింది. వేదం జ్ఞానమే అనేక రూపాలలో అన్ని సామాన్య, అసామాన్య జనులలో, వర్గాలలో కనిపిస్తుంది. మహావిద్యా సూత్రాలలో గణపతి ముని శాక్త విద్యల(శక్తి ఉపాసన) తత్వాన్ని బొధిస్తూ, వేదంలో, ఉపనిషద్విద్యలలో, తంత్రంలో, గ్రామ దేవతలలో ఉన్న ఐక్యతను చూపించారు. శాక్తం లోని చిన్నమస్త దేవతే , గ్రామ దేవత అయిన రేణుక అని ఆయన చూపించారు. ఆ విధంగా గ్రామీణ, స్థానిక దేవతలు, పుజాపద్దతులు వేద సంప్రదాయం నుంచి, దానికి కొనసాగింపుగా వచ్చినవేనని గణపతి ముని నిరూపించారు. తద్వారా ఈ దేశంలో సనాతనంగా కొనసాగుతున్న సాంస్కృతిక ఏకత్వాన్ని మనకు గుర్తుచేశారు. హైందవ ధర్మమే మన దేశ సమగ్రతకు మూలమని అనేక మంది నాయకులు చెప్పినా, గణపతి ముని ఆ ఐక్యతను జన మానసంలో తీసుకురావటానికి సులభమైన మార్గాలు చూపించారు.
(గణపతి ముని రచనలను తెలుసుకోదలుచుకున్నవారు అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం ప్రచురించిన గణపతి ముని సంపూర్ణ గ్రంధావళిని సంప్రదించవచ్చును)
– ఖండవల్లి శంకర భరద్వాజ
సౌజన్యం :- విశ్వ సంవాద కేంద్రం, తెలంగాణ
Wednesday, July 29, 2020
ఇంకెన్నాళ్లు భారత్ పై కుట్రలు???
Monday, July 27, 2020
చాపకింద నీరులా సాంస్కృతిక విధ్వంసం
Saturday, July 25, 2020
విజయ్ దివస్ - కార్గిల్ యుద్ధానికి ఇరవై ఒక్క సంవత్సరాలు
కార్గిల్ విజయ వీరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం*
Friday, July 24, 2020
వేదం - నాసదీయ సూక్తం
Wednesday, July 22, 2020
దేశం గర్వించదగ్గ విప్లవవీరుడు ఆజాద్
జాతీయోద్యమ నాయకుడు - బాలగంగాధర తిలక్
బాలగంగాధర్ తిలక్
స్వాతంత్ర ఉద్యమంలో చాలామంది నాయకులు మనకు కనిపిస్తారు. అందులో సాంస్కృతిక పునాదిపై స్వాతంత్రం సిద్ధించాలని, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన వారు బాలగంగాధర్ తిలక్.
తిలక్ 1856 జూలై 23వ తేదీన బొంబాయి రాష్ట్రంలో రత్నగిరిలో జన్మించాడు. అతని తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ తల్లి పార్వతీ బాయి. బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. గణిత శాస్త్రంలో చక్కని ప్రతిభ చూపేవాడు. చిన్ననాటినుంచే ఎక్కడ అన్యాయం జరిగినా సహించని తనం, నిజాయితీ అతనికి సహజంగా ఉండేవి.
తన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ సంస్కృత ఉపాధ్యాయుడు. తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు రత్నగిరి నుంచి పూణేకు బదిలీ అయింది. పూనే కు వచ్చిన తరువాత చిన్నతనంలోనే తన తల్లిని , 16వ ఏట తన తండ్రిని కూడా కోల్పోయాడు. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే పదేళ్ల అమ్మాయితో పెళ్లయింది. అయినా చదువును ఆపకుండా గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు తర్వాత చదువు కొనసాగించి ఎల్.ఎల్.బి పట్టా కూడా పొందాడు. కళాశాలకు వెళ్లి ఆధునిక విద్యను అభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో తిలక్ ఒకరు. ఆంగ్ల విద్యా ప్రభావంతో భారతీయులు అనుభవిస్తున్న బానిసత్వం గురించి తెలుసుకున్న వర్గంలో కూడా తిలక్ అగ్రగణ్యులు. ఇంగ్లీష్ విద్య చదివినప్పటికీ ఆయన బ్రిటిష్ పాలకులకు పనిచేస్తున్న బానిస వర్గాల్లో ఒకడిగా మిగల్లేదు. పాశ్చాత్య విద్యా విధానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరిచి భారతీయ విద్యార్థులను చిన్న బుచ్చె విధంగా ఉంది. ప్రజలకు మంచి విద్యను అందించటం ద్వారానే ,వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్ద వచ్చు. ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతి గురించి భారతదేశం గురించి బోధించాలి అని పిలుపునిచ్చాడు.
