ఏదీ - ఎలా ?
మనదేశం గురించి తెలుసుకోవడమంటే యావత్ ప్రపంచం గురించి తెలుసుకోవటమే.
విశ్వవిజ్ఞానాన్ని ఆపోశన పెట్టడమే. వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అన్నారు. వ్యాసుడు చెప్పని విషయమనేది ప్రపంచంలో లేదు అనే మాట కూడా ఉంది. దురదృష్టవశాత్తు ' ఇంటి చెట్టు మందుకు పనికి రాదు' అనే రీతి తయారైంది మనది. మనగూర్చి తెలుసుకొనే ఓపిక, సమయం మనకు లేకపాయే. మనకు పక్కింటి వ్వవహారాసక్తి ఎక్కువ! మనమంటే ఏంటో చూపుకొనే సత్తా ఉంది. కానీ స్తబ్దపు తెరలో ఉంటున్నాం! ఆత్మన్యూనతా భావాగ్రస్థులమైనాం! బానిస మనస్తత్త్వంతో కూనారిల్లుతున్నాం ? అదీ మన ప్రారబ్దకర్మేనా?
'ఒక వృక్షం వేల కొలది ఏళ్ళ నుండి జీవిస్తున్నది. పది మందికి నీడనిస్తున్నది. వేల తరాలకు పూలను, కాయలను పండ్లను అందిస్తున్నది.' అంటే దాని వేర్లు ఎంత బలంగా ఉండి ఉంటాయో చెప్పనవసరం లేదు. ఆవృక్షాన్ని తరతరాలుగా రక్షించుకుంటున్న ఆ యజమానింట బోన్సాయ్ బ్రతుకువాడు ప్రవేశిస్తే ఏం జరుగుతుందో సులభగ్రాహ్యమే కదా! ఇదే మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు అక్షరానువర్తితం.
పుండైన వేలుకే దెబ్బ తగిలి నట్లు తుర్కీ'పుండు' కు ఆంగ్లేయ రాయి దెబ్బ తగిలింది. అమ్మా!ఎంత అవస్థో! అన్నాం. ''పుండు మగ్గిందే'' అని అందరూ అన్నారు. కానీ పుండున్న దేహం మాత్రం తన బాధను మింగాలేక కక్కాలేక పోతున్నది. బానిస రక్తం ఆపుండు సమూల నాశనానికి వైద్యాన్ని చేరనీయదుగా?
మన గూర్చి మనం తెలుసుకోవాలనే మనసుంటే మార్గం ఉంటుంది. మనం ఎలా ఉండాలో తెలియ జెప్పిన సూత్రాలూ ఉన్నాయి. అవి అందరికీ అత్యావశ్యకం. ఏ కర్మ(ఖర్మ) ఫలమో! మన గ్రంధాలకు, ఆధారాలకు అనుచిత భాష్యాలు అందించింది మన వారే ! అలా మనలను విపరీతపుటాలోచనల్లోకి నెట్టిందీ మన వారే! డోలాయసముద్రములో ముంచుతున్నదీ మన మనోబానిస ఆత్మీయులే!
వేదాలకు,ఇతిహాసాలకు, పురాణాలకు, వక్రభాష్యాలందించారు. ఆచార వ్యవహారాల, సంస్కృతి సంప్రదాయాల వెన్నెముకలను విరుస్తున్నారు. వీటికి కారణాలనూ ఉటంకిస్తారు. చరిత్ర ఆధారం అని కొందరు! సామాజిక ఆధారం అని మరికొందరు! మూలాధారాలని ఇంకొందరు! మిగిలిన వారందరూ నోరు మూసుకోవలసిందే అని తందనాల వారందరూ! ఇలా మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు గండి కొడుతూ, అలా మేం గొప్ప వాళ్ళమని చప్పట్లు కొట్టించుకుంటారు.