భారతీయ యువతకు నాణ్యమైన విద్యను అందించడం, జాతీయ భావాలు పెంపొందించడమే ద్యేయంగా దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ నీ గోపాల్ గణేష్ అగార్కర్, మహదేవ్ బల్లాల్ నామ్ జోషి మరియు విష్ణు శాస్త్రి చిపుంకర్ కలిసి ఏర్పాటు చేశారు.
అప్పట్లో స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంస్థ భారత జాతీయ కాంగ్రెస్. స్వేచ్ఛ , స్వాభిమానం నిండుగా ఉన్న తిలక్ ను కూడా భారత జాతీయ కాంగ్రెస్ ఆకర్షించింది. 1890లో జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. ఆ సమయంలో కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని , విధానాలను వ్యతిరేకించకుండా విన్నపాలు , వినతుల ద్వారా సమస్యలను పరిష్కరించు కోవాలనేది అప్పటి నాయకులు ఉద్దేశం. కానీ తిలక్ గారికి ఈ మితవాదుల ధోరణి అస్సలు నచ్చేది కాదు. ఈ సంస్థలో ఉన్న సభ్యుల పట్ల చాలా గౌరవం ఉన్న మితవాద పద్ధతిని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించేవారు. మీరు సంవత్సరానికి ఒకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల్ల బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు అని అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునే వాళ్ళ సంఘం (beggers association) అన్నాడు . కాంగ్రెస్ సమావేశాలు త్రీ డేస్ తమాషా అని అభివర్ణించారు. "స్వరాజ్యం నా జన్మ హక్కు" దాన్ని నేను సాధించి తీరుతాను అని గర్జించాడు.
బ్రిటిష్ వారి మీద మితవాదులు పెట్టుకున్న నమ్మకం ఒట్టి భ్రమ అన్నది మొదటి నుంచి తిలక్ వాదన. బెంగాల్ విభజన తో ఈ విషయం రుజువైంది బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో లాలాలజపతిరాయ్ బిపిన్ చంద్ర పాల్ తో కలిసి ముఖ్యమైన పాత్ర పోషించారు. మత ప్రాతిపదికన బెంగాల్ ను1905లో విభజించారు. లాల్ పాల్ తో పాటు చిత్తరంజన్ దాస్ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం జాతీయ స్థాయి కి తీసుక వెళ్లడానికి నాలుగు సూత్రాలను ముందుకు తెచ్చారు అవి స్వరాజ్ ,జాతీయ విద్య, స్వదేశీ, మరియు విదేశీ వస్తు బహిష్కరణ అని రాశారు వీటితోనే ఉద్యమం భారతీయులందరికీ చేరుకోగలదని నమ్మారు. ఆచరణలో ఇది రుజువయింది. తిలక్ గారు మన జాతి ఒక చెట్టు అయితే కాండం స్వరాజ్యం, కొమ్మలు స్వదేశీ, విదేశీ బహిష్కరణ విధానాలు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ విచలితం కాకుండా దృఢంగా నిలిచి వాటిని అధిగమించాలి అనే వారు. చివరికి బెంగాల్ విభజన రద్దు చేయబడింది.
బానిసలుగా ఉన్న భారతీయ మేల్కొలపడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా తెలపడానికి మరాఠా అనే ఆంగ్ల పత్రిక, కేసరి అని మరాఠా పత్రికలను స్థాపించారు. బాల్యవివాహాలను నిరసించాడు. వితంతు వివాహాలు జరిపించాడు. తన పత్రికల్లో ప్రజలను మేల్కొలిపే రాతలు రాసినందుకు 1897లో అతనికి ఒకటిన్నర ఏళ్ల కారాగార శిక్ష పడింది.
భారతీయులలో జాతీయ , సాంస్కృతిక స్ఫూర్తిని నింపడానికి ఏ ఒక్క ఆకాశాన్ని వదులుకోలేదు. జాతీయ కాంగ్రెస్ లో పని చేస్తున్నప్పటికీ, మితవాదులు వ్యతిరేకించిన్నప్పటికీ ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు . 1893లో గణేష్ చతుర్థి సామూహిక ఉత్సవంగా నిర్వహించే సంప్రదాయాన్ని బొంబాయిలో తీసుకువచ్చారు. అదే తరువాత దేశ వ్యాప్తమైంది. 1895లో శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించారు రాయగడ్ కోటలోని శివాజీ సమాధి శిథిలావస్థకు చేరడంతో దాన్ని పునరుద్ధరించేందుకు పెద్ద ఉద్యమం నిర్వహించారు. ఈ ఉద్యమాలే భారతీయులలో తమ సంస్కృతి , వారసత్వంపై స్వాభిమానం రేకెత్తించాయి.
తమ మనుగడకే ముప్పు తెస్తున్న తిలక్ ను ఎలాగైనా అడ్డుకోవాలని ఉద్దేశంతో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం, కింగ్స్ ఫోర్డ్ పై దాడి చేసిన ప్రపుల్లచాకి, ఖుదిరామ్ బోస్ అనే యువకులను తిలక్ కేసరి పత్రికలో శ్లాఘించారు. పైగా స్వరాజ్యం వెంటనే ఇవ్వాలని కోరారు. దీంతో జులై 3,1908 న దేశద్రోహం నేరం ఆరోపించి తిలక్ ను అరెస్ట్ చేసి ఆరేళ్ల కారాగార శిక్ష విధించి మాండలే జైలుకు పంపారు. అక్కడే గీతా రహస్యం అనే పుస్తకాన్ని రచించారు. విడుదల తర్వాత మళ్లీ 1916లో హోంరూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ భారతదేశంలో గ్రామగ్రామాన తిరిగాడు. స్వరాజ్యం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు ప్రయత్నించారు. అంతిమ క్షణాలు లెక్కిస్తున్న తిలక్ ను రక్షించేందుకు ప్రముఖ వైద్యులు అంతా శ్రమించే సమయంలో కూడా తిలక్ అన్న మాట ఒక్కటే, స్వరాజ్యాన్ని సాధించలేకపోతే భారత దేశానికి భవిష్యత్తు లేదని.
ప్రస్తుత సమయంలో కూడా తిలక్ గారు ప్రవచించిన స్వేచ్ఛ, స్వాభిమానం, స్వదేశీ మరియు విదేశీ వస్తు బహిష్కరణ తక్షణ అనుసరణీయలు. నేటి సమాజంలో మన చరిత్ర , సంస్కృతి మరియు ప్రాచీన విద్య పట్ల స్వాభిమానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన సంపదనంతా దోచుక పోతూ మన పక్కలో బల్లెంగా మారి మన సరిహద్దులను మార్చే మరియు మత మార్పిడి ప్రోత్సహించే దేశాలకు బుద్ధి చెప్పాలంటే తిలక్ గారు ప్రవచించిన స్వదేశీ మరియు విదేశీ వస్తు బహిష్కరణ విధానాన్ని ఎప్పటికీ పాటించాలి.
-కొంగరి సాయికృష్ణ
జగిత్యాల్ 9494360350
Tuesday, July 21, 2020
సామాజిక సమరసతా ఎలా?
Saturday, July 18, 2020
ఆంగ్లపాలనపై తిరగబడ్డ తొలియోధుడు మంగళ్ పాండే
Friday, July 17, 2020
ఏదీ - ఎలా? [మనదేశం గురించి తెలుసుకోవడమంటే యావత్ ప్రపంచం గురించి తెలుసుకోవటమే.]
ఏదీ - ఎలా ?