వివాదాలను పరిష్కరించుకోవాలి. అంటే వాక్ శుద్ధి అవసరం. మనం అరోగత్వంతో ఉండాలంటే రక్తశుద్ధి అవశ్యం. ఆ రక్తశుద్ధి కి కావలసిన మందులన్నీ పైన తెలుపుకున్న పుస్తకాల్లోనే ఉన్నాయి. ఆ భావామృతపానంలో గోచరిస్తాయి. భారతమాతకు మనం జై కొట్టడం కాదు, యావత్ ప్రపంచం విశ్వమాతకు వందనం అంటుంది. దానికి కావాల్సింది ఏంటో మనందరికి తెలిసిందే. మనకు ఏది అనవరమో మన బానిస మానసీయులు దాన్నే చెపుతారు. ఏదో ఒక విషయం చూపుతారు. అదంతా లేదా ఆ గ్రంథమే వ్యర్థమని చెపుతారు. ఆమొత్తాన్ని కొట్టి పడేస్తారు. మనలో తప్పుడు భావనలకు పురుడు పోస్తారు. అలా మన భావనలన్నీ మరుగున పడిపోయేలా సైంధవకార్యాన్ని నిర్వర్తిస్తారు. ఆలాంటి అంశాల్లో కొన్ని స్పృశించే ప్రయత్నం చేద్దాం.
ధర్మ సూత్రాలు:
విశ్వమానవ జాతికి ఆదర్శ ప్రాయంగా ఉన్న సూత్రాలు మనవి. ప్రతీ విషయంలో కాలానుగతంగా మంచి - చెడులు పెనవేసుకొని ఉండటం సహజం. మంచిని స్వీకరించడమే భారతీయ ధర్మం. కానీ మనోబానిసత్వం మంచిని వదిలి చెడును పట్టుకొని వేలాడేలా చేస్తున్నది.
''వేదోౕఽధర్మమూలమ్''(ధర్మానికి మూలం వేదం) అని గౌతముడు ధర్మానికి మూలాధారం గూర్చి చెప్పాడు. చోదనా లక్షణోఽర్థోధర్మః. (నడిపించే లక్షణం కల అర్థంతో కూడినదే ధర్మం) అని జైమిని చెప్పాడు. వీటిని బట్టి మనిషి చేయదగిన విధులను బోధించేదే ధర్మం. ధర్మ సూత్రాలు ఆ పనినే చేస్తాయి.
ఒకరు వేసుకున్న బట్టలు, చెప్పులు వేరొకరు వేసుకోకూడదు. గోళ్ళను పళ్ళతో కొరికి తీయకూడదు. లౌకిక, శాస్త్ర సంబంధ విషయాల్లో మొండి వాదన వలదు. సరదాకైనా పాచికలాడరాదు. చేతులో చెప్పులు పట్టుకోకూడదు - తిరుగరాదు. కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి.
పై మాటల్లాంటి వాటిని చూస్తే ఆహా! చక్కని ధర్మశాస్త్రాలని అన్పించి తీరుతుంది. కానీ,మన వాళ్ళందించిన వాటిని ఇతరులు The old liquid in new Bottle గా అందిస్తున్నారు. అది మన బానిసబుద్ధి గమనించటం లేదు. ఆ మత్తులో తెలియాడుతాం. ఇంటిల్లిపాదిపై అరుస్తాం. కరుస్తాం! ఈ బుద్ధి మనసు(షుల)లను వదులదా? ఎలా అయితే వదులుతుంది? మరి వేచి చూడాల్సిందేనా!? నడుం కట్టాల్సిందేనా?