మనదేశం గురించి తెలుసుకోవడమంటే యావత్ ప్రపంచం గురించి తెలుసుకోవటమే.
విశ్వవిజ్ఞానాన్ని ఆపోశన పెట్టడమే. వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అన్నారు. వ్యాసుడు చెప్పని విషయమనేది ప్రపంచంలో లేదు అనే మాట కూడా ఉంది. దురదృష్టవశాత్తు ' ఇంటి చెట్టు మందుకు పనికి రాదు' అనే రీతి తయారైంది మనది. మనగూర్చి తెలుసుకొనే ఓపిక, సమయం మనకు లేకపాయే. మనకు పక్కింటి వ్వవహారాసక్తి ఎక్కువ! మనమంటే ఏంటో చూపుకొనే సత్తా ఉంది. కానీ స్తబ్దపు తెరలో ఉంటున్నాం! ఆత్మన్యూనతా భావాగ్రస్థులమైనాం! బానిస మనస్తత్త్వంతో కూనారిల్లుతున్నాం ? అదీ మన ప్రారబ్దకర్మేనా?
'ఒక వృక్షం వేల కొలది ఏళ్ళ నుండి జీవిస్తున్నది. పది మందికి నీడనిస్తున్నది. వేల తరాలకు పూలను, కాయలను పండ్లను అందిస్తున్నది.' అంటే దాని వేర్లు ఎంత బలంగా ఉండి ఉంటాయో చెప్పనవసరం లేదు. ఆవృక్షాన్ని తరతరాలుగా రక్షించుకుంటున్న ఆ యజమానింట బోన్సాయ్ బ్రతుకువాడు ప్రవేశిస్తే ఏం జరుగుతుందో సులభగ్రాహ్యమే కదా! ఇదే మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు అక్షరానువర్తితం.
పుండైన వేలుకే దెబ్బ తగిలి నట్లు తుర్కీ'పుండు' కు ఆంగ్లేయ రాయి దెబ్బ తగిలింది. అమ్మా!ఎంత అవస్థో! అన్నాం. ''పుండు మగ్గిందే'' అని అందరూ అన్నారు. కానీ పుండున్న దేహం మాత్రం తన బాధను మింగాలేక కక్కాలేక పోతున్నది. బానిస రక్తం ఆపుండు సమూల నాశనానికి వైద్యాన్ని చేరనీయదుగా?
మన గూర్చి మనం తెలుసుకోవాలనే మనసుంటే మార్గం ఉంటుంది. మనం ఎలా ఉండాలో తెలియ జెప్పిన సూత్రాలూ ఉన్నాయి. అవి అందరికీ అత్యావశ్యకం. ఏ కర్మ(ఖర్మ) ఫలమో! మన గ్రంధాలకు, ఆధారాలకు అనుచిత భాష్యాలు అందించింది మన వారే ! అలా మనలను విపరీతపుటాలోచనల్లోకి నెట్టిందీ మన వారే! డోలాయసముద్రములో ముంచుతున్నదీ మన మనోబానిస ఆత్మీయులే!
వేదాలకు,ఇతిహాసాలకు, పురాణాలకు, వక్రభాష్యాలందించారు. ఆచార వ్యవహారాల, సంస్కృతి సంప్రదాయాల వెన్నెముకలను విరుస్తున్నారు. వీటికి కారణాలనూ ఉటంకిస్తారు. చరిత్ర ఆధారం అని కొందరు! సామాజిక ఆధారం అని మరికొందరు! మూలాధారాలని ఇంకొందరు! మిగిలిన వారందరూ నోరు మూసుకోవలసిందే అని తందనాల వారందరూ! ఇలా మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు గండి కొడుతూ, అలా మేం గొప్ప వాళ్ళమని చప్పట్లు కొట్టించుకుంటారు.
వివాదాలను పరిష్కరించుకోవాలి. అంటే వాక్ శుద్ధి అవసరం. మనం అరోగత్వంతో ఉండాలంటే రక్తశుద్ధి అవశ్యం. ఆ రక్తశుద్ధి కి కావలసిన మందులన్నీ పైన తెలుపుకున్న పుస్తకాల్లోనే ఉన్నాయి. ఆ భావామృతపానంలో గోచరిస్తాయి. భారతమాతకు మనం జై కొట్టడం కాదు, యావత్ ప్రపంచం విశ్వమాతకు వందనం అంటుంది. దానికి కావాల్సింది ఏంటో మనందరికి తెలిసిందే. మనకు ఏది అనవరమో మన బానిస మానసీయులు దాన్నే చెపుతారు. ఏదో ఒక విషయం చూపుతారు. అదంతా లేదా ఆ గ్రంథమే వ్యర్థమని చెపుతారు. ఆమొత్తాన్ని కొట్టి పడేస్తారు. మనలో తప్పుడు భావనలకు పురుడు పోస్తారు. అలా మన భావనలన్నీ మరుగున పడిపోయేలా సైంధవకార్యాన్ని నిర్వర్తిస్తారు. ఆలాంటి అంశాల్లో కొన్ని స్పృశించే ప్రయత్నం చేద్దాం.
ధర్మ సూత్రాలు:
విశ్వమానవ జాతికి ఆదర్శ ప్రాయంగా ఉన్న సూత్రాలు మనవి. ప్రతీ విషయంలో కాలానుగతంగా మంచి - చెడులు పెనవేసుకొని ఉండటం సహజం. మంచిని స్వీకరించడమే భారతీయ ధర్మం. కానీ మనోబానిసత్వం మంచిని వదిలి చెడును పట్టుకొని వేలాడేలా చేస్తున్నది.
''వేదోౕఽధర్మమూలమ్''(ధర్మానికి మూలం వేదం) అని గౌతముడు ధర్మానికి మూలాధారం గూర్చి చెప్పాడు. చోదనా లక్షణోఽర్థోధర్మః. (నడిపించే లక్షణం కల అర్థంతో కూడినదే ధర్మం) అని జైమిని చెప్పాడు. వీటిని బట్టి మనిషి చేయదగిన విధులను బోధించేదే ధర్మం. ధర్మ సూత్రాలు ఆ పనినే చేస్తాయి.
ఒకరు వేసుకున్న బట్టలు, చెప్పులు వేరొకరు వేసుకోకూడదు. గోళ్ళను పళ్ళతో కొరికి తీయకూడదు. లౌకిక, శాస్త్ర సంబంధ విషయాల్లో మొండి వాదన వలదు. సరదాకైనా పాచికలాడరాదు. చేతులో చెప్పులు పట్టుకోకూడదు - తిరుగరాదు. కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి.
పై మాటల్లాంటి వాటిని చూస్తే ఆహా! చక్కని ధర్మశాస్త్రాలని అన్పించి తీరుతుంది. కానీ,మన వాళ్ళందించిన వాటిని ఇతరులు The old liquid in new Bottle గా అందిస్తున్నారు. అది మన బానిసబుద్ధి గమనించటం లేదు. ఆ మత్తులో తెలియాడుతాం. ఇంటిల్లిపాదిపై అరుస్తాం. కరుస్తాం! ఈ బుద్ధి మనసు(షుల)లను వదులదా? ఎలా అయితే వదులుతుంది? మరి వేచి చూడాల్సిందేనా!? నడుం కట్టాల్సిందేనా?