కుటుంబ వ్యవస్థ:
భారతీయ ఔన్నత్యకిరీటంలో తళ తళా మెరిసే వజ్రం పెళ్లి - కుటుంబ వ్యవస్థ. ఎనిమిది రకాల పెళ్లిళ్లను మనవాళ్ళు ఏనాడో వర్గీకరించారు. అందులో బ్రాహ్మ్యము, దైవము, ఆర్షం, ప్రాజాపత్యం అనేవి ఉత్తమ వివాహాలని చెప్పారు. అసురము - డబ్బుకు ప్రలోభ పెట్టి చేసుకునే వివాహం. గాంధర్వం - కేవలం కామసంబంధం కోసమే చేసుకునే వివాహం. రాక్షసం - కన్య ఇష్టం మేరకు, పెద్దల పైకి తిరగబడి కన్యను తీసుకెళ్లి చేసుకునే వివాహం. పైశాచం - ఇష్టం లేకున్నా కన్యను బలాత్కారం చేసి చేసుకొనే వివాహం. ఇవి అధమ వివాహాలని చెప్పారు. ప్రస్తుతం సమాజం లోని కొంత మొదటి నాలుగింటిని వదిలేలా ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతోంది. 'సంస్కరణలు' అని వీటి ముద్దు పేరు. వీటి ముసుగు వలన భారత కుటుంబ వ్యవస్థకు ఎన్ని చిద్రాలు ఏర్పడ్డాయో! దాంతో సమాజ పునాదులు దెబ్బతింటున్నాయి ? 'ఎవరికి వారే యమునా తీరే' అనే తీరు సమాజ తంత్రంలో ఉండకూడదు కదా! నిత్యశ్రీ నిత్య మంగళం అన్న చందం కుటుంబాల్లో కూడదనుకుంటాను. 'పెద్ద' అనేది లేనంతవరకు 'చిన్న' చెలరేగుతునే ఉంటుంది. మనమంతా కలిసి మనల్ని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నామా!?. తత్సంబంధ మేలుకొలుపు వారు కనబడే కాలంలో ఉన్నారని ఆశిద్దాం. నేటి దృశ్యం శ్రవణ, పఠన మాధ్యమాలు ప్రశాంత జీవనానికి కుటుంబ వ్యవస్థ మనుగడకు ఉపయోగపడేలా పూనుకుంటే సరిపోతుందేమో. అంటే అన్ని ఎక్కువ పాళ్లలో చూపాలనేదే భావం.
గత యాభై - అరవై ఏళ్ల కాలం నుండి మాధ్యమాల ప్రాబల్యం చెప్పనలవి కాదు. చదవడం పోయింది. వినడం పోయింది. చూసే కాలం వచ్చింది. మంచిని చూపించాలి. అది ఆదర్శం కావాలి. యావత్ ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన సమాజ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అది బతికినంతకాలం సమాజం వ్యవస్థ మనగలుగుతుంది. అది లేనినాడు సమాజం ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. తల్లీ పిల్లల బంధాలు దెబ్బ తింటున్నాయి. వావి వరుసలు వణుకుతున్నాయి. తల్లిదండ్రుల మనోభావాలను తగుల పెడుతున్నారు. జీవన అనుభవ పాఠాల గొంతులు జీరబోతున్నాయి. విశ్వమంతా నాటి భారత ఘనతకు ప్రణమిల్లుతున్నది.
విద్య :
జీవితానికి, సమాజానికి ఉపయోగపడే విద్యలతో ' భారతం' ఒకప్పుడు అలరారింది. సమాజానికి కానీ మనిషి జీవనానికి కానీ ఏ సమస్యలు తలెత్తని కాలం నాటిది. ప్రపంచ మానవుడు ఈ అమ్మ ఒడిలో జీవన సార్థక విద్యను నేర్చుకొని మురిసిపోయాడు. కానీ నేడు మనం నేర్చుకున్న విద్య హంగరేయ(ఆంగ్లేయ) విద్య. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా హంగ్రీ కనిపిస్తుంది. గుమాస్తా నౌకర్ల కై, బానిస సేవకై మనకు విద్యలను నేర్పారు. మనలను నేటి రీతిగా చిత్రీకరించారు. మన దగ్గర ఉన్న విద్యతో వారు ప్రపంచ పండితులు అయిపోయారు. ఎంత దారుణం! ఏంచేస్తాం?' కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన…' అనేది మనకు ఉంది కదా అని అంటారు, దాని భావం కూడా తెలియని పండితమ్మన్యులు ఎన్ని జన్మల పాపమో ఈ విద్యకు వశమైనాం. ఆత్మ విద్య కు దూరమైనాం. అజ్ఞానానికి దగ్గరైతున్నామా?. విజ్ఞానానికి వేల మైళ్ళ దూరమవుతున్నామా? ప్రపంచ వైజ్ఞానిక విద్య మనదని ఆలోచన రావడం లేదు. దౌర్భాగ్యం! స్వామి వివేకానంద అన్నట్లు "బిడ్డ బడికి పోయి నేర్చుకునే మొదటి విషయం తన తల్లిదండ్రులు బుద్ధిహీనులు అని. రెండవ విషయం తాత ముత్తాతలు వెర్రి వారని. గురువులు మోసగాండ్రు అనేది ముచ్చటగా మూడవ విషయం. తన పవిత్ర గ్రంధములు అబద్ధం అని తెలుసుకునేది నాలుగవ విషయం." ఇదే మన వాళ్లు గత కొన్ని ఏళ్ళ నుండి వేళ్ళూనుకొనేలా అందిస్తున్నారు. ఇది అచ్చం లార్డ్ మెకాలే బ్రిటన్ పార్లమెంటులో చేసిన ప్రసంగానికి అక్షర రూపం.
భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచం కొనియాడింది. కొనియాడుతున్నది. కొనియాడబడుతుంది. ద్రవ్యశక్తి తుల్యత నియమం, థియరీ ఆఫ్ రిలేటివిటీ లకు మూలకారకుడయిన ఐన్స్టీన్ తన చివరి కాలం కల్లా భారతీయ విద్య దాని ప్రభావాన్ని, గొప్పదనాన్ని గుర్తించాడు. తాను చేసింది చాలా స్వల్పమన్నాడు. భారతీయ విద్యా ఫలాలు అద్భుతమైనవని చెప్పాడు. ఆ విషయాన్ని ఆధారాలతో సహా ఆయన చరిత్రలో చదువవచ్చు. ఇక కళావిద్య విషయం లో అక్కడి కళాకారుడు జార్జ్ బెర్నార్డ్ షా భారతీయ కళా విద్య గురించి బళ్ళారి రాఘవతో చెప్పిన మాటలు భారతీయ విద్యా ఔన్నత్యానికి నిదర్శనాలు. "యథా ఖరశ్చందన భారవాహీ భారస్య వేత్తా న తు చందనస్య" - అంటే మంచి గంధపు చెక్కల బరువును చూసి గాడిద అమ్మో! అని అనుకుంటుంది! కానీ వాటికి ఉండే విలువ దానికి ఏం తెలుస్తుంది? ఆ పరిమళాలను అందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది కదా!
భారతీయ విద్య అంటే ప్రపంచ మానవ విద్య. ప్రపంచ మానవ విద్య అంటే భారతీయ విద్య. గురజాడ అప్పారావు గారు గిరీశం తో వ్యంగ్యంగా అనిపించారో లేదో, దాన్ని పక్కన పెడితే "అన్ని వేదాల్లోని ఉన్నాయష" అనేది అక్షర సత్యం. ఒక పుష్పక విమానం, రన్నింగ్ కామెంటరీకి ఉపయోగపడిన దివ్యదృష్టి, ఆకాశవాణి, పటిష్టమైన భాషా వ్యవస్థ, అనితర సాధ్యమైన గురుకుల జీవన వ్యవస్థ, రాజకీయ విద్య, అర్థవిద్య, శృంగార విద్య…. ఇలా ఒకటేమిటి ఎన్నైనా చెప్పుకోవచ్చు. నేటి మానవులు మళ్ళీ పాణినీయ వ్యాకరణం గొప్పదంటారు. సంస్కృతభాష లాంటి భాష లేదంటారు. భారతదేశంలో కట్టిన అనేక దేవాలయాల సాంకేతికత చూసి మురిసిపోతారు. ఆ ఇంజనీరింగ్ ఇప్పుడు లేదంటారు. గ్రామంలోని వృత్తి విద్యలను పోలినవిద్యలు లేవంటారు. భారతీయ గ్రామ స్వతంత్రత జీవనాన్ని వేనోళ్ళ కొనియాడుతారు. అదీ ఆనాటి మన విద్యలకు ప్రతిరూపం. దేశాల పరభాగ్యోపజీవనం నేటి విద్యల గొప్పతనం.