కుటుంబ వ్యవస్థ:
భారతీయ ఔన్నత్యకిరీటంలో తళ తళా మెరిసే వజ్రం పెళ్లి - కుటుంబ వ్యవస్థ. ఎనిమిది రకాల పెళ్లిళ్లను మనవాళ్ళు ఏనాడో వర్గీకరించారు. అందులో బ్రాహ్మ్యము, దైవము, ఆర్షం, ప్రాజాపత్యం అనేవి ఉత్తమ వివాహాలని చెప్పారు. అసురము - డబ్బుకు ప్రలోభ పెట్టి చేసుకునే వివాహం. గాంధర్వం - కేవలం కామసంబంధం కోసమే చేసుకునే వివాహం. రాక్షసం - కన్య ఇష్టం మేరకు, పెద్దల పైకి తిరగబడి కన్యను తీసుకెళ్లి చేసుకునే వివాహం. పైశాచం - ఇష్టం లేకున్నా కన్యను బలాత్కారం చేసి చేసుకొనే వివాహం. ఇవి అధమ వివాహాలని చెప్పారు. ప్రస్తుతం సమాజం లోని కొంత మొదటి నాలుగింటిని వదిలేలా ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతోంది. 'సంస్కరణలు' అని వీటి ముద్దు పేరు. వీటి ముసుగు వలన భారత కుటుంబ వ్యవస్థకు ఎన్ని చిద్రాలు ఏర్పడ్డాయో! దాంతో సమాజ పునాదులు దెబ్బతింటున్నాయి ? 'ఎవరికి వారే యమునా తీరే' అనే తీరు సమాజ తంత్రంలో ఉండకూడదు కదా! నిత్యశ్రీ నిత్య మంగళం అన్న చందం కుటుంబాల్లో కూడదనుకుంటాను. 'పెద్ద' అనేది లేనంతవరకు 'చిన్న' చెలరేగుతునే ఉంటుంది. మనమంతా కలిసి మనల్ని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నామా!?. తత్సంబంధ మేలుకొలుపు వారు కనబడే కాలంలో ఉన్నారని ఆశిద్దాం. నేటి దృశ్యం శ్రవణ, పఠన మాధ్యమాలు ప్రశాంత జీవనానికి కుటుంబ వ్యవస్థ మనుగడకు ఉపయోగపడేలా పూనుకుంటే సరిపోతుందేమో. అంటే అన్ని ఎక్కువ పాళ్లలో చూపాలనేదే భావం.
గత యాభై - అరవై ఏళ్ల కాలం నుండి మాధ్యమాల ప్రాబల్యం చెప్పనలవి కాదు. చదవడం పోయింది. వినడం పోయింది. చూసే కాలం వచ్చింది. మంచిని చూపించాలి. అది ఆదర్శం కావాలి. యావత్ ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన సమాజ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అది బతికినంతకాలం సమాజం వ్యవస్థ మనగలుగుతుంది. అది లేనినాడు సమాజం ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. తల్లీ పిల్లల బంధాలు దెబ్బ తింటున్నాయి. వావి వరుసలు వణుకుతున్నాయి. తల్లిదండ్రుల మనోభావాలను తగుల పెడుతున్నారు. జీవన అనుభవ పాఠాల గొంతులు జీరబోతున్నాయి. విశ్వమంతా నాటి భారత ఘనతకు ప్రణమిల్లుతున్నది.
విద్య :
జీవితానికి, సమాజానికి ఉపయోగపడే విద్యలతో ' భారతం' ఒకప్పుడు అలరారింది. సమాజానికి కానీ మనిషి జీవనానికి కానీ ఏ సమస్యలు తలెత్తని కాలం నాటిది. ప్రపంచ మానవుడు ఈ అమ్మ ఒడిలో జీవన సార్థక విద్యను నేర్చుకొని మురిసిపోయాడు. కానీ నేడు మనం నేర్చుకున్న విద్య హంగరేయ(ఆంగ్లేయ) విద్య. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా హంగ్రీ కనిపిస్తుంది. గుమాస్తా నౌకర్ల కై, బానిస సేవకై మనకు విద్యలను నేర్పారు. మనలను నేటి రీతిగా చిత్రీకరించారు. మన దగ్గర ఉన్న విద్యతో వారు ప్రపంచ పండితులు అయిపోయారు. ఎంత దారుణం! ఏంచేస్తాం?' కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన…' అనేది మనకు ఉంది కదా అని అంటారు, దాని భావం కూడా తెలియని పండితమ్మన్యులు ఎన్ని జన్మల పాపమో ఈ విద్యకు వశమైనాం. ఆత్మ విద్య కు దూరమైనాం. అజ్ఞానానికి దగ్గరైతున్నామా?. విజ్ఞానానికి వేల మైళ్ళ దూరమవుతున్నామా? ప్రపంచ వైజ్ఞానిక విద్య మనదని ఆలోచన రావడం లేదు. దౌర్భాగ్యం! స్వామి వివేకానంద అన్నట్లు "బిడ్డ బడికి పోయి నేర్చుకునే మొదటి విషయం తన తల్లిదండ్రులు బుద్ధిహీనులు అని. రెండవ విషయం తాత ముత్తాతలు వెర్రి వారని. గురువులు మోసగాండ్రు అనేది ముచ్చటగా మూడవ విషయం. తన పవిత్ర గ్రంధములు అబద్ధం అని తెలుసుకునేది నాలుగవ విషయం." ఇదే మన వాళ్లు గత కొన్ని ఏళ్ళ నుండి వేళ్ళూనుకొనేలా అందిస్తున్నారు. ఇది అచ్చం లార్డ్ మెకాలే బ్రిటన్ పార్లమెంటులో చేసిన ప్రసంగానికి అక్షర రూపం.
భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచం కొనియాడింది. కొనియాడుతున్నది. కొనియాడబడుతుంది. ద్రవ్యశక్తి తుల్యత నియమం, థియరీ ఆఫ్ రిలేటివిటీ లకు మూలకారకుడయిన ఐన్స్టీన్ తన చివరి కాలం కల్లా భారతీయ విద్య దాని ప్రభావాన్ని, గొప్పదనాన్ని గుర్తించాడు. తాను చేసింది చాలా స్వల్పమన్నాడు. భారతీయ విద్యా ఫలాలు అద్భుతమైనవని చెప్పాడు. ఆ విషయాన్ని ఆధారాలతో సహా ఆయన చరిత్రలో చదువవచ్చు. ఇక కళావిద్య విషయం లో అక్కడి కళాకారుడు జార్జ్ బెర్నార్డ్ షా భారతీయ కళా విద్య గురించి బళ్ళారి రాఘవతో చెప్పిన మాటలు భారతీయ విద్యా ఔన్నత్యానికి నిదర్శనాలు. "యథా ఖరశ్చందన భారవాహీ భారస్య వేత్తా న తు చందనస్య" - అంటే మంచి గంధపు చెక్కల బరువును చూసి గాడిద అమ్మో! అని అనుకుంటుంది! కానీ వాటికి ఉండే విలువ దానికి ఏం తెలుస్తుంది? ఆ పరిమళాలను అందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది కదా!
భారతీయ విద్య అంటే ప్రపంచ మానవ విద్య. ప్రపంచ మానవ విద్య అంటే భారతీయ విద్య. గురజాడ అప్పారావు గారు గిరీశం తో వ్యంగ్యంగా అనిపించారో లేదో, దాన్ని పక్కన పెడితే "అన్ని వేదాల్లోని ఉన్నాయష" అనేది అక్షర సత్యం. ఒక పుష్పక విమానం, రన్నింగ్ కామెంటరీకి ఉపయోగపడిన దివ్యదృష్టి, ఆకాశవాణి, పటిష్టమైన భాషా వ్యవస్థ, అనితర సాధ్యమైన గురుకుల జీవన వ్యవస్థ, రాజకీయ విద్య, అర్థవిద్య, శృంగార విద్య…. ఇలా ఒకటేమిటి ఎన్నైనా చెప్పుకోవచ్చు. నేటి మానవులు మళ్ళీ పాణినీయ వ్యాకరణం గొప్పదంటారు. సంస్కృతభాష లాంటి భాష లేదంటారు. భారతదేశంలో కట్టిన అనేక దేవాలయాల సాంకేతికత చూసి మురిసిపోతారు. ఆ ఇంజనీరింగ్ ఇప్పుడు లేదంటారు. గ్రామంలోని వృత్తి విద్యలను పోలినవిద్యలు లేవంటారు. భారతీయ గ్రామ స్వతంత్రత జీవనాన్ని వేనోళ్ళ కొనియాడుతారు. అదీ ఆనాటి మన విద్యలకు ప్రతిరూపం. దేశాల పరభాగ్యోపజీవనం నేటి విద్యల గొప్పతనం.