కళలు :
చతుష్షష్టి (64) కళల గూర్చి మనకు తెలుసు. అందులో సగం కూడా భారతేతరులకు తెలియవేమో! అందుకే మొదట్లోనే అనుకున్నాం - ఇంటి చెట్టు మందుకు పనికి రాదనే విషయం. దాన్ని పక్కన పెడితే కళల్లో ఉన్న కనీసం లలిత కళలను కూడా మనం మనదైన ప్రపంచానికి చెప్పుకోకుండా చేశారు. దిగుమతి కళలతో సుంకాలు చెల్లిస్తున్నాం. కవిత్వం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం వీటన్నింటికీ భారతీయ పద్ధతులు ఒక క్రమబద్ధమైన నిర్మాణంలో ఉన్నాయి. అంటే శాస్త్రీయంగా ఉన్నాయని అర్థం. చేతగానివాడు 'చేవ' లేక 'చాప' లాగినట్లు మనం విలువలతో కూడిన విద్యను బరువుగా భావిస్తన్నాం. దాన్ని మోయలేక వదులు కుంటున్నాం. అన్యాధారాల విద్యలను మోస్తున్నాం. అది తప్పు అనీ తెలుసు. దేన్ని ఎవరెలా భావిస్తున్న వజ్రం వజ్రమే. తామ్రం తామ్రమే.
ఇలా చెప్తూ పోతే వైద్యం, సేవ, అధ్యాత్మికత, పరిపాలన,.. ఇలా ఎన్నో విషయాల్లో మనం మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి. కానీ అలా కాకుండా చేస్తున్నారు. వాటి పాతరకు కంకణం కట్టుకున్నారు భావ దాసులు. మన కంట్లో మన వేలు పెట్టించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. అనేక పాట్లు పడుతున్నారు. మన విలువలను అమ్మకానికి పెడుతున్నారు. మనం గ్రహపాటు తలుచుకుంటూన్నామా? మా తాతలు నేతులు తాగారు మేము వాళ్ల మూతులు నాకుతాం? - అనే చందంగా కూర్చోకూడదు కదా! భావదాసులందరు లార్డ్ మెకాలె మానస పుత్రులు. వారు మేం మన్ను బుక్కిస్తున్నాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే మన్ను తినే వాడి గుట్టు వారికి తెలియదు. శ్రీకృష్ణుణ్ణీ చూస్తే తెలియటం లేదేమో! తెలిసినా తెంపరి తనేమోమొ! శ్రీ కృష్ణ గుణ సంపన్నత ఈ దేశ భావ మూలాల్లోకి వెళ్ళుతుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ శోభిస్తుంది. నేటి ఈ దిగుమతి అవలక్షణాలు అంతమయ్యే సమయం కనుచూపు మేరలోనే కనబడుతుందని ఆశిద్దాం!
వందేమాతరం!
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం।
తత్పదం దర్శితం నిత్యం భారతీ తీర్థ మాశ్రయే।।
మంగళం మహత్।
డాక్టర్ వొజ్జల శరత్ బాబు
9963533937
అన్నగారు భారతదేశ ఔన్నత్యాన్ని,ఈ దేశ ఘనమైన వారసత్వ సంపదను కళ్ళకు కట్టినట్లు చూపించారు
ReplyDeleteగాజుల వారికి నమస్సులతో,మీ ఆత్మీయతకు ధన్యుడను.
ReplyDeleteకృతజ్ఞతలు అన్న,మీ సహకారం మన్ముందుకూడా అందించాలని కోరుతున్నాను
Deleteభారతీయ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యాన్ని సోపపత్తికంగా వివరించారు. ఆసక్తికరమైన రచనా శైలితో మీ వ్యాసం ఆద్యంతమూ ఆకట్టుకుంది. శుభాభినందనలు శరత్ అన్న.
ReplyDelete@ స్తంభంకాడి గంగాధర్
గంగాధర్ జీ! ధన్యోస్మి.మీ పలుకు బలం బలం!
ReplyDelete