కళలు :
చతుష్షష్టి (64) కళల గూర్చి మనకు తెలుసు. అందులో సగం కూడా భారతేతరులకు తెలియవేమో! అందుకే మొదట్లోనే అనుకున్నాం - ఇంటి చెట్టు మందుకు పనికి రాదనే విషయం. దాన్ని పక్కన పెడితే కళల్లో ఉన్న కనీసం లలిత కళలను కూడా మనం మనదైన ప్రపంచానికి చెప్పుకోకుండా చేశారు. దిగుమతి కళలతో సుంకాలు చెల్లిస్తున్నాం. కవిత్వం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం వీటన్నింటికీ భారతీయ పద్ధతులు ఒక క్రమబద్ధమైన నిర్మాణంలో ఉన్నాయి. అంటే శాస్త్రీయంగా ఉన్నాయని అర్థం. చేతగానివాడు 'చేవ' లేక 'చాప' లాగినట్లు మనం విలువలతో కూడిన విద్యను బరువుగా భావిస్తన్నాం. దాన్ని మోయలేక వదులు కుంటున్నాం. అన్యాధారాల విద్యలను మోస్తున్నాం. అది తప్పు అనీ తెలుసు. దేన్ని ఎవరెలా భావిస్తున్న వజ్రం వజ్రమే. తామ్రం తామ్రమే.
ఇలా చెప్తూ పోతే వైద్యం, సేవ, అధ్యాత్మికత, పరిపాలన,.. ఇలా ఎన్నో విషయాల్లో మనం మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి. కానీ అలా కాకుండా చేస్తున్నారు. వాటి పాతరకు కంకణం కట్టుకున్నారు భావ దాసులు. మన కంట్లో మన వేలు పెట్టించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. అనేక పాట్లు పడుతున్నారు. మన విలువలను అమ్మకానికి పెడుతున్నారు. మనం గ్రహపాటు తలుచుకుంటూన్నామా? మా తాతలు నేతులు తాగారు మేము వాళ్ల మూతులు నాకుతాం? - అనే చందంగా కూర్చోకూడదు కదా! భావదాసులందరు లార్డ్ మెకాలె మానస పుత్రులు. వారు మేం మన్ను బుక్కిస్తున్నాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే మన్ను తినే వాడి గుట్టు వారికి తెలియదు. శ్రీకృష్ణుణ్ణీ చూస్తే తెలియటం లేదేమో! తెలిసినా తెంపరి తనేమోమొ! శ్రీ కృష్ణ గుణ సంపన్నత ఈ దేశ భావ మూలాల్లోకి వెళ్ళుతుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ శోభిస్తుంది. నేటి ఈ దిగుమతి అవలక్షణాలు అంతమయ్యే సమయం కనుచూపు మేరలోనే కనబడుతుందని ఆశిద్దాం!
వందేమాతరం!
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం।
తత్పదం దర్శితం నిత్యం భారతీ తీర్థ మాశ్రయే।।
మంగళం మహత్।
డాక్టర్ వొజ్జల శరత్ బాబు
9963533937
Thursday, July 16, 2020
విరాట పర్వంలో పాండవుల మారు పేర్లు - వ్యాసుని సత్య దృష్టి
Wednesday, July 15, 2020
శ్రీరాముడు రాజ్యాంగబద్ధమైన మరియు సాంస్కృతిక ప్రతీక. (రామజన్మభూమి ఉద్యమ గాధ-9)
Tuesday, July 14, 2020
ఉపనిషత్తులు - పరిచయం (కఠోపనిషత్తు)
*మరణం లేని మహావీరులు*
*మరణం లేని మహావీరులు* "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...
-
యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహా గిరిః ఉభౌఖ్యాతౌ రత్న నిధీ తథా భారత ముచ్యతే ( ఆదిపర్వం) పరమ పవిత్రమైన సముద్రము మహోన్నతమైన మేరు పర్వతము, సర్...
-
తెలుగు సాహిత్యంలో అవధానం అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ. ఏ ఇతర భాషల్లో లేనిది కేవలం తెలుగులో మాత్రమే ఉన్నది అవధానం.సంస్కృతం, తెలుగు...
-
ఒక దేశం యొక్క అభివృద్ధి మరియు పతనము అనేవి ఆదేశం యొక్క విద్యా విధానాన్ని బట్టియే ఉంటాయి. విద్య అనేది కేవలం ఉదర పోషణ క